రేషన్ మాఫియాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : రేషన్ బియ్యం ప్రక్కదారి పట్టకుండా అర్హులందరికీ రేషన్ డిపోల ద్వారా అందజేయడం గురించి కాకుండా రేషన్ మాఫియా గత ప్రభుత్వంలోనూ, ఇప్పుడూ ఉన్నట్లు పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పడం విస్మయాన్ని కలిగిస్తున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రేషన్ మాఫియాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమ రవాణా చేసి లాభాలు పిండుకుంటున్నారని అన్నారు. బహిరంగ మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకున్నాక బియ్యం ధరలు పెంచుతున్నారని తెలిపారు. దీనికి తోడు కేంద్రం రేషన్ బియ్యంపై కోత విధించిందని తెలిపారు. ప్రతి పేద కుటుంబం నెలకు రూ.1500 పైగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నదన్నారు. బియ్యం అక్రమ రవాణా ఆపి సరసమైన ధరలకు వినియోగదారులకు అందించాలని కోరారు. గతంలో రేషన్ డిపోల ద్వారా సరఫరా చేసిన సరుకులు కూడా క్రమేణా తగ్గించేశారని, కొన్నిచోట్ల కందిపప్పు ఇవ్వడం లేదని, సరఫరా చేసే క్వాంటిటీ తగ్గించేశారని తెలిపారు. సరఫరా చేసేవి కూడా నాణ్యత లేనివిగా ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి అర్హులైన పేదలకు సక్రమంగా రేషన్ డిపోల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె, చింతపండు మొదలగునవి అందేట్లు చూడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది.










