Jan 22,2023 07:42

'సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారీ భౌగోళిక, రాజకీయ, నియంత్రణ, అణచివేత వ్యవస్థ. దీనిని ఓడించాలంటే ముందు అర్థం చేసుకోవాలి.'
-1967లో ట్రై కాంటినెంటల్‌కు ఇచ్చిన సందేశంలో చే గువేరా అన్న మాటలివి ! ఆ తరువాత ఆయన దానిని క్లుప్తంగా విశ్లేషించారు. మానవాళి కర్తవ్యమేమిటో విశదీకరించారు. సామ్రాజ్యవాదానికి మన జీవితాలకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు సామ్రాజ్యవాదం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే కానీ చే గువేరా దానిని ఓడించాలని ఎందుకు పిలుపునిచ్చారో అర్థం కాదు. 'చే' ఇచ్చిన స్పూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీరులు, మేధావులు, అభ్యుదయ శక్తులు, ప్రజాతంత్ర వాదులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు గళం విప్పుతున్నారు. వీరందరినీ అంతగా కదిలించిందేమిటి ? దీనిమీదే ఈ ప్రత్యేక కథనం..

che

అమెరికన్‌ సామ్రాజ్యవాదం లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగించిన దురాక్రమణలకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన విప్లవ వీరుడు చే గువేరా. తనది మహౌన్నత సమాజం అని గొప్పగా చెప్పుకొనే అమెరికా ప్రచారంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడమే కాకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తగ్గేదేలే అంటూ నేరుగా కధనరంగంలోకి దిగాడు. కాంగో, గ్వాటెమాల, బొలీవియాల్లో అగ్ర రాజ్య కుట్రలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని సాగించాడు. ఆ క్రమంలోనే బొలీవియాలో 1967 అక్టోబరు9న సామ్రాజ్యవాదుల కర్కశత్వానికి బలయ్యాడు. సామ్రాజ్యవాదుల దోపిడీ, మార్కెట్‌ విస్తరణవాదం ఉన్నంత వరకు చే రగిలించిన విప్లవ స్పూర్తి చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంటుంది. నేడు సామ్రాజ్యవాద దురాగతాలకు ఎదురవుతున్న ప్రతిఘటన దీనినే రుజువుచేస్తున్నది.

099

'సామ్రాజ్యవాదం అనేది ఒక ప్రపంచస్థాయి వ్యవస్థ. పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నతదశ. దీనిని ప్రపంచస్థాయి ఘర్షణతోనే ఓడించగలం. సామ్రాజ్యవాద విధ్వంసమే ఈ పోరాటానికి వ్యూహాత్మక ముగింపు కావాలి. సామ్రాజ్యవాద పునాదులను సమూలంగా నిర్మూలించడం దోపిడీకి గురవుతున్న, వెనుకబడిన దేశాల బాధ్యత కావాలి. మన అణగారిన దేశాల నుండి మూల ధనాన్ని, ముడి పదార్థాలను, సాంకేతిక నిపుణులను, చౌకగా దొరికే కార్మికులను వారి నూతన రాజధానులకు తరలిస్తారు. ఆ నగరాలే దోపిడీకి, ఆధిపత్యానికి సాధనాలుగా మారతాయి. మనల్ని సంపూర్ణంగా ఆధిపత్యమనే అంధకారంలో ముంచెత్తుతారు.' అంటాడు ఒక సందర్భంలో 'చే'.

55

                                                                           మార్కెట్లే కీలకం

సామ్రాజ్యవాదమనగానే రాజులు చేసిన దండయాత్రలు, రాజ్య విస్తరణలు గుర్తుకొస్తాయి. కానీ, ఆ రాజులు చేసిన యుద్ధాలకు, సామ్రాజ్యవాదానికి ఎటువంటి సంబంధమూ లేదు. వారిది కేవలం రాజ్య విస్తరణ కాంక్షే. సామ్రాజ్యవాదం అలా కాదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పెట్టుబడిదారులు పాలకులను తమ గుప్పిట్లో పెట్టుకుని, తమ ప్రయోజనాలే పరమావధిగా ప్రపంచ పెత్తనం సాగించడమే సామ్రాజ్యవాదం. పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడిదారుల వలన, పెట్టుబడిదారుల కోసమే సామ్రాజ్యవాదం పనిచేస్తుంది. పారిశ్రామిక విప్లవానికి ముందు పెట్టుబడిదారులు లేరు. అందువల్ల, పారిశ్రామిక విప్లవం తరువాతే మనం చెప్పుకుంటున్న సామ్రాజ్యవాదం ఆవిర్భవించింది. అయితే, తొలి దశలో సామ్రాజ్యవాదానికీ ఇప్పుడు మనం చూస్తున్న సామ్రాజ్యవాదానికి ఎటువంటి పోలికా లేదు. పెట్టుబడి ప్రవాహం విశ్వవ్యాప్తమైంది. దాని స్వభావమూ మారింది. మారిన పెట్టుబడి స్వభావంతో పాటే సామ్రాజ్యవాద స్వభావమూ మారింది. పారిశ్రామిక విప్లవ ఫలితాలను తొలుత అత్యధికంగా అనుభవించింది ఇంగ్లండ్‌ అన్న సంగతి తెలిసిందే. ఆ కారణం చేతనే అక్కడ పెట్టుబడిదారీ వర్గం పుట్టింది. కుప్పలు తెప్పలుగా ఉత్పత్తి జరగడంతో మార్కెట్ల కోసం అన్వేషణ ప్రారంభమైంది. వ్యాపార విస్తరణలో భాగంగానే వలసరాజ్యాలు ఏర్పాటయ్యాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి క్రమేణా ఈ దేశాన్ని ఆక్రమించి, బ్రిటిష్‌ వలసరాజ్యంగా మార్చిన సంగతి తెలిసిందే ! అలా రవి అస్తమించని మహా సామ్రాజ్యంగా బ్రిటన్‌ రూపుదిద్దుకుంది. స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మగాంధీ ఇచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ పిలుపు లక్ష్యం వారి వ్యాపార ప్రయోజనాలను దెబ్బతియ్యడమే. మొదటి ప్రపంచయుద్ధం, రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ దెబ్బతింది. మరోవైపు ఇంగ్లండ్‌ ఆవిష్కరణల్లో ఒకటైన అమెరికా పారిశ్రామికంగా బలపడింది. దీంతో పెట్టుబడి ప్రవాహం అక్కడకు చేరుకుంది. కొత్త సామ్రాజ్యవాద శక్తిగా అమెరికా బలపడింది. భూగోళంపై రాబందుల రెక్కల చప్పుడు ప్రారంభమైంది.

088

గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో... పాట గుర్తుంది కదా! అచ్చం ఆ పాటలో మాదిరే సామ్రాజ్యవాదం బుసలు కొడుతుంది. బుసబుసమని పొంగుతూ మన ఇళ్లలో తిష్టవేసింది. కూల్‌ డ్రింకుల నుండి స్మార్ట్‌టీవిలలో పోగ్రామ్‌లదాకా, కార్పొరేట్‌ దినపత్రికల నుండి సోషల్‌మీడియా దాకా అంతా సామ్రాజ్యవాద విషమే! మన పొలాల్లో పంటై, మనం తినే ఆహారమై, మన చదువుల సారమై, మెదళ్లను కబళించి, వెన్నులను విరిచేసి, సమూహాలను నిర్మూలించి, సమిష్టితత్వాన్ని ధ్వంసం చేసి, వ్యక్తులను మాయం చేసి, వ్యక్తిత్వాలను మంట గలిపి, అంతా తానేయై, తానే అంతాయై ఏకఛత్రాధిపత్యం కోసం అర్రులు చాస్తోంది !

77

                                                                               కుట్రలు చేస్తుంది

బ్రిటన్‌ మాదిరి అమెరికా సామ్రాజ్య వాదం ఏ దేశాన్నీ నేరుగా పాలించదు. దీనికోసం తన సైనిక శక్తిని, సామర్ధ్యాన్ని విపరీతంగా పెంచుకుంది. వలస రాజ్యాలను ఏర్పాటు చేసి, పాలన సాగించదు. కానీ దేశాల పాలకులను తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. దీనికోసం ఆ దేశాల్లో కుట్రలు చేస్తుంది. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తుంది. తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. బ్రిటన్‌ వలస రాజ్యాలను ఎంతో కొంత అభివృద్ధి చేయాల్సి వచ్చింది. తన అవసరాల కోసమైనా మౌలిక వసతులును, విద్య, వైద్యం వంటి సదుపాయాలను ఎంతో కొంతమేర అందించి.. వలస దేశాల్లో మార్పునకు దోహదం చేసింది. అమెరికా, ఇతర దేశాల్లో మార్పునకు ఏమాత్రం దోహదపడదు. పైగా అక్కడి సమాజాలు ఎంత అంథకారంలో, మూఢత్వంలో ఉంటే అంతగా తన మార్కెట్‌ అవసరాలను నెరవేర్చుకోవచ్చు. దీనికోసం వివిధ దేశాల్లోని అస్థిత్వ వాదనలను రెచ్చగొడుతుంది. అంతర్గత గ్రూపులకు, మతతత్వ వాదులకు మద్దతిస్తుంది. దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలను రేపుతుంది. ఏదో ఒక దేశం వైపు చేరి, ఆ దేశానికి ఆయుధాలను అమ్ముతుంది. స్వేచ్ఛ, సమానత్వం, మానవహక్కుల ముసుగులో ఈ పనులు చేస్తుంది. వలస రాజ్యాల ఏర్పాటుకు బదులుగా వివిధ దేశాల్లో సైనిక పోస్టులను ఏర్పాటు చేస్తుంది. పరస్పర సహకారం పేరిట ఏర్పాటు చేసే ఈ శిబిరాల్లోని సైనిక శక్తిని చూపి, ఆ దేశాలను తన నియంత్రణలో ఉంచుకుంటుంది. తన వలస దేశాల్లోని దోపిడీ వర్గాలను బ్రిటన్‌ సామ్రాజ్యవాదం తన జీతగాళ్లగానే చూసింది. తన లాభాల వేటలో వారికి వాటా కల్పించడానికి నిరాకరించింది. దీంతో వారంతా జాతీయ విముక్తి పోరాటాలకు మద్దతుగా నిలిచారు. ఆ దేశాలు స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయ బూర్జువాలుగా అవతరించారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదం మొదటి నుండి దీనికి భిన్నంగా వ్యహరించింది. తాను కాలుపెట్టిన ప్రతిచోటా అక్కడి దోపిడీ వర్గాలను తనతో కలుపుకుంది. వారికి దోపిడీలో వాటా కల్పించింది. దీంతో వారిలో జాతీయతా భావం అడుగంటింది. జాతీయ భావనలకు, పోరాటాలకు మద్దతివ్వడం మానుకున్నారు. ప్రపంచీకరణ పనిముట్లుగా మారారు.

022

                                                                              అత్యున్నత దశలో...

పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా సామ్రాజ్యవాదాన్ని లెనిన్‌ అభివర్ణించారు. ప్రస్తుతం సామ్రాజ్యవాదం దాని అత్యున్నతమైన మూడవ దశలో ఉందని చెబుతున్నారు. పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగాల పెట్టుబడుల కలయికతో ద్రవ్య పెట్టుబడి ఆవిర్భవించడం మొదటి దశ. ఈ దశలోనే సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ పెరిగింది. యుద్ధాలు అనివార్యమైనాయి. రెండవ దశలో అంతర్జాతీయ ద్రవ్య విధానం అమలులోకి వచ్చింది. రెండవ ప్రపంచయుద్ధంతో అప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు బలహీనపడ్డాయి. సోషలిస్టు శిబిరం బలంగా ఉనికిలోకి వచ్చింది. సంక్షేమరాజ్య భావన ఉనికిలోకి వచ్చింది. మొత్తంమీద అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచం మీద పైచేయి సాధించింది. మూడవది, అత్యున్నతమైనదిగా చెబుతున్న ప్రస్తుత దశలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రపంచంపై ఆధిపత్యం సాధించింది. దీనిలో వివిధ దేశాల వాటా ఉన్నప్పటికీ సింహభాగం అమెరికాదే. దీంతో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ దశలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మొత్తం ప్రపంచాన్ని కార్యరంగంగా మార్చుకుంది. దీంతో సామ్రాజ్యవాద దేశాల మధ్య విభేదాలు కొంతమేర తగ్గినట్లు కనిపిస్తోంది. అయినా, సామ్రాజ్యవాద దేశాల కారణంగా ఏర్పడే యుద్ధ ప్రమాద భయం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ యుద్ధాలతో ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా దీనికి నిదర్శనం. యుద్ధరంగంలో ఉక్రెయిన్‌ కనపడుతున్నప్పటికీ దాని వెనుక ఉన్నది అమెరికా, నాటోలు అన్నది బహిరంగ రహస్యమే !

66

                                                                        అమెరికా నరహంతక చరిత్ర..

అమెరికన్‌ సామ్రాజ్యవాద చరిత్ర అంతా రక్తసిక్తం. పుట్టుక నుండి ప్రతి దశలోనూ నెత్తుటి ధారలతో ఆ దేశ చరిత్ర నిండింది. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వేల సంఖ్యలోనే ఇంగ్లండ్‌ ప్రజలు అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ నివసిస్తున్న స్థానిక తెగలతో ఒప్పందం చేసుకుని, 13 కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు. గనుల తవ్వకాలకోసం అన్వేషణ జరపడం వీరి లక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం 1625లో 2,000 మంది ఇంగ్లండ్‌ ప్రజలు అమెరికాకు వెళ్లగా 1775 నాటికి వీరి సంఖ్య 24 లక్షలకు చేరింది. ఆ మేరకు స్థానిక తెగల ప్రజల్లో కొందరిని హతమార్చారు. మరికొందరిని బానిసలుగా చేసుకుని, ఇతర ప్రాంతాలకు తరలించారు. 1776లో ప్రధాన భూమి నుండి స్వాతంత్య్రం పొందిన తరువాత స్థానిక తెగలను ఊచకోత కోశారు. అపాచీ, చెరోకీ, చ్చెయెన్నీ, చినూక్‌, నవజో, సియోక్స్‌ తదితర గిరిజన జాతులను సమూలంగా నిర్మూలించారు. ఐదు శతాబ్దాల కాలంలో 10 కోట్ల మంది మూలవాసులను నిర్మూలించి ఉంటారని అంచనా. ప్రస్తుత అమెరికా సరిహద్దులోనే 1492 నుండి 1900 వరకు 1.20 కోట్ల మంది మూలవాసీలు చనిపోయారు. 16 నుండి 19 శతాబ్దాల మధ్య కాలంలో ఆఫ్రికా నుండి దాదాపుగా మూడు కోట్ల మందిని బానిసలుగా పట్టి, తెచ్చారు. ఇప్పటిదాకా అణుబాంబును ప్రయోగించిన ఏకైక దేశం అమెరికానే ! రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు 1.40 లక్షల మందిని, నాగసాకిపై వేసిన బాంబు 74 వేల మందిని బలితీసుకుంది. ఇవికాక వివిధ దేశాల్లో చేసిన కుట్రలు, యుద్ధాలలో కోట్లాది మంది మరణించారు.

                                                                           పతనం దిశగా..

వరుస సంక్షోభాల నేపథ్యంలో సామ్రాజ్యవాదం పతనం దిశగా ప్రయాణం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. 2000 సంవత్సరం తరువాత 2007-08లో వచ్చిన ఆర్థిక సంక్షోభమే అతి పెద్దదదని భావించాం. కానీ ఇప్పుడు దానికన్నా పెద్ద సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనాకు ముందే ప్రారంభమైన ఈ సంక్షోభం ఆ తరువాత కూడా కొనసాగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికన్‌ ఫెడరల్‌ బ్యాంకుతో పాటు అనేక దేశాల రిజర్వు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడమే పనిగా పెట్టుకున్నాయి. ఇది పరిస్థితిని మెరుగుపరచకపోగా, మరింత దిగజార్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆకలి కేకలు వినపడుతున్నాయి. దీంతో అంతర్గత మార్కెట్‌ పెంచుకునే పేరిట అనేక దేశాలు రక్షణ చర్యలు ప్రారంభించాయి. విదేశాల నుండి సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు ట్యాక్స్‌ హెవెన్‌లు పుట్టుకొచ్చాయి. ఇక్కడ పెట్టుబడిని భద్రంగా దాచుకోవచ్చని చెబుతున్నారు. ఇవి పెట్టుబడి ప్రవాహాన్ని నిరోధించే చర్యలు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. ఏమైనప్పటికీ, దోపిడీవ్యవస్థ దానంతట అదే కూలదు. కూల్చాల్సిందే! అలా కూల్చే శక్తి కార్మిక వర్గానికి మాత్రమే ఉంది.
 

                                                                      విశ్వవ్యాప్తమైన పోరాటాలు..

కార్మికవర్గ పోరాటాలు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉధృతమౌతుండటం గమనార్హం. అర్జెంటీనాలో 2022లో తొమ్మిది వేలకు పైగా కార్మిక ప్రదర్శనలు జరిగాయి. వీటిలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది కూడా భాగస్వాములయ్యారు. బ్రెజిల్‌లో వేతనాల పెంపు కోసం పెద్దఎత్తున పోరాటాలు సాగాయి. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌తో అమెరికా చేస్తున్న ఆర్థికదోపిడీతో చిన్నాభిన్నమైన శ్రీలంక ప్రజానీకం తిరుగుబాటు చేసింది. గత ఏడాది మార్చి నుండి ప్రారంభమైన ఈ పరిణామాల తీవ్రతతో శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. టర్కీలో సామ్రాజ్యవాద దోపిడీ విధానాలకు నిరసనగా స్టీల్‌, పేపర్‌, నిర్మాణరంగ కార్మికులు సమ్మెకు దిగారు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఆఫ్రికాలోని 54 దేశాలకు గాను 23 దేశాల్లో కార్మిక ఆందోళనలు సాగుతున్నాయి. బ్రిటన్‌లో ఎన్నడూ లేని విధంగా రైల్వే, పోస్టల్‌, టెలికమ్యూనికేషన్‌ వర్కర్లు సమ్మెకు దిగారు. సామ్రాజ్యవాద కేంద్రం అమెరికాలోనూ కార్మిక పోరాటాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కార్నెల్‌ యూనివర్శిటీ రూపొందించిన నివేదిక ప్రకారం 2021తో పోలిస్తే 2022లో 40 శాతానికి పైగా కార్మిక నిరసనలు అధికంగా అమెరికాలో నమోదయ్యాయి. మన దేశంలోనూ గత ఏడాదంతా సాగిన కార్మిక, కర్షక పోరాటాలు, సాధారణ సమ్మెల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 

                                                                         చే చూపిన బాట..

ఈ నేపథ్యంలోనే చే గువేరా చేసిన పోరాటం ప్రాధాన్యత నంతరించుకుంది. 'చే' ను అమానుషంగా చంపిన సామ్రాజ్యవాద శక్తులు ఆయనపై తొలుత అరాచకవాద ముద్ర వేయడానికి ప్రయత్నించాయి. అది సాధ్యం కాకపోవడంతో ఆయనను ఒక కాల్పనిక వ్యక్తిగా, మహిమాన్విత శక్తిగా, ఒంటరి గెరిల్లాగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజాపోరాట యోధుడిని ప్రజల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

కానీ,
చే.. ఒంటరి యోధుడు కాదు
చే.. అంటే టీ షర్ట్‌ మీద బొమ్మ కాదు!
ఆయనో.. పోరాట యోధుడు
ప్రజా పంథా రథసారథి
ప్రజల నుండి నేర్చుకుని
ప్రజలకు పంచిన ధీరుడు
ఏ దేశానికి చెందనివాడు
అన్ని దేశాలకు సొంతమైనవాడు
విద్యుత్‌ పోరాట వెలుగుల్లో
ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాల్లో
రైతాంగ నిరసనల్లో
కార్మిక సమిష్టి పోరులో
మహిళా హక్కుల సమరంలో
మతోన్మాద వ్యతిరేక పోరాటంలో
విద్యార్థుల ఉద్యమాల్లో
యువతరం నినాదాల్లో
చే.. అజరామరం !
అదే ఆయన చూపిన మార్గం..
సమతా సమాజమే చే నినాదం !

పెన్నార్‌
7382168168