ప్రజాశక్తి-కాకినాడ : యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరణ చేయాలని, డీఎస్సీ 2003 వారికి తక్షణమే పాత పెన్షన్ వర్తింప చేయాలని కోరుతూ యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కె.వి.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన యూటీఎఫ్ కాకినాడ కార్యాలయంలో నిరవధిక దీక్షలు ప్రారంభించారు. నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించి శిబిరాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి టి.అన్నారాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరణ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత సిపియస్‌పై టెక్నికల్ నాలెడ్జ్ లేదని తప్పించుకుని జీపీఎస్ అనే కొత్త నాటకానికి తెరలేపడం ఉద్యోగులను మోసగించడమేనన్నారు. ఈ జీపీఎస్ విధానంలో ఉద్యోగి 33 సంవత్సరాలు సర్వీస్ చేస్తేనే 50 శాతం పెన్షన్ వర్తిస్తుందని నిబంధన ఏ మాత్రం అంగీకారం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి సిపియస్, జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఈ నిరాహార దీక్షలను రాష్ట్రంలో వున్న ప్రతి మండలంలో చేపడతామని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన మెమో 57 ప్రకారం దేశంలో ఇప్పటికే 5రాష్ట్రాలు పాత పెన్షన్ అమలు చేస్తున్నాయని, ఈ మెమో ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2004 సెప్టెంబర్ 1 కంటే నియామక ప్రక్రియ పూర్తి అయి ఆ తరువాత నియామకాలు పొందిన 2003 డీఎస్సీ వారు, పోలీసులు సుమారు మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు 11000మంది ఉన్నారని వీరందరికీ పాత పెన్షన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న అన్ని జీవోలు అమలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం మెమో 57 కూడా అమలు చేసి మొదటిగా నష్టపోయిన డీఎస్సీ 2003 వారికి న్యాయం చేయాలని తెలిపారు. అధ్యక్షులు కె.వి.వి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2050 నాటికి పెన్షన్ లు ప్రభుత్వానికి చాలా భారం అవుతాయని కల్ల బొల్లి మాటలు చెబుతున్నారని, ఈ భారం ఏ విధంగా అవుతుందో ప్రభుత్వం జీతాలు, పెన్షన్ లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక నిరాహార దీక్షలలో కాకినాడ జిల్లా శాఖ తరపున పాల్గొన్నవారు టి వి జి జి ఆర్ ఆర్ చక్రవర్తి, పి జి గోపాలరావు, వి వి రమణ, ఎం వి సాయిరాం, పి చంద్ర శేఖరరావు, సీ హెచ్ సూరిబాబు, డి కనక దుర్గా దేవి, ఆర్ సత్య ప్రసాద్, ఏ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ సహద్యక్షులు ఐ ప్రసాదరావు, బి నాగమణి, వి సోనీ, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణీ తదితరులు సంఘీభావం తెలిపారు.










