ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : రేషన్ కార్డుదారులకు ఈ నెల ఉచిత బియ్యం మాత్రమే అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి నెలా ఎండియు (మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు) ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన సబ్సిడీ బియ్యం (కేజీ రూ.1) దక్కే అవకాశాలు లేవు. ఉచిత బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) కింద మరో ఏడాది పాటు ఉచితంగా బియ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బియ్యం పంపిణీని పునరుద్ధరించినా సరఫరా విధానంలో మాత్రం మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ఉన్న కార్డుదారులకు అందించే బియ్యానికే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదార్దులకు బియ్యం ఇచ్చేందుకు నిరాకరించింది. నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదారులకు ఉచిత బియ్యం అందించేందుకు సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు కేంద్రాన్ని కోరారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సైతం వినతిపత్రం అందించారు. సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించలేదు. కేంద్రం సబ్సిడీ ఇవ్వకపోయినా గతేడాది అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్దుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే బియ్యం అందించింది. పేదలకు మరో ఏడాది ఉచితంగా బియ్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ సబ్సిడీని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడం లేదు. సబ్సిడీపై రూపాయికి కేజీ చొప్పున అందిస్తున్న బియ్యంలోనే దాన్ని సర్దుబాటు చేస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్దుదారులకు, నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఈ క్రమంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బియ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు.
రాష్ట్రంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ, నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డులు మొత్తం 1,45,43,997 ఉన్నాయి. వీటిలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కేటగిరీలోని 90,27,636 కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోంది. నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కేటగిరిలోని 55,16,361 కార్డులకు అందించే బియ్యానికి సబ్సిడీ ఇవ్వడం లేదు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎండియు ఆపరేటర్ల ద్వారా ఇంటింటికీ రేషన్ పేరుతో ఒక్కో లబ్ధిదారునికి ఐదు కేజీల బియ్యం, కార్డుకు అర కేజీ పంచదార, కేజీ కందిపప్పు అందిస్తోంది. బియ్యానికి కేజీ ఒక్కంటికీ రూపాయి చొప్పున, పంచదారకు రూ.17, కందిపప్పుకు రూ.67 వసూలు చేస్తోంది. ప్రస్తుతం బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ కందిపప్పు, పంచదారకు మాత్రం డబ్బులు వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్దిదారులకు మాత్రమే ప్రతి నెలా 15 నుంచి 30వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఐదేసి కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఉచిత బియ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బియ్యం స్థానంలో వాటినే సరఫరా చేస్తోంది. నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్దుదారులకూ ఉచితంగానే ఇస్తోంది. కేజీ రూపాయి చొప్పున ప్రతి వ్యక్తికీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని మాత్రం ఇవ్వడం లేదు. దీంతో, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదారులు సబ్సిడీ బియ్యాన్ని కోల్పోతున్నారు. వీరిలో ముఖ్యంగా నిరుపేదలైన 7,24,214 మంది అంత్యోదయ కార్దుదారులు 35 కేజీల చొప్పున నష్టపోనున్నారు.










