అధునాతన సాంకేతిక పోకళ్లతో.. మొక్కలు కొత్త అందాలు అద్దుకుంటున్నాయి. మొక్కలు పాతవే అయినా! సంకరీకరణంతో మేలైన లక్షణాలు పుణికి పుచ్చుకొని, సరికొత్త హొయలు ప్రదర్శిస్తున్నాయి. తక్కువ ఎత్తులోనే నాటిన కొన్నాళ్లకే పువ్వులు / కాయలు ఘనంగా కాస్తూ ఆకట్టుకుంటున్నాయి. చిన్ని చిన్ని జాగాల్లోనూ పెంచుకునే వెసులుబాటున్న ఈ నవతరం నాజూకైన హైబ్రీడ్ మొక్కలు ఎంతో అబ్బురపరుస్తాయి. వన ప్రియులను మనసులో దోస్తున్న క్రేజీ మొక్కల గురించి తెలుసుకుందాం..
పొట్టి ముస్సైండా..
పూరేకలు మెత్తగా మేక చెవుల్లా వాలి ఉంటాయి. మొక్క మల్లి క్లాత్లా సుతిమెత్తదనం ఈ పూల ప్రత్యేకత. కోసుకుని వినియోగించుకోవడానికి పనికిరావు కానీ మొక్కని అంటిపెట్టుకుని కనువిందు చేస్తాయి. ఈ పూల మధ్యలో ఉండే పుప్పొళ్ళు మరో పువ్వులా ఉండి సరికొత్త అందాలు అద్దుతాయి. సాధారణ ముస్సైండా మూడడుగులు మించి ఎత్తెదిగితేనే పూలు పూసేది. ఇప్పుడు సరికొత్త హైబ్రీడ్ ఆరు అంగుళాల పొడవులో నుంచే నిండుగా పువ్వులు పూస్తుంది. ఈ అంటు మొక్క నాటిన నాటి నుంచే పువ్వులతో ఉంటుంది. పువ్వుల మకరందం కోసం నిత్యం సీతాకోకచిలుకలు, తూనీగలు ఈ పూలమొక్కల చుట్టూ ప్రదర్శన చేస్తుంటాయి. పాలమీగడ తెలుపుతో పాటు ఎరుపు, లేతగులాబీ, పసుపు రంగుల పూలు పూసే మొక్కలు వీటిలో వస్తున్నాయి. వేసవి, వర్షాకాలాల్లో ఈ మొక్కలకు పువ్వులు మెండుగా ఉంటాయి. పూనె ఉద్యానవన పరిశోధన కేంద్రంలో ఊపిరి పోసుకున్నాయి ఈ మొక్కలు. ప్రస్తుతం కడియం పల్ల వెంకన్న నర్సరీలో పునరుత్పత్తితో ఇవి అందుబాటులోకి వచ్చాయి. కుండీల్లో, చిన్న జాగాలో సైతం వీటిని పెంచుకోవచ్చు. సరిసమానంగా నీటివనరు అందిస్తే సరిపోతుంది. రాతి నేల తప్ప ఇతర అన్ని నేలల్లోనే పెరుగుతాయి. అలాగే బోర్డర్ మొక్కలుగానూ వీటిని పెంచుకోవచ్చు.
ఆర్డిసియా క్రెనాటా..
అందమైన ఆర్నమెంటల్ మొక్క ఆర్డిసియా క్రెనాటా. తూర్పు ఆసియాకు చెందిన ఈ మొక్కలు ఇప్పుడు కడియంలో కొలువుదీరాయి. మొక్క నిండుగా ఆకులతో అలరిస్తోంది. అడుగుభాగాన కాసే చిన్న చిన్న కాయలు, పండ్లు ఈ మొక్కకు ఎంతో శోభను అద్దుతాయి. ఇరవై నాలుగు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఇవి చక్కగా పెరుగుతాయి. అందుకే ఇవి షమీ షెడ్లో బాగా పెరుగుతాయి. ప్రిమ్యూల్సీ కుటుంబాలకు చెందిన ఈ మొక్కలను కోరల్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ముందుగా చిన్న చిన్న పువ్వులుగా విచ్చుకుని, మొగ్గ తొడుక్కొని, కాయలుగా రూపాంతరం చెంది, పండ్లుగా పరిపక్వత చెందుతాయి. ఈ మొక్కల్లో ప్యూర్ రెడ్, మిల్కీ వైట్, లేత పింకు రంగు పళ్ళు కాసే రకాలు ఉన్నాయి. వేసవి సీజన్ లగాయితూ ఆరు నెలల పాటు కాయల కాపు ఉంటుంది. వీటిని నేరుగా తింటే కాస్త చేదుగా, విషపూరితమై ఉంటాయి. కానీ ఔషధాలు తయారుచేయడంలో ఈ మొక్క యొక్క అవశేషాలు కల్పవల్లిలా ఉపయోగపడుతున్నాయి. ఆస్తమాకు, చర్మ వ్యాధులు, ముఖం శుభ్రం చేసుకునే రసాయన ఫేస్‌వాష్‌లలో ఈ మొక్క ఎక్ట్స్రాక్ట్‌లను ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు కొద్దిగా నీరు వనరు అందిస్తే సరిపోతుంది. చల్లని వాతావరణంలోనూ కొబ్బరి పొట్టు మిశ్రమంలోనూ బాగా పెరుగుతాయి. మొక్క చాలా ప్రకాశవంతంగా, అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. సిట్ అవుట్లు, అరుగులు మీద పెంచుకోవడానికి మొక్కలు భలే ఉంటాయి.
లెగస్టోమియా హైబ్రిడ్ రెడ్..
లెగస్టోమియా మొక్కలను మనం రోడ్డు పక్కన నీడకోసం నాటుతూ ఉంటాం. వీటిలో పింకు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల పువ్వులు పూసే రకాల మొక్కలు ఉన్నాయి. కానీ ఈ సరికొత్త లెగస్టోమియా హైబ్రిడ్ గమ్మత్తయిన మొక్క. నాటిన కొద్దిరోజులకే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది. రెండు, మూడడుగుల ఎత్తులో పూలను గుభాళిస్తుంది. జూన్ మొదటి వారం నుంచి దాదాపు నాలుగు నెలల పాటు ముదురు ఎరుపు, చంద్రకాంత రంగుపూలతో ఈమొక్క అలరిస్తుంది. ముందుగా చిన్న, చిన్న కాయలు మొగ్గ తొడుక్కొని తరువాత అవే పువ్వులుగా పరిమళిస్తాయి. ఒకానొక సమయంలో మొక్కుకున్న ఆకులేవి కనిపించకుండా పూలు కమ్మేసే మనో దశ్యాన్ని మనం చూస్తాం. అన్ని రకాల నేలల్లో ఈ మొక్క పెరుగుతుంది. కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు. చాలా తొందరగా పెరుగుతుంది. మొక్కను ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో చెట్లన్నీ ఆకుపచ్చగా పెరుగుతాయి. ఆ సమయంలో మొక్కలు లేదా చెట్లకు పువ్వులు అరుదుగా పూస్తుంటాయి. కానీ అదే సమయంలో పువ్వులు పూయడం ఈ మొక్కలు విశిష్టత. ఇది ఎండలోనూ, కొద్దిపాటి నీడలోను కూడా పెరగలదు. ఈ మొక్కను ఇండియన్ పారడైస్ అని కూడా అంటారు.
బుల్లి నారింజ..
నిమ్మకాయ పరిమాణంలో ఉండే ఈ సరికొత్త నారింజ చూడ్డానికి కనువిందు చేయడమే కాదు. ఎన్నో వినూత్న లక్షణాలు కూడా పొదిగి ఉంది. 'సి' విటమిన్ పుష్కలంగా ఉన్నప్పటికీ బాగా పండిన ఈ నారింజ ఎంతో మధురంగా ఉంటుంది. సాధారణ నారింజ శీతాకాలంలో కాయలు కాస్తే! ఇది మాత్రం సంవత్సరం అంతా కాపే. కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు. అన్ని నేలల్లో పెరిగినప్పటికీ ఎర్రమట్టి నేలలో బాగా పెరుగుతుంది.