
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 'విద్యారంగ పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ, దేశాన్ని కాపాడటం' నినాదాలతో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత జాతాలు (మార్చ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రారంభమయ్యాయి. జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో, తమిళనాడులోని కన్యాకుమారిలో ఏకకాలంలో రెండు జాతాలు సోమవారం ప్రారంభం కావడం విశేషం. శ్రీనగర్ నుంచి ఉత్తర జాతాను మాజీ ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ తరిగామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు నితీష్ నారాయణన్, ఆకిబ్ జర్గర్ పాల్గొన్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఎమ్మెల్యే చిన్నదురై దక్షిణ జాతాను జెండా ఊపి ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను తదితరులు పాల్గొన్నారు.
ఒకటిన్నర నెలలపాటు సాగనున్న విద్యార్థి మార్చ్, జాతా విస్తృత వేదికను నిర్మించడంతోపాటు దేశంలో విద్యార్థి వ్యతిరేక విధానాలు, నూతన విద్యా విధానం, ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించే దిశగా ముగుస్తుంది. ఉత్తర జాతాకు ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి దినిత్ డెంటా నేతృత్వం వహిస్తారు. దక్షిణ జాతాకు ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను నేతృత్వం వహిస్తారు. దక్షిణ జాతా ఆగస్టు 18న తిరువనంతపురంలో ముగుస్తుంది. అదేరోజు ఉత్తర జాతా సిమ్లాలో ముగుస్తుంది. ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు సంగీతా దాస్ నేతృత్వంలోని ఈశాన్య జాతా ఆగస్టు 12న త్రిపుర రాజధాని అగర్తల నుంచి ప్రారంభమవుతుంది. తూర్పు జాతా సెప్టెంబరు 13న ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు మయూఖ్ బిస్వాస్ నేతృత్వంలో బీహార్ రాజధాని పాట్నా నుంచి ప్రారంభమవుతుంది. తూర్పు, ఈశాన్య జాతాలు సెప్టెంబరు 2న కోల్‌కతాలో ముగుస్తాయి. దీప్సితా ధర్ నేతృత్వంలోని పశ్చిమ జాతా సెప్టెంబరు 1న ముంబయి నుంచి ప్రారంభమై సెప్టెంబరు 15న అహ్మదాబాద్‌లో ముగుస్తుంది. వివిధ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, బైక్-సైకిల్ ర్యాలీలు, విద్యార్థులతో జాతా నిర్వహిస్తారు.