Dec 25,2022 07:52

చంద్రభాను ఉత్తరం చదివాక, ఆమెని పరిశీలనగా చూశాడు. వినయంగా నిలుచుందామె. నున్నగా మెరుస్తున్న ఆమె బోడిగుండు చూసి 'తిరుపతి వెళ్లి వస్తున్నావా?' అని ప్రశ్నించాడు.
'తిరుపతి కాదండీ, సింహాచలం' అందామె.
లోపలికి తీసుకెళ్లి 'అమ్మా! కృష్ణకాంత్‌ మావయ్య పంపిన ఈవిడ పేరు విశాల. ఈ రోజు నుండి ఈవిడ నీకు సహాయకురాలుగా మనింట్లోనే ఉంటుంది' అన్నాడు చంద్రభాను.
కనకమహాలక్ష్మమ్మ ఆమెనే చూస్తూ 'ఇలారామ్మా! కూర్చో!!' అని తను కూర్చున్న మంచాన్ని తట్టింది. ఆమె ఒద్దికగా పక్కనే కూర్చుంది.
ఆమె కళ్లలో ఆకర్షణుంది. చూపుల్లో చురుకుదనముంది. నవ్వకపోయినా ఒంపు తిరిగిన పెదిమల్తో నవ్వుతున్నట్టే ఉంటుంది. పైగా వయసు పొంగు ఆమె శరీరమంతటా నిండి ఉంది. గుండుతో ఉన్నా ఆమె అందంగానే ఉంది.
'ఏమ్మా! నీకు పెళ్లయిందా?' అనడిగింది కనకమహాలక్ష్మమ్మ.
'లేదండీ!'
'మరి అమ్మానాన్నా అన్నాచెల్లీ...' అడిగింది మళ్లీ తనే
'ఎవరూ లేరండి! అమ్మ చనిపోయి నెలరోజులయింది..'
'అయ్యో!.. పాపం' జాలిగా అని మౌనం దాల్చింది కనకమహాలక్ష్మమ్మ.
'తన తల్లికి సహాయకురాలిగా ఉండడానికి ఈమెకు అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ ఒకే ఒక మైనస్‌ పాయింట్‌ ఆమె యవ్వనం.' అని లోలోనే అనుకున్న చంద్రభాను - 'అయినా అవన్నీ మనకనవసరం' అని తనకు తానే సర్దిచెప్పుకున్నాడు. 'అమ్మ బాధ్యత నిన్ను నమ్మి అప్పగించాం. అమ్మని చాలా శ్రద్ధగా చూసుకో విశాలా!' అని చెప్పి, రెండోరోజునే అమెరికా వెళ్లిపోయాడతను.
నాలుగురోజుల్లోనే కనకమహాలక్ష్మమ్మకి బాగా చేరువైపోయింది విశాల. ఆ ఇంటి బాధ్యతలన్నీ చక్కగా నెరవేరుస్తుందామె!
అయిదో రోజున సింహాద్రి వచ్చాడు. కనకమహాలక్ష్మమ్మతో చాలాసేపు మాట్లాడ్తూ కూర్చున్నాడు. కానీ అతని చూపులన్నీ విశాల మీదే ఉన్నాయి. సింహాద్రి వాళ్ల పొలం సేద్యం చేస్తున్న కౌలుదారుడు. చంద్రభాను చెప్పినట్టు ప్రతివారం రోజులకోసారి వస్తుంటాడు. ఇంట్లోక్కావల్సిన సరుకులన్నీ కొని, ఇస్తుంటాడు. యథాలాపంగా ఆ రోజు సరుకులన్నీ కొని, తెచ్చి గుమ్మం దగ్గర్నించి.. 'ఓ..రు..' అనరిచాడతను. ఆ అరుపు విన్న విశాల వెలుపలికి వచ్చింది. సంచి విశాల చేతులకందిస్తూ కావాలనే చేతులు నిమిరాడు. సంచందుకుని లోపలికి వెళ్లబోతుంటే చీరకొంగు లాగి వదిలేశాడు. ఏదో చెప్పాలన్నట్టు ముందుకు ఉరికివచ్చి, అడ్డంగా నిలుచున్నాడు.
'తప్పు తమ్ముడూ!' అన్నట్టు చూసి.. 'తప్పుకో తమ్ముడూ!' అంది విశాల.
'అదేటిదది.. ' జవాబుగా అన్నాడు సింహాద్రి.
'వయసుకు పెద్దోడివే కానీ బుద్ధి చిన్నది. తప్పుకోరా!' అందీసారి విశాల.
'సింహాద్రీ ఇటురా!' అని అరిచింది కనకమహాలక్ష్మమ్మ. లోపిలికి వెళ్లిన సింహాద్రితో -'ఆరు! ఓరు!! అనరుస్తావేం? విశాలమ్మా అని పిలు' అందామె. సింహాద్రి వెలుపలికి వచ్చి, విశాలకు నమస్కరించి వెళ్లాడు.
మనుషుల కళ్లలో కదలాడే భావాలకు బోలెడన్ని భాషలుంటాయి.. అదే విశ్వభాష! ఎవరైనా సులభంగానే అర్థం చేసుకోగల ఆ మూగభాష ఒకటే! డాక్టర్‌ రఘువీర్‌ ఆ రోజు కనకమహాలక్ష్మిని చెక్‌ చేయడానికి వచ్చాడు. వాస్తవానికి అతను డాక్టరే! కానీ అతని చూపులు మాత్రం అవాస్తవికతకు అద్దంపడ్తున్నారు. కనకమహాలక్ష్మమ్మ గుండెను స్టెత్‌స్కోప్‌తో ప్రెస్‌ చేస్తూనే విశాలవైపే తీక్షణంగా చూస్తున్నాడు. వాస్తవంలో అవాస్తవం అంటే అదే! 'అంతా బాగుంది. ఏదైనా ఇబ్బందనిపిస్తే నాకు ఫోన్‌ చేరు!' అని విశాలనే చూస్తూ చెప్పాడు డాక్టర్‌ రఘువీర్‌. తలూపింది విశాల.
'నే చెప్పింది వినిపించిందా? అర్థమైందా? మాట్లాడవేం?' రెట్టించాడతను.
'అలాగే డాక్టర్‌ గారూ! ఆరోగ్యం బాగోలేనప్పుడు ముందు గుర్తుకొచ్చేది డాక్టర్‌ గారే! కాబట్టి డాక్టర్‌ గారంటే దేముడికంటే ఎక్కువే!' కాస్తంత ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది విశాలకు. ఆ మాటలు అతణ్ణి స్పృహలోకి లాక్కువచ్చినట్టుయ్యి, నిండుగా నవ్వాడు డాక్టర్‌ రఘువీర్‌. కానీ విశాలకు డాక్టర్‌ రఘువీర్‌కు ఫోన్‌ చెయ్యాల్సిన అవసరం రాలేదు.
ఆరోజు కనకమహాలక్ష్మమ్మ గుడికి వెళ్దామంది. విశాల ఆటోకోసం వెళ్లింది. 'ఆటో..!' అనరిచింది. ఆగిన ఆటోలో డ్రైవర్ని చూసి గతుక్కుమంది. ఆటోడ్రైవర్‌ తనని తీక్షణంగా చూస్తున్నాడు. 'దేవుని గుమ్మం దగ్గర వేంకటేశ్వరస్వామి గుడికెళ్లాలి' అంది విశాల. 'నీది విశాఖపట్నంలో మెరకీధి కదా?' అన్నాడతడు. ప్రశ్నార్థకంగా ముఖం చిట్లించి - మెరకీధా? అంది విశాల. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది.
గుడిలో వెంకన్న దర్శనం ప్రశాంతంగా కానిచ్చాక మండపంలో ఓపక్క కూర్చున్నారిద్దరూనూ. 'విశాలా! దేవుణ్ణేం మొక్కుకున్నావే?' అనడిగింది కనకమహాలక్ష్మమ్మ.
'మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నానమ్మా!' జవాబిచ్చింది విశాల.
'అదేవిటే పిచ్చిదానా? పెళ్లవ్వాలనీ పిల్లల్ని కనాలనీ హాయిగా బతకాలనీ నీ గురించేమీ కోరుకోలేదా?' అంది కనకమహాలక్ష్మమ్మ.
'అదేమీ అడగలేదమ్మా!' అని విశాలంటే-
'ఆ!' అని విస్తుపోయిందామె.
ఎవరి బతుకు వారికి అర్థంకాదు. అందుకే దేవుణ్ణి వారికేది అవసరమో అది కావాలని కోరుకుంటారు. కొందరు అదేపనిగా కోరికల లిస్టు కళ్లుమూసుకుని అప్పజెప్తుంటారు. మరికొందరు లంచాల మీద లంచాలు హుండీలో పోస్తూ కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి బులిపిస్తుంటారు. కొందరు దైవదర్శనంలో భగవన్నామస్మరణ మాత్రమే చేస్తుంటారు. కనకమహాలక్ష్మమ్మ దైవదర్శనం చేసుకుంటూ భగవన్నామం జపించింది. విశాల కోరికను విన్న ఆమె 'పిచ్చిదానా!' అని భుజంపై తట్టింది.
విశాల ముఖం నిండుగా ముసిముసి నవ్వులు పూచాయి.
శ్రీశ్రీశ్రీ
ఎవరి కన్నీరు వాళ్లే తుడుచుకోవాలి. ఆడవాళ్లకైతే కన్నీరు కళ్ల వరకే. చీర కొంగు వరకే. బయటివాళ్లకు తెలిసేందుకు ఎంతమాత్రం ఇష్టపడరు. కాబట్టి లోలోనే ఇముడ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి బాధల్లో తనలో ఒక క్రియాశీలక వ్యక్తిని పట్టుకోలేరు. సమస్య నెత్తిపై పడినప్పుడు సందర్భానుసారంగా ఒక అవకాశం కోసం వెతుక్కోవడం అనివార్యం! బతుకులో చీకటి కూడా సౌందర్యంగా భావిస్తేనే రంగురంగుల మొగ్గలెన్నో ఉషోదయంతో విరబూస్తాయి. పరిమళభరితంగా శోభిల్లుతాయి.
ఉదయన్నే తూరుపు రారాజులా వచ్చాడతను. అతను అతనే. తనకు ఉత్తరమిచ్చి ఈ ఉద్యోగంలో చేర్పించినతను. అతడే! నవ్వుతూ ఎదురెళ్లి చేతిలో సూట్‌ కేసు అందుకుంది విశాల. 'బావున్నారండీ!' అని తీయగా పలకరించింది. ఆరోజంతా 'విశాలా!' అని ఏ పదిసార్లో పిలిచాడతను. భోజనం వడ్డిస్తున్నప్పుడు - 'కొంచెం ఒళ్లు చేశావ్‌. ఇప్పుడు చాలా బాగున్నావు విశాలా!' అన్నాడు. ఇల్లంతా 'విశాలా!' అన్న పిలుపులే ధ్వనిస్తున్నారు! పిలుపులన్నింటికీ విశాల నవ్వుల్తోనే సమాధానపరుస్తూ, తన పనిని తాను చేసుకుపోతోంది. చిట్టచివరిగా విశాల చేతిని పట్టిలాగి - 'రాత్రి అక్క పడుకున్నాక, నా గదికి రా!' అని లోస్వరంలో అన్నాడు కృష్ణకాంత్‌. విశాల చేయి విదుల్చుకుంది. తీక్షణంగా చూసి 'రాను' అని ఒకే ఒక్క మాట అని నిద్రలో నడుస్తున్నట్టు నడిచిపోయింది. కానీ ఈ కాస్తంత నీడా లేకుండా పీకేస్తాడేమోనని బెంగగా దిగాలుగా ఉండిపోయింది. 'ఏదైతే అదే కానీ' అని లోలోనే అనుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు.
అలాంటి చెదురుమదురు సంఘటనలతో సంవత్సరం భద్రంగా గడిచింది. అలా అతుకుపడిన తన బతుకు ఆ రోజు మళ్లీ చిట్లినట్టయింది. ఉదయాన్నే కనకమహాలక్ష్మమ్మ ఆయాసంతో రొప్పుతూంటే ఆస్పత్రికి తీసుకెళ్లి, అడ్మిట్‌ చేసింది. కృష్ణకాంత్‌కి, చంద్రభానూక్కూడా ఫోన్‌ చేసి చెప్పింది. రెండోరోజుకి ఇద్దరూ రానే వచ్చారు. అలాగే కనకమహాలక్ష్మమ్మా ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్‌ చేసేశారు కూడా. కృష్ణకాంత్‌, చంద్రభానూ ఆమెను అమెరికా తీసికెళ్లడం మంచిదనే నిర్ణయానికొచ్చేశారు. అందుకు ఇన్నాళ్లూ అంగీకరించని కనకమహాలక్ష్మమ్మ కూడా ఒప్పుకుంది.
విశాల బతుకు పగిలిన గాజుబొమ్మ అయింది. 'అతుకు వేసుకుని, నిలబెట్టుకోక తప్పదు' అని లోలోనే అనుకుంది. ఒక అవకాశం చూపిన కృష్ణకాంత్‌ ఎందుకో ఈసారి మౌనం వహించాడు. సుడిగాలికి గడ్డిపరక తలవంచుతుందే కానీ పెకలింపబడదు. ఈ ఆశావాదం ప్రతి ఒక్కరికీ కష్టాల్లో ఆదర్శనీయం!
శ్రీశ్రీశ్రీ
అర్ధరాత్రి దాటి ఒంటిగంటయింది. కృష్ణకాంత్‌కి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడంలేదు. కంటికి తాళం పడక, ఇంటికి తాళం వేశాడు. బండి స్టార్ట్‌ చేసి, బయల్దేరాడు. కంపెనీ వ్యాపారం ముగిసిందన్నట్టు చీకట్లో మునిగిపోయింది. బండి వచ్చిన శబ్దానికి బయటికి వచ్చింది సుబ్బమ్మ. కృష్ణకాంత్‌ని చూసి ముఖమంతా నవ్వు పులుముకుని 'దండాలయ్యగారూ! రండి!' వినయంగా అంది.
'కొత్తగా ఎవరైనా వచ్చారా?' సూటిగా అడిగాడతను.
'ఆ.. వచ్చి రెండురోజులయిందండీ! కొరకరాని కొయ్య. ఆ ఎదురుగదిలో ఉంది. వెళ్లండయ్యగోరూ!' సమాధానంగా అంది సుబ్బమ్మ.
తలుపు గడియ తీసి దూసుకువచ్చిన కృష్ణకాంత్‌ని చూసిన ఆమె ఉలిక్కిపడి, చివాలున లేచి నిలుచుంది.
'నీ పేరేవిటే.. ఇలారా.. ' పలకరింపుగా ప్రశ్నించాడతను.
ఆమె సమాధానం ఏడుపు.
'ఏ ఊరే మీది?' మళ్లీ సమాధానం రెట్టింపైన ఏడుపు.
ఆ ఏడుపుకి కామా లేదు. ఇక ఫుల్‌స్టాప్‌కి అవకాశం ఎక్కడిది? చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు కృష్ణకాంత్‌.
'నా పేరు కృష్ణకాంత్‌. నేను గోపాలపట్నం పి.ఎస్‌. సర్కిల్ని. అసలు నీ సమస్యలేవిటో చెప్పు' నిదానంగా అన్నాడతను.
ఆమె చున్నీతో కళ్లద్దుకుని, ముఖం తుడుచుకుంది.
'నా పేరు.. విశాల' ఎట్టకేలకు ఆమె నోరు పెగిలింది.
ఇదే అదునుగా భావించిన కృష్ణకాంత్‌, ఆమె చేయిపట్టి మంచంపై కూర్చోపెట్టాడు. ఆ పక్కనే కూర్చుని ఆమె ఉంగరాల జుట్టుని ముఖంపై నుండి పక్కకు సవరించాడు. చంద్రబింబంలాంటి ముఖం. విశాల కొంచెం ఎండంగా జరిగింది. తను కొంచెం దగ్గరగా జరిగాడు. ఆమె బుగ్గ దగ్గరగా నోరుంచి 'భయపడకు, విషయం చెప్పు' అన్నాడీసారి.
'మా అమ్మ కష్టపడి కూలీ నాలీ చేసి, నన్ను చదివించింది. నేను బి.కామ్‌ ఫైనలియర్లో ఉండగా మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. మా ఎదురింట్లో ఉండే మల్లిక మాకు చేదోడు వాదోడుగా ఉండేది. ఒంటరిగా ఎక్కడుంటావు? ఎలా ఉండగలవు? మాతోపాటూ మా ఇంట్లో ఉందువుగాని.. రా!' అంది. ఆమె ఆదరణకు పొంగిపోయాను. నీ చదువుకు సేల్స్‌గర్ల్‌ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగం రాదు. ఆ జీతంతో బతకడం చాలా కష్టం. మా కంపెనీలో అన్నీ నైట్‌షిఫ్ట్‌ ఉద్యోగాలే. నువ్వు చేరుతానంటే రేపే చేర్చుతానంది మల్లిక. మల్లిక మాట నమ్మి వస్తే.. కంపెనీ అంటే ఇదని తెలిసింది. ఇక్కడికొచ్చి రెండే రెండు రోజులైంది. రోజుకో నరకాన్ని చూశాను. నాశనమై పోయాను. ప్రస్తుతం ఈ పరిస్థితిలో నాకు చావడానిక్కూడా వీలులేకుండా అయిపోయింది. దయచేసి ఇక్కణ్ణించి నన్ను బయటికి పంపే ఏర్పాటు చేసిపెట్టండి!' అని తన బాధంతా చెప్పుకుంది విశాల.
'సుబ్బమ్మా...' అనరిచాడు కృష్ణకాంత్‌.
'అయ్యగోరూ..' అంటూ వచ్చి చేతులు కట్టుకుని నిల్చుంది సుబ్బమ్మ.
'ఇది ఓ పెద్ద క్రిమినల్‌. ఓ హత్య కేసులో ముద్దాయి. ఇన్నాళ్లకి దొరికింది. దీంతోపాటూ నువ్వూ స్టేషన్‌కి పద' కోపంగా అరిచాడతను.
'వామ్మో.. దీనికింతుందా? దాన్నట్టుకుపోండి బాబో.. నన్నిరికించకండయ్యగోరూ..' అని బతిమాలుకుంది సుబ్బమ్మ.
'ఓ..రు.. పద.. పదవే!' మళ్లీ అరిచాడు కృష్ణకాంత్‌.
విశాల అతణ్ణనుసరించింది.
హీరోహోండా సింహాచలం దేవస్థానం చేరుకుంది.
సమయం సరిగ్గా నాలుగున్నరవుతుంది.
'విశాలా! నువ్వు చెప్పిందంతా నిజమేనని నమ్మాను. నిన్ను విడిపించాను. నిన్ను పూర్తిగా నేను నమ్మాలంటే నీ తలనీలాలు పూర్తిగా సింహాద్రప్పన్నకు సమర్పించు. ఉదయం ఏడు గంటలకు గోపాలపట్నం పోలీస్‌స్టేషన్లో నన్ను కలుసుకో! ఇది నేనే నీకు పెట్టే ఒక పరీక్షే అనుకో! నీ మేలు కోరుకోవడం అనుకో! లేదా నీకో మంచి అవకాశం కలిపించే ముందు చేసే చొరవే అనుకో! ఏమన్నా అనుకో!' అని విశాలను వదిలి వెళ్లిపోయాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణకాంత్‌.
అలా ఒక మంచి అవకాశం ఏర్పరిచిన కృష్ణకాంత్‌ ఎందుకో ప్రస్తుతం మౌనం వహించాడు.
శ్రీశ్రీశ్రీ
కనకమహాలక్ష్మమ్మ, చంద్రభానూ ప్రయాణానికి సిద్ధమయ్యారు.
'విశాలా! ఇలారామ్మా!' పిలిచింది కనకమహాలక్ష్మమ్మ.
'అమ్మా!' అంటూ వచ్చిన విశాలనే చూస్తుండిపోయిందామె.
ఎందుకో కనకమహాలక్ష్మమ్మ కళ్లల్లో నీరు నిండింది.
'అరేరు! కృష్ణా! వయసులో ఉన్న అందమైన పిల్ల విశాల. అభమూ, శుభమూ తెలియంది. పైగా దిక్కూమొక్కూ లేనిది. విశాలకేదైనా ఉద్యోగం చూసిపెట్టరా! కాస్త కనిపెట్టి చూస్తుండు!' అందామె.
అక్క మాటలు విన్నాడే కానీ 'అలాగే' అన్లేదు కృష్ణకాంత్‌. పైగా 'టాక్సీ వచ్చేసింది అక్కా! ముందు మీరు బయల్దేరండి!' అన్నాడు.
విశాలకు దారితప్పని దిక్సూచిలాంటి మరో అవకాశం దక్కుతుందా అన్నది ప్రశ్నార్థకమైంది.
ఇంటి తలుపులన్నీ బిగించి వేసింది. కిటికీలూ మూసేసింది. ముఖద్వారం తలుపులు మూసి, గెడ బిగించి తాళం వేసింది. తాళం అందివ్వబోతుంటే నవ్వుతూ చూశాడు కృష్ణకాంత్‌.
'వెళ్లొస్తానండీ!' నవ్వుతూనే అంది విశాల.
'ఎక్కడికెళ్తావ్‌?' '.....' పెదవి విరిచింది విశాల.
'ఫుల్‌ లెంగ్త్‌ జాబొకటుంది చేస్తావా? నైట్‌షిప్టూ డే షిప్టూ రెండూ చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు డబుల్‌ డూటీలు. విశ్రాంతనేదే ఉండదు. కష్టపడి కాదు ఇష్టపడి చెయ్యాలి మరి..' అన్నాడు కృష్ణకాంత్‌.
'చేస్తానండి. దయచేసి ఇప్పించండి!' ఆత్రంగా అడిగింది విశాల.
విశాల ఆనందానికి అవధుల్లేవు.
'నా భార్య కామెర్లతో చనిపోయి, మూడేళ్లయింది. నీకూ నాకూ వయసులో పదేళ్లకు పైగా తేడా ఉంది. ఇంతకీ నువ్వు నన్ను ఇష్టపడ్తున్నావా? లేదా? సరేనంటే చెప్పు ఫుల్‌లెంగ్త్‌ జాబ్‌ కోసం..
కృష్ణకాంత్‌ మాటలు విశాలకు ఆశ్చర్యాన్నే కాదు. ఆనందాన్నీ కలుగజేస్తున్నారు. విశాల కళ్ల నుండి ఆనందభాష్పాలు వర్షిస్తున్నారు.. కానీ.. 'నేను చెడిన ఆడదాన్నండీ! మీకు తగను!' అంది విశాల.
'అయితే ఏంటి?' ప్రశ్నించాడు కృష్ణకాంత్‌.
అతని కళ్లలో విశాల భవిష్యత్తు అపురూపంగా ప్రతిబింబిస్తుంది.
కృష్ణకాంత్‌ బండి స్టార్ట్‌ చేశాడు. 'విశాలా! రా కూర్చో!' అన్నాడు. విశాల వెనక సర్దుకుకూర్చుంది.
'కొంచెం ముందుకు వచ్చి కూర్చో! నన్ను గట్టిగా పట్టుకో!!'
ఆమె అతణ్ణి అతుక్కుపోయింది.

ఎల్‌. రాజాగణేష్‌
9247483700