Nov 01,2023 10:21

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో అక్టోబర్‌ 31 వేడుకలకు రోజు కాదని సిపిఎం నాయకులు మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి స్పష్టం చేశారు. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారని, సివిల్‌ సెక్రటేరియట్‌ నుంచి జెండాను తొలగించారని.. ఇలాంటి పనులు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోకుండా అక్టోబర్‌ 31ని ఐక్యతా దినోత్సవంగా ప్రకటించిందని తరిగామి విమర్శించారు. జమ్ముకాశ్మీర్‌లో సామాన్య ప్రజలకు అభివృద్ధి, ఉద్యోగాలు, జీవనోపాధి ఎక్కడా.. అని తరిగామి ప్రశ్నించారు. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాన్ని విడదీసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డౌన్‌గ్రేడ్‌ చేస్తే.. ఇది వేడుక ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం త్వరలో జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చిందని తరిగామి గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించలేదని, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నవి రాష్ట్ర హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నాయని తరిగామి తెలిపారు. జమ్ము, కాశ్మీర్‌, లఢఖ్‌ ప్రజలను అవమానించిన బిజెపి వేడుకలు జరుపుకోవడం శోచనీయమని విమర్శించారు.