Nov 05,2023 13:44

ప్రస్తుత కాలంలో ఉద్యోగ, ఉపాధి బాధ్యతల్లో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులు ఒంటరిగా జీవిస్తున్నారు. అందులోనూ విదేశాల్లో జీవిస్తున్న పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇదే విషయాన్ని దర్శకుడు రాజ్‌ మదిరాజ్‌ 'కృష్ణారామా' చిత్రం ద్వారా చెప్పాలనుకున్నారు. దీంతోపాటు ఒంటరివాళ్లం అని ఫీలవుతున్న ప్రతిఒక్కరూ సోషల్‌మీడియాకి ఏవిధంగా ఎడిక్ట్‌ అవుతున్నారు? అందులో ఎదురయ్యే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కుటుంబ బంధాలతో సామాజిక అంశాలనూ తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఆలోచింపజేశారు దర్శకులు.

నటీనటులు : నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవివర్మ, జెమిని సురేష్‌, రచ్చరవి తదితరులు
కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌, దర్శకత్వం : రాజ్‌ మాదిరాజు
నిర్మాతలు : వెంకట కిరణ్‌, కుమార్‌ కాళ్లకూరి, హేమ మాధురి
సంగీతం : సునీల్‌ కశ్యప్‌

55

టిటి వేదికలపై కొత్త కథలకి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. అందులోనూ 'ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి' సినిమాలతో లైఫ్‌టైమ్‌ గుర్తుండిపోయే సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాజేంద్ర ప్రసాద్‌, సీనియర్‌ నటి గౌతమి కలిసి నటించిన చిత్రం 'కృష్ణారామా'. తెలుగు ఈటీవి విన్‌ ఓటిటి వేదికలో విడుదలైంది.
         

కథలోకి వెళితే.. రామతీర్థ అలియాస్‌ రామ (రాజేంద్రప్రసాద్‌), కృష్ణవేణి అలియాస్‌ కృష్ణ (గౌతమి) అన్యోన్యంగా జీవిస్తుంటారు. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరికి ముగ్గురు సంతానం. వీరంతా విదేశాల్లో స్థిరపడతారు. పిల్లలకు దూరంగా ఉంటున్నామనే బాధతోనే విశ్రాంతి జీవితాన్ని గడుపుతుంటారు. నెలలో ఒక్కరోజు వీడియో కాల్‌ ద్వారా వారితో ముచ్చటిస్తుంటారు. మళ్లీ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. అలా నెలలో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజూ పిల్లలతో టచ్‌లో ఉండేందుకు ఈ రిటైర్డ్‌ టీచర్స్‌ ప్రీతి (అనన్య శర్మ) సాయంతో కృష్ణారామా పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరుస్తారు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న వారికి సోషల్‌మీడియా మాయలో పడి ఒకరి నుంచి ఒకరు విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యకూ ప్రయత్నిస్తారు. వారెందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అసలు పిల్లల విషయంలో వారి లక్ష్యం నెరవేరిందా? లేదా? అసలు వారికి, ప్రీతికి సంబంధమేంటి? వీటన్నింటి సమాధానం- సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
         ఓ ఉద్యోగి రిటైర్‌ అయిపోతే వాళ్ల జీవితం చివరిదశకు వచ్చిందన్న భావన వారి పిల్లలకు, తోటివారికి కలుగుతుంది. కానీ, వారి అనుభవం సమాజానికి ఎంతో అవసరం అని సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. టెక్నాలజీ గురించి తెలియకపోయినా పిల్లల కోసం దాన్ని నేర్చుకునే విధానం చూస్తే పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేస్తారని రామతీర్థ, కృష్ణవేణి పాత్రలు తెలియజేస్తాయి. కృష్ణారామా సూసైడ్‌కు సిద్ధపడే ఫస్ట్‌షాట్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచి, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒంటరితనం విడిచి, పిల్లలకు దగ్గరకావాలని వారు పడే తపన, అందుకు ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచే ప్రయత్నం తదితర సన్నివేశాలు సినిమాలో కీలకం. పక్కింటి అమ్మాయిలా ఉండే ప్రీతి పాత్ర ఆకట్టుకుంటుంది. ఇలా కథను సరదాగా నడిపిస్తూనే, మరోవైపు హ్యుమన్‌ యాంగిల్లో తెరకెక్కించారు. దాంతో, ద్వితీయార్థంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంటుంది. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెనింగ్‌ తర్వాత కృష్ణారామా, వారి పిల్లల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కీలక ఘట్టాల సమయంలో ఓ బ్యాండ్‌ తెరపై కనిపిస్తూ బుర్రకథ తరహాలో ప్రదర్శనలివ్వడం కొత్తగా అనిపిస్తుంది. కథకు మంచి ముగింపు ఇచ్చారన్న అనుభూతి కలుగుతుంది.
          సినిమాకి రాజేంద్రప్రసాద్‌, గౌతమి పాత్రలే బలం. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ మరోసారి సత్తా చాటారు. కృష్ణవేణి పాత్రలో గౌతమి ఒదిగిపోయారు. అనన్య శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా కీలకం. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, జెమిని కిరణ్‌, రచ్చ రవి, రవివర్మ సందర్భానుసారం తెరపై కనిపించి ఆకట్టుకుంటారు. ఈ చిత్రాన్ని కుటుంబం, స్నేహితులతో కలిసి చూడొచ్చు.