Jul 26,2022 06:48

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘేని అక్కడి పార్లమెంట్‌ ఎన్నుకుంది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఊహించని విషయమేమీ కాదు. ఆరు సార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన అనుభవం సంక్షోభంలో ఎంత అక్కరకొస్తుందో అప్పుడే చెప్పలేం. ముఖ్యంగా ఆయన పాలనానుభవం అపారమే గానీ ఆయన విధేయత దేశం విడిచి పారిపోయిన, సంక్షోభానికి మూలకారణమైన అధ్యక్షుడు రాజపక్స కుటుంబంతో ఉంది. అందుకనే ఆయన పార్లమెంట్‌లో బలం లేకున్నా ఆపత్కాలంలో రాజపక్సచే ప్రధానిగా నియమించబడ్డాడు. నేడు అదే పార్టీ మద్దతుతో అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఈ ఎన్నికతో అక్కడి ప్రజలకు కొత్తగా రాగల భరోసా ఏమీ ఉండబోదు. కొత్త సీసాలో పాత సారా తరహా అదే శ్రీలంకకు హెడ్‌గా అదే సారు. కాకపోతే ఒక అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం వల్ల ఆయన నేతృత్వంలో ఆ దేశం ఆర్థిక సుడిగుండం నుండి బయటపడే ప్రయత్నాలు అధికారికంగా చెయ్యవచ్చు. అధ్యక్షుడు ఎవరైనా తక్షణం ఊరట నివ్వలేరన్న సత్యం తెలుసుకొని దేశ ప్రజలు, రాజకీయ పక్షాలు శాంతి స్థాపనకు సహకరించాలి. ప్రపంచ దేశాల సాయం లేనిదే బయటపడలేని ఇబ్బందుల్లో ఉన్నారు కనుక సంయమనం పాటిస్తూ ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు తెలపాలి. ప్రభుత్వం, అక్కడి సమాజం స్థిరత్వం, సామరస్య భావన చూపితే అక్కడి పర్యాటక రంగం గాడిలో పడుతుంది. ఆర్థిక స్థితి కొంత మెరుగు పడుతుంది. విభిన్న జాతుల మధ్య నెలకొన్న దూరాన్ని రాజకీయ పక్షాలు తగ్గించగలిగితే ఉత్పాదకత పెరుగుతుంది.సత్వరం అప్పుల నుండి బయట పడవేసేలా ప్రపంచ దేశాల సాయం పొందడంతో పాటు, గత పాలకుల తప్పులతో కుదేలైన వ్యవసాయాన్ని గాడిలో పెట్టాలి. ఏదిఏమైనా 2024లో రాబోయే అధ్యక్ష ఎన్నికల లోపు అన్ని రాజకీయ పక్షాలూ నిర్మాణా త్మకంగా వ్యవహరించాలి. నూతన అధ్యక్షుడికి పాలనా భాద్యత కత్తిమీద సామైనా, తన సామర్ధ్యం నిరూపించుకోడానికి, తన దేశాన్ని రక్షించుకోడానికి ఇదో అవకాశం. ఆ దేశానికి మంచి మిత్రులెవరో, మార్కెట్‌ (మాటల) మిత్రులెవరో బహిర్గతమయ్యే సంక్షోభ సందర్భం ఇదే.
 

- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.