విమర్శల అస్త్రాలకు తలవంచకండి
మనసు గాయపడినా వదలకండి
మీ అక్షరాలతో తెగువ చూపండి
అహంకారపు మదాన్ని అణచి వెయ్యండి
కవిత్వపు ప్రవాహములో శుభ్రం కండి...
ప్రపంచపు పద్మవ్యూహములో నిలబడి
ఛేదించడానికి అస్త్రంగా అక్షరాలను వదిలి
సవ్యసాచులై సంధి కాలములో గెలిచి
విశ్వవేదికపై విజయోత్సవం జరిపి
శాంతి పతాకాన్ని పువ్వుతో ఎగురవేయండి...
కార్పొరేట్ మాయాజాలం విజృంభిస్తుంది
ప్రైవేటు శక్తులు రక్తాన్ని పీల్చుతున్నాయి
శ్రమ జీవుల చెమటలను మార్కెటింగు చేస్తూ
కుల వృత్తులను కూకటి వేళ్ళతో నరుకుతుంటే
స్వర్ణ ఫలంలో విషం చేరి కుళ్ళతుంది...
కొత్త స్వప్నం కోసం పాత శక్తుల ప్రయత్నం
చింతకాయ పచ్చడి రుచి తగ్గకుండా
సమ్మిళితమైన సమాజములో వ్యక్తులు
సచ్చుబడిన తనువులో ఆత్మవిశ్వాసం నింపుకొని
సజీవమైన పోరాటాలే కొనసాగుతున్నాయి..
ప్రచారం కోసం వింత నాటకాలెన్నో
సాక్ష్యం లేని సమాధానాలు ధర్నాలై కూర్చుంటే
సత్యము తేల్చలేని సమస్యలు రోడ్ల వెంట
మనసును తూచలేని తూనిక రాళ్లు ఎక్కడా
ప్రజాస్వామ్య దేశములో అంతా వీధి నాటకాలే నా...
కొప్పుల ప్రసాద్
98850 66235