
- నేడు బాపనయ్య 45వ వర్ధంతి
అట్టడుగు దళిత కులంలో పుట్టి అంటరానితనం కారణంగా అనేక అవమానాలు భరించి, తనకు జరిగిన అవమానాన్ని కమ్యూనిస్టు నాయకుల సహకారంతో ఎదుర్కొని నిలబడ్డాడు. చిన్నతనంలో అంటరానితనంతో పాటుగా పేదరికాన్ని అనుభవించిన ఆయన అంటరానితనం, పేదరికం పోవాలంటే కమ్యూనిస్టు పార్టీయే సరైనదని భావించి... తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా పని చేస్తూ ప్రజల మన్ననలను పొందాడు. అంటరానితనానికి, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ఆఖరి వరకూ పోరాడిన ఆ యోధుడే గుంటూరు బాపనయ్య గారు.
కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్వహించింది. దున్నే వానికే భూమి పంచాలంది. కుల వ్యవస్థకు, అంటరానితనానికి వ్యతిరేకంగా, తెలంగాణలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటం చేసింది. ఆంధ్రాలో చల్లపల్లి జమిందార్‌కి వ్యతిరేకంగా భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీదే.
ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఒక శక్తిగా అవతరించి దేశదేశాల్లో విముక్తి ఉద్యమాలు నడిపింది. ఆ ప్రభావంతోనే మన దేశంలో కూడా యువత వేలాదిగా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వ్యవసాయ కార్మికులు, పేదరైతులు, చేతివృత్తిదారులను సమీకరించి వారి ఆర్థిక సమస్యలపైనే కాకుండా సామాజిక సమస్యలపై కూడా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమించింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలను ఐక్యం చేసింది. ఈ పోరాటంలో చల్లపల్లి ఏరియాలో ఆంధ్రప్రదేశ్‌లో మహత్తరమైన కృషి సల్పిన వ్యక్తి బాపనయ్య.
కామ్రేడ్ బాపనయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పని చేస్తూ తలలో నాలుక వలె ప్రజల మధ్య గడిపారు. అగ్ర కులస్తులు కూడా బాపనయ్యను పరాయివాడిగా కాకుండా తమ వాడిగానే పరిగణించి ఆదరించేవారు. ఆ విధంగా బాపనయ్య తను నమ్మిన ఆశయాన్ని కొనసాగించారు.
ఈయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 1962 జులై 13న శాసనసభలో సాంఘిక సంక్షేమ శాఖ పద్దుపై ప్రసంగించినప్పుడు దళితుల సామాజిక ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ...షెడ్యూల్ కులాల తెగల ప్రజలు తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి, సాంఘిక వెలివేతకు గురవుతున్నారన్న వాస్తవాన్ని మనమంతా గుర్తించాలి. వీరి బిడ్డలు అత్యంత నికృష్ట జీవన పరిస్థితుల్లో, నిష్ట దారిద్య్రంలో జీవిస్తున్నారని గమనించాలి. వీరి బతుకుల్లో వారి పరిసర ప్రాంతాల్లో నాగరికత అనేది తొంగి చూడడం లేదు. వీరి పేటలు పారిశుధ్యానికి నోచుకోవడంలేదు. అటువంటి పరిస్థితుల్లో దళితుల బిడ్డలను అగ్రవర్ణ బిడ్డలతో పోల్చడం సరికాదు. అగ్రవర్ణాలలో పేదలు ఉన్నప్పటికి దళితులు, గిరిజనలు సాంఘికంగా నేటికీ నికృష్ట వాతావరణంలో జీవిస్తున్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని...ఆయన పేర్కొన్నారు. నేటికీ దళిత గిరిజన పేటల్లో పెద్దగా మార్పు లేదు. దళిత గిరిజనులకు తాగడానికి మంచినీరు అందుబాటులో లేదు కానీ సారా, బ్రాందీలను ప్రభుత్వం అందుబాటులో ఉంచినందుకు పాలక పెద్దలు సిగ్గుపడాలి. కల్తీ సారా తాగి దళిత గిరిజనులు ఎక్కువమంది 50 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. కుటుంబాలు దిక్కు లేకుండా పోతున్నాయి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధిలో దళిత గిరిజనులు వెనుకబడే ఉన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో దళిత, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం, ఖర్చు చేయడం మానేసింది. ప్రణాళిక బడ్జెట్‌కు తిలోదకాలు ఇవ్వడం ద్వారా ఈ తరగతుల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. మన రాష్ట్రంలోనూ గత తెలుగుదేశం ప్రభుత్వం, నేటి వైసిపి ప్రభుత్వం బడ్జెట్లో నిధులను జనాభా ప్రాతిపదికన కాకుండా తక్కువ కేటాయిస్తూ ఖర్చు చేయకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నాయి. అనేక పథకాలను అమలు చేయకుండా పక్కన పెట్టారు. రాజ్యాంగం, విద్యా హక్కు చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయాలని చెప్పింది. నేటికీ ఇది పూర్తిగా అమలు కాలేదు. పైగా కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలు పేరుతో దళిత, గిరిజనులకు తీవ్ర అన్యాయాన్ని తలపెడుడున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, నగదీకరణ విధానాలకు వ్యతిరేకంగా, హిందుత్వ మతోన్మాద మనువాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే ఆర్థిక సమస్యల పరిష్కారంతోపాటు సామాజిక న్యాయాన్ని సాధించగలం. ఇందుకు కృషి చేయడం ద్వారానే కామ్రేడ్ బాపనయ్య ఆశయాన్ని నెరవేర్చగలం.
- దడాల సుబ్బారావు
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు.