
ప్రపంచ మార్కెట్లో మరోసారి ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. విపణి పండితుల జోస్యాలను వమ్ము చేస్తున్నాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇతర చమురు ఎగుమతి దేశాలు (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించగా అమెరికా పెంచినప్పటికీ జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 30 శాతం పైగా ధరలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఒక పీపా ధర 110 డాలర్ల వరకు పెరిగింది. గురువారం నాటికి ప్రామాణిక బ్రెంట్ రకం ధర 97 డాలర్లు దాటింది. వంద డాలర్ల వద్ద స్థిరపడుతుందని వెలువడుతున్న అంచనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు దుర్వార్తలే. ఇంతకు మించి ధరలు ఎంత కాలం ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఖాయిలా తీవ్రంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. చమురు ధరల తగ్గుదల ఎగుమతి మీద ఆధారపడిన దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కారణంగా అవి ఉత్పత్తిని తగ్గించి ధరలను పెంచుకోవాలని చూస్తున్నాయి. చమురు ధరలు ఆకస్మికంగా పెరగటానికి కారణాలు ఏమిటి? అమెరికా భవిష్యత్ అవసరాల కోసం భారీ ఎత్తున వ్యూహాత్మక చమురు నిల్వల విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి నాలుగు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. తిరిగి వాటిని నింపుతున్నప్పటికీ అవి 2021 నాటి స్థాయికి మాత్రమే చేరతాయనే అంచనాలు ధరలు పెరగటానికి ఒక కారణం. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించటం మరొక కారణమైతే చైనాలో ఆర్థిక వృద్ధి మందగించిందంటూ ఎన్ని కథలు వినిపించినప్పటికీ అక్కడ తిరిగి గిరాకీ ఏర్పడనుందనే అంచనాలు కూడా దోహదం చేస్తున్నాయి.
ఈ ఏడాది సెప్టెంబరులో అమెరికాలో రోజుకు పదమూడు మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి జరిగి 2019 నవంబరు నాటి రికార్డును దాటుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది సగటున నెల వారీ అదే మాదిరి కొనసాగవచ్చని చెబుతున్నప్పటికీ జెపి మోర్గాన్ సంస్థ విశ్లేషకులు చమురు ధర 2026 నాటికి 150 డాలర్లకు చేరవచ్చని చెప్పారు. వచ్చే ఏడాది 90 నుంచి 110 డాలర్ల మధ్య కదలాడవచ్చన్నారు. ఆ సంస్థ విశ్లేషణ వెలువడిన నాడు 93.55గా ఉన్న ధర వారం లోపే గురువారం నాడు 96-97 డాలర్ల మధ్య కదలాడింది. ఈ ఏడాది వంద డాలర్లకు మించక పోవచ్చని ఫిబ్రవరిలో చెప్పిన అంచనా ఏడు నెలల్లోనే తప్పి వంద డాలర్లు దాటే దిశలో పయనిస్తోంది. గిరాకీ-సరఫరా మధ్య లోటు 2025లో రోజుకు 1.1 మిలియన్ పీపాలుగా ఉన్నది 2030 నాటికి 7.1 మిలియన్ల పీపాలకు పెరగవచ్చని జె.పి మోర్గాన్ అంచనా. అందువలన చమురు ధరల్లో స్వల్ప ఎగుడుదిగుళ్లు తప్ప పెరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ధరలు తగ్గిన కారణంగా తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశ్యంతో కడుపు నిండిన అమెరికా చమురు సంస్థలు అసలు ఉత్పత్తినే తగ్గించి వేశాయి. ఇప్పుడు పెరుగుతుండటంతో రిగ్గుల దుమ్ము దులుపుతున్నాయి. రష్యా చమురు ఎగుమతుల నిషేధం కొనసాగుతుందనే ధైర్యం కూడా దీనికి దోహదం చేస్తున్నది.
మాంద్యం వంటి ప్రతికూలతలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న వృద్ధి రేటు చమురు ధరలతో మరింత కుదేలు కావటం ఖాయం. ఆచరణలో అది సామాన్యుల మీద భరించలేని భారాన్ని మోపుతుంది. తినీతినక కాస్తోకూస్తో కూడబెట్టుకున్న సొమ్మంతా ధరల పెరుగుదలతో హరీ అంటున్నది. చమురు ధరలు పెరిగితే మన దేశంలోని 42 శాతం కుటుంబాలు ఆమేరకు ఇతర ఖర్చులు తగ్గించుకుంటాయని గతేడాది లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. ఇప్పటికే డాలరు విలువ పెరగటం, భారత్ వంటి దేశాల కరెన్సీల విలువలు పతనం కావటంతో చమురు కొనుగోలు భారం అవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలతో నిమిత్తం లేకుండా పెట్రోలు, డీజిలు మీద భారీ ఎత్తున సెస్‌లను పెంచి గడచిన తొమ్మిది సంవత్సరాలలో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల మేరకు జనం మీద భారం మోపిన సంగతి తెలిసిందే. అదే మోడీ సర్కార్ 2017 నుంచి ఇప్పటి వరకు కనీస వేతనాలను సవరించలేదు. నగదు రూపంలో గతంతో పోల్చితే పొందుతున్న మొత్తం పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే నిజ వేతనాలు తగ్గాయి, అంటే జనం జేబులకు చిల్లుపడింది. దీన్నే గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు. పెరుగుతున్న ఉప్పుపప్పుల ధరలతో పోల్చితే ఎన్నికల కోసం గ్యాస్ బండ మీద రెండు వందల రూపాయలు తగ్గించిన మాత్రాన జనానికి ఒరిగేదేమీ లేదు. పదేళ్ల క్రితం వున్న స్థితికి చమురు మీద పన్నులు తగ్గిస్తే జనానికి ఉపశమనం.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్