
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం డీజిల్, పెట్రోలు ధరల విషయంలో 'మా ఇంటికొస్తూ ఏం తెస్తావ్ మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్' అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉపశమనాన్ని ప్రజలకు కలిగించనుకాక కలిగించనని భీష్మించడం దారుణం. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ముడి చమురు ధర 92.84 డాలర్లకు తగ్గింది. ఏడు నెలల కనిష్టానికి ధర పడిపోయింది. అక్కడ రేటు తగ్గింది కాబట్టి దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు కొంతైనా తగ్గుతాయేమోనన్న సామాన్యుల ఆశలపై మోడీ సర్కారు నీళ్లు చల్లింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆ మధ్య చమురు ధరలు రికార్డుస్థాయిలో పెరిగినందున ఆయిల్ కంపెనీలకు నష్టాలొచ్చాయని, ఆ నష్టాలను పూడ్చుకోవాల్సి ఉన్నందున ధరలేమీ తగ్గవని సంబంధిత మంత్రి పుంగవుడు చావు కబురు చల్లగా చెప్పారు. యుద్ధం వేళ రష్యా మనకు తక్కువకు చమురు ఇచ్చినందున ఆయిల్ కంపెనీలు లాభపడ్డాయన్న వాస్తవాన్ని కావాలనే దాచిపెట్టారు. ఏతావాతా బోధ పడేదేంటంటే, డీజిల్, పెట్రోలు ధరలు తగ్గించేందుకు మోడీ ప్రభుత్వానికి సుతరాం ఇష్టం లేదని. ప్రజలేమైపోయినా, ఆర్థిక వ్యవస్థ కుదేలైనా తమకేం పట్టదని చెప్పకనే చెప్పింది.
నయా-ఉదారవాద విధానాల అమలులో గత యుపిఎ ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణ ఎత్తేయగా మోడీ సర్కారు డీజిల్‌ను కూడా డీ-కంట్రోల్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే పెరుగుతాయి తగ్గితే తగ్గుతాయన్నారు. అనుభవంలో అదేం కనిపించదు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 మే లో ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.72.26, ఇప్పుడు 96.72. డీజిల్ రూ.55.48 నుంచి 89.62 అయింది. ఎనిమిదేళ్ల క్రితం డీజిల్, పెట్రోల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.16.78 కాగా ప్రస్తుతం ఆ తేడా రూ.7.10. దీన్నిబట్టి మోడీ జమానాలో ధరలు ఏ విధంగా ఠారెత్తుతున్నాయో తెలుస్తుంది. కరోనా మహమ్మారితో జనాల బతుకులు అతలాకుతలమైన సమయంలోనూ ఆదాయ సముపార్జనే లక్ష్యంగా ధరలు పెంచేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ 30-40 డాలర్లకు పడిపోయినా దేశంలో ధరలు పెరిగాయి. 2020 మార్చి1న పెట్రోలు ధర రూ.73 కాగా, 2021 నవంబర్, 2022 మే లో రూ.110 అయింది. వ్యాట్, ఇతర పన్నులు ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రూ.120 దాటిపోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బాగా పడిపోవడంతో ఆ మేరకు కేంద్రానికి రూ.వేలాది కోట్ల అదనపు ఆదాయం వచ్చి పడింది. అదనంగా ఎక్సయిజ్, ఇతర సుంకాలు, సెస్సులు, సర్‌ఛార్జీలు వడ్డించి ఖజానా నింపుకుంది. అదంతా ప్రజల కష్టార్జితాన్ని ముక్కుపిండి వసూలు చేసినదే. సెస్సు ఆదాయంలో రాష్ట్రాలకు నయాపైసా ఇవ్వకుండా ఫెడరల్ వ్యవస్థకు గండి కొట్టింది. ఒక వైపు తాను ఇబ్బడిముబ్బడిగా పన్నులేస్తూ, రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకోవాలని సుభాషితాలు పలికింది. రాష్ట్రాల హక్కులను హరిస్తూ అధిక పన్నులేస్తున్న కేంద్రాన్ని నిలదీయడానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నోరు పెగల్లేదు. కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తదితర రాష్ట్రాలు వ్యాట్‌ను కొంత తగ్గించి తమ ప్రజలకు ఊరట కల్పించగా, మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంది. డీజిల్, పెట్రోల్‌పై అధిక పన్నులున్న రాష్ట్రాల్లో ఎ.పి. ఒకటిగా ఉంది. అందుకే రాష్ట్రంలో ఆయిల్ వినియోగం తగ్గుతోందని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. ఇక్కడి వినియోగదారులు సరిహద్దు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారంటే ఇక్కడ పన్నులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది.
డీజిల్, పెట్రోలు ధరలతో ద్రవ్యోల్బణం రికార్డులు బద్దలు కొడుతోంది. గత నెలలో 6.7 శాతం ఉన్నది కాస్తా నెలలో 7 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 10.9 శాతానికి చేరుకుంది. ఆయిల్ ధరల వలన నిత్యావసరాలు సహా అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్‌బిఐ తరచు రెపో రేటు పెంచుతోంది. ప్రజలకు అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు చక్కబడాలన్నా, సుస్థిర ఆర్థిక వ్యవస్థ నెలకొనాలన్నా చమురు ధరలు తగ్గించడం తప్పనిసరి. మోడీ సర్కారుకు ఈ వాస్తవం తలకెక్కేనా ?