Jan 01,2023 07:19

వర్షం ధారాపాతంగా కురుస్తోంది. రెండురోజుల నుంచి తెరిపి లేదు. తుఫాన్‌ అనీ రెండు రోజుల క్రితం టీవీలో చెప్పారు.
కాశీ పాకలోంచి బయటకొచ్చాడు. ఆకాశం నల్లగా మేఘాలతో కప్పబడి ఉంది. హోరు గాలి. వర్షానికి ఏరు పొంగింది కాబోలు ఊళ్ళోకి వరద నీరు వస్తోంది. సాయంత్రం నాలుగు గంటలే అయినా మబ్బుల వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి.
వాయుగుండం! వర్షాకాలం వస్తే చాలు ఆ ఊరికి వానలు మొదలవుతాయి.
దానివల్ల కాశీకి బోలెడు నష్టం. చేపల వేటకి పడవ వెయ్యలేడు.
ఎదురుగుండా వేగావతి పాయ. ఆ ఊరి ముందరే వేగావతి రెండుగా విడిపోయింది. పెద్దపాయ ఒడ్డునే ఊరు. ఊరికి దూరంగా ఒడ్డునే కాశీ పాక.
కాశీ ఇంటర్‌ చదివాడు. డిగ్రీలో చేరదాము అనుకున్న సమయానికి తండ్రి వీరన్న చనిపోయాడు. అమ్మ మరో సంవత్సరం తరువాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, వాణ్ణి ఒంటరివాణ్ణి చేసింది.
అప్పట్నుంచీ కాశీ చదువు మానేసి, వేగావతిలో పడవ నడపటం మొదలుపెట్టాడు. అదేవాడి జీవనం అయింది.
ముందు పిల్లనివ్వనన్న మేనమామ సీతన్న వాడి సంపాదన చూసి, కూతురు సుశీలనిచ్చి పెళ్ళి చేశాడు. పెళ్ళి తరువాత ఖర్చులకు పనికొస్తొందనీ టీ దుకాణం పెట్టాడు. వేగవతిలో మధ్యాహ్నం దాకా పడవ వేసి, ఇంటికి వస్తాడు.
అప్పుడు భోజనం చేసి, టీ దుకాణం తెరుస్తాడు. చాలా మంది జాలరి వాళ్ళు టీ గురించి వస్తారు.
రెండు రోజుల నుంచి జోరున వర్షం. ముసురు వల్ల టీ దుకాణాన్ని తెరవలేదు కాశీ. గాలి, వర్షం మరింతగా పెరగటంతో బయటకు వచ్చి చూశాడు. ఆ వర్షపు హోరుకి పూర్తిగా తడిసిపోయి, లోపలికొచ్చేశాడు.
'మావా! టీ తీసుకో' అంటూ సుశీల పిలవడంతో కాశీ ఆలోచనల్లోంచి బయటపడి, టీ కప్పు అందుకున్నాడు.
ఇంతలో మళ్ళీ జల్లు మొదలైంది. రెండు రోజుల నుంచి తెరిపిలేదు. ఇంటి ముంగిట్లోకి వచ్చేసరికి పూర్తిగా తడిసిపోయాడు. సుశీల లోపలి నుంచి తువ్వాల తెచ్చి, ఇచ్చింది.
గట్టిగా తలను తుడుచుకొని, బట్టలు మార్చి కొత్త లుంగీ బనీను వేసుకున్నాడు. ఇప్పుడు వెచ్చగా ఉంది. దానికి తోడు తాగిన వేడి టీ. ముసురు పట్టినపుడు ఇంటి చూరు ముందు కూర్చొని, ఏరుని చూస్తూ టీ తాగటం చిన్నప్పట్నుంచి కాశీకిష్టం. ఇంతలో ఒక వ్యక్తి బ్యాగుపట్టుకొనీ తన ఇంటివైపు రావడాన్ని కాశీ గమనించాడు.
ఈ టైములో ఎవరు చెప్మా ఇటు వస్తున్నారు అనీ చూరు దగ్గర కొచ్చి చూశాడు. ఆ మనిషి పరుగు పరుగున ఇంట్లోకి వచ్చేశాడు. బేగు పూర్తిగా తడిసిపోయింది.
అప్పుడు చూశాడు ఆ వ్యక్తిని. చామనఛాయ రంగులో, ఆరడుగుల పొడవున్నాడు. 'వర్షం బాగా కురుస్తోంది. బయట నిలబడటానికి బస్టాపులేదు. అందుకే మీ ఇంట్లోకి రాక తప్పలేదు' అన్నాడా వ్యక్తి. 'బాబూ! ఈ ముసుర్లో ఇలా వచ్చాశారేటి? అయినా ఎలా వచ్చారు?' అన్నాడు కాశీ.
'కార్లో మా డ్రైవర్‌ ఇక్కడ దించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏటవతల శివడవలసకి వెళ్ళాలి. పడవ వేస్తావా?' అని అడిగాడు.
'ఏరు రెండు వొడ్లని రాసుకుంటూ పొంగుతోంది. ఇప్పుడు పడవ ఏస్తే ఇంక వెనక్కి రావటం ఉండదు. అందులోను ఈ ఏరు దొంగేరు. ఎందర్నో తనలో కలిపేసుకుంది. ఇప్పుడు పడవ ఎయ్యటం కుదరదు' అన్నాడు కాశీ.
'పోనీ తెల్లవారి కుదురుతుందా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. శివడ వలస మా అత్తారి ఊరు. నా భార్య పురిటికనీ ఆ ఊరు వెళ్ళింది. నిన్న రాత్రి నుంచి నొప్పులు వస్తున్నాయనీ మా మామగారు చెప్పారు. అందుకే వర్షం, ముసురు అనీ తెలిసినా ఇలా వచ్చేశాను. నేను ఎలాగైనా వెళ్ళాలి. లేకపోతే నా భార్యకి ప్రాణాపాయం కలుగుతుంది' అన్నాడు.
'అంతగా ప్రాణాపాయం అయితే మీరెళ్ళి మాత్రం ఏటి సెయ్యగలరు? ఏ డాక్టరుకో చూపించాలి కానీ' అన్నాడు కాశీ.
'నేను డాక్టర్నే. అందుకే నేను వెళితే ఆమెకు ఏ అపాయం ఉండదు. సులభంగా ప్రసవం అయిపోతుంది. మందులన్నీ పట్టుకొచ్చాను. నన్ను ఎలాగైనా ఏరు దాటిస్తే చాలు!' అన్నాడు.
అతను ఎప్పుడైతే డాక్టర్ననీ చెప్పాడో కాశీకి అతనంటే గౌరవం కలిగింది. వెంటనే 'నమస్కారం బాబూ!' అంటూ నులకమంచం వేశాడు.
అప్పటికి ఆ వ్యక్తికి వణుకు తగ్గింది. 'బాబూ! లోపలి గదిలోకెళ్ళి బట్టలు మార్చుకోండి' అన్నాడు కాశీ.అతను వెంటనే బ్యాగు తీసుకొని, లోపలికెళ్ళి పది నిముషాల తరువాత బట్టలు మార్చుకొని వచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు.
సుశీల వేడి టీ కాచి తెచ్చిచ్చింది. ఆమె గర్భవతిలా కనిపిస్తోంది. మనిషి ఆయాస పడుతోంది. అతనికి ఆ టీ ఆ సమయంలో అమృతంలా అనిపించింది. వెంటనే గ్లాసందుకొనీ టీ తాగటం మొదలెట్టాడు. ఆరు గంటలైంది అతను ఏమీ తాగలేదు. అందువల్ల ఆ టీ నిజంగా అమృతంలాగే రుచిగా అనిపించింది.
ఆ వేడి టీ తాగిన తరువాత అతను కాస్త స్థిమితపడ్డాడు.
'బాబూ! తమదే ఊరు?' అని అడిగాడు కాశీ.
'నాది విజయనగరం. అక్కడ నేను గవర్నమెంట్‌ డాక్టర్ని'
'బాబూ! ఏటనుకోకపోతే తమరి పేరు?' అని అడిగాడు కాశీ.
'నా పేరు శ్రీకాంత్‌. డాక్టర్‌ శ్రీకాంత్‌ అంటారు' అన్నాడతను.
చీకట్లు ముసురుకుంటున్నాయి. ఒక పక్క హోరుమని ఏటి గాలి. చెట్లన్నీ ఊగిపోతున్నాయి. వర్షం తగ్గలేదు సరికదా, ఇంకా రాను రాను పెరిగిపోతోంది.
శ్రీకాంత్‌ టైము చూసుకున్నాడు.
ఎనిమిది గంటలైంది. 'కాశీ! ఎలాగైనా నేను నా భార్య దగ్గరికెళ్ళాలి. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఏరు తగ్గినట్లుంది. ఇందాకటి హోరు లేదు. ఎలాగైనా పడవ వేసి నన్ను ఏరు దాటించవా? నీ మేలు మరిచిపోను' అన్నాడు డాక్టర్‌ శ్రీకాంత్‌.
'బాబూ! తమరు డాక్టరు. మీకు చెప్పేటంతటోణ్ణా. రాను రాను వర్షం పెరిగిపోతోంది. ఇప్పుడు పడవ ఏస్తే ఏట్లో వరదకి మునిగిపోవడం ఖాయం. ఈ చీకట్లో వరద పొంగుతున్న సమయంలో పడవ అస్సలు వెయ్యకూడదు. మా తాత ఇలాగే వేస్తే, అది వరద ఉధృతికి మునిగిపోయి సచ్చిపోయాడు. అప్పట్నుంచీ రాత్రిపూట పడవ ఎయ్యొద్దనీ మా అయ్య సెప్పేవాడు. అందుకనీ నా మాట వినీ ఈ రాత్రికి హాయిగా మా ఇంట్లోనే ఉండి పోండి. ఏదైనా ఇంత వొండి పెడతాము. తిని నిద్రపోండి. తెల్లారి వర్షం తగ్గితే పడవ ఏసి, తమర్ని ఎలాగైనా ఏరు దాటిస్తాను. ఇంత రాత్రి పూట ఎల్లటం పెమాదం' అన్నాడు కాశీ.
అతని మాటలు వినీ శ్రీకాంత్‌ గొడుగు వేసుకొని బయటకెళ్ళాడు.
వర్షం దంచి కొడుతోంది. గాలి జోరుకి గొడుగు ఎగిరిపోయింది. మెల్లగా అతి కష్టం మీద అతను ఏటి ఒడ్డుకి వెళ్ళాడు.
ఏరు ఎర్రటి బురద నీటితో రెండు గట్లను ఒరుసుకుంటూ పారుతోంది.
శ్రీకాంత్‌ కాసేపు అక్కడ నిలబడి, కాశీ ఇంటికి వచ్చేశాడు.
చీకట్లు కమ్ముకుంటున్నాయి. సూర్యుణ్ణి చూసి రెండురోజులైందనీ కాశీ శ్రీకాంత్‌తో చెప్పాడు.
'కాశీ! రేపుదయం తెల్లారక ముందే రేవు దాటిస్తావా? అలా అయితే రాత్రిక్కడే ఉంటాను' అన్నాడు డాక్టర్‌ శ్రీకాంత్‌.
'తప్పకుండా బాబూ! ఈ వర్షం తగ్గిపోతే ఏటి వరద గంటలో తగ్గిపోతాది. ఈ రాత్రికి వర్షం తగ్గిపోవాలని దేవుడికి మొక్కుకోండి' అన్నాడు కాశీ.
ఇంతలో సుశీల వచ్చి 'డాక్టర్‌ బాబు గారికి భోజనం వొడ్డించమంటావా?' అని అడిగింది. కాశీ డాక్టర్‌వైపు తిరిగి 'సార్‌! వంట అయిపోయింది. భోజనం వడ్డించమంటారా?' అని అడిగాడు. అప్పటికే శ్రీకాంత్‌కి ఆకలి మొదలైంది.
'అలాగే. ఇద్దరం తిందాం' అన్నాడు. సుశీల ఆపసోపాలు పడుతూ ఇద్దరికీ స్టీలు కంచాలు వేసి, వేడి అన్నం.. దానిమీద పప్పుచారు వడ్డించింది.
పప్పుచారు వడ్డిస్తుంటే దాని వాసన ముక్కుపుటాలకు సోకుతూ శ్రీకాంత్‌కి ఆకల్ని మరింత పెంచుతోంది.
ఆ వేడి అన్నం, పప్పుచారుని కలుపుకొనీ ఆవురావురు మనీ తినడం మొదలుపెట్టాడు. కాశీ అతనికి దూరంగా తను కూడా అన్నం కలుపుకొని, నోట్లో పెట్టుకున్నాడు. కాసేపు వర్షం తెరిపిచ్చింది. బయట కీచురాళ్ళ చప్పుళ్ళు తప్పా అంతా నిశ్శబ్దంగా ఉంది. సుశీల వడ్డిస్తూ ఆయాసపడుతుంటే డాక్టర్‌ శ్రీకాంత్‌ ఆమెని చూస్తూ 'ఎన్నో నెల ఈమెకు?' అనీ అడిగాడు.
'బాబూ తొమ్మిది వచ్చి, పదిహేను రోజులైంది. మళ్ళీ వారం పురుడు రావచ్చు' అన్నాడు. 'మందులు అవీ సరిగ్గా వాడుతున్నారా? అని అడిగాడు.
'బాబూ! ఇక్కడెవరిస్తారు. డాక్టరెవరూ ఊళ్ళో లేరు. అవసరం పడితే ఈ ముసురు తగ్గితే పట్నం తీసికెళతాను' అన్నాడు కాశీ.
'అవసరం లేకపోతే హాస్పిటల్‌కి తీసికెళ్ళవా? ఇంట్లో పురుడు పొయ్యడం ప్రమాదం. నాటు వైద్యాలు అసలే పనికరావు. ప్రాణానికి ప్రమాదం. నేను రెండు రోజుల తరువాత విజయనగరం వెళతాను. నువ్వు నాలుగురోజుల తరువాత నా హాస్పిటల్‌కి తీసుకురా. అక్కడ నా హాస్పిటల్లో పురుడు పోస్తాను' అన్నాడు శ్రీకాంత్‌.
'అలాగే బాబూ! తమరు మంచం మీద పడుకోండి' అంటూ లోపలి నుంచి ఓ పట్టె మంచం, దుప్పటీ తెచ్చిచ్చాడు.
పూర్తిగా అలసి ఉండటంతో అతనికి వెంటనే నిద్ర పట్టేసింది.
కొద్దిసేపటి తరువాత గుర్రు పెట్టడం మొదలైంది.
తెల్లవారింది. కాశీ ఒక్క ఉదుటన లేచి, బయటకొచ్చాడు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. పళ్ళు తోముకుంటూ ఏటికి వెళ్ళాడు. వరద తగ్గలేదు సరికదా ఉధృతి మరింత ఎక్కువైంది. అతను ఆ వరదని చూస్తూ చాలాసేపు ఆ గట్టు మీద నిలబడ్డాడు. ఆ తరువాత ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. అప్పటికే శ్రీకాంత్‌ లేచి, తయారైపోయి ఉన్నాడు.
'బయలుదేరుదామా కాశీ?' అని అడిగాడు. కాశీకి ఏం చెప్పాలో తెలీలేదు.
ఆ వరదలో పడవ వెయ్యటం చాలా ప్రమాదం. అతనికి వరదలో పడవ వెయ్యటం అంటే తన తాత గుర్తుకు వస్తున్నాడు.
సుశీల అతనికి సైగ చేసి, లోపలికి రమ్మంది. కాశీ తిన్నగా లోపలికి వెళ్ళాడు.
'మావా! ఏటి వరద తగ్గనేదు. పడవ ఏస్తే పెమాదం' అంది మెల్లగా.
'తప్పదే! ఎల్లాలి. డాక్టరు గారికి మాటిచ్చాను. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు' అంటూ బయటకొచ్చాడు. అప్పటికే శ్రీకాంత్‌ బయట నిలబడి చూస్తున్నాడు.
ఇద్దరూ ఆ వర్షంలో గొడుగు లేసుకొని, రేవు దగ్గరకు బయలుదేరారు.
గాలి ఉధృతి తగ్గలేదు. వర్షం జోరు తగ్గింది, కాశీలో తెగింపు మొదలైంది.
వెంటనే రేవు దిగి, పడవని కట్టిన చోటుకి వెళ్ళాడు.
కాసేపటికి పడవని బయటకు తీశాడు.
తూర్పువైపు తిరిగి, సూర్యుడికి దండం పెట్టి డాక్టరు గార్ని అందులోకి ఎక్కించాడు.
కొద్దిసేపటికి పడవ ఆ వరదలో బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లిన తరువాత.. 'రేరు కాశీ. ఎల్లకు. ఎనక్కి వచ్చేరు' అనీ ఇంకో పడవవాడు భీమన్న గట్టిగా పిలిచేడు. కానీ కాశీ అతని మాటలు వినకుండా పడవని తెడ్డుతో ముందుకు ఉరికించాడు.
ఒక పక్క హోరు గాలి. భోరుమనీ వర్షం, దిక్కులదిరేలా ఉరుములు.. మెరుపులు. వరద ప్రవాహ వేగానికి పడవ బాగా ఊగిపోతోంది. డాక్టరుకి ఆ పడవ ఊగుతుంటే భయం వెయ్యసాగింది.
కొద్దిసేపటికి పడవ ఏటి మధ్యకు చేరుకుంది. ఒక్కసారిగా వరద ఉధృతి మరింత పెరిగింది. ఆ వేగానికి పడవ ప్రవాహంతోపాటు కిందకు వెళ్లిపోసాగింది.
కాశీ తెడ్డుతో దాన్ని ఆపి, ఒడ్డువైపుకి నడిపించటం మొదలుపెట్టాడు.
అలా ఓ గంట కష్టం తరువాత, పడవ అవతలి ఒడ్డుకి చేరుకుంది.
డాక్టరు వెంటనే పడవదిగి 'వస్తాను కాశీ. నీ భార్యని పురిటికి మా హాస్పిటల్‌కి తీసుకురావడం మరిచిపోవద్దు. పట్నంలో నా పేరు చెబితే హాస్పిటల్‌ని ఎవరైనా చెప్పేస్తారు' అంటూ తన కార్డ్‌ ఇచ్చి, వెళ్ళిపోయాడు.
కాశీ చాలాసేపు అతని వెళుతున్న వైపు చూసి, మళ్ళీ పడవలో రేవుని దాటి, ఇంటికి వచ్చేశాడు. ఏ ప్రమాదం లేకుండా తిరిగి వచ్చిన మొగుణ్ణి చూసి, ఎంతో ఆనందపడింది సుశీల.
శ్రీశ్రీశ్రీ
వారం తరువాత సుశీలకి నొప్పులు మొదలయ్యాయి.
హోమియోపతి మందులిచ్చే నాంచారయ్య వచ్చి చూసి 'రేపీ పాటికి పురుడొచ్చేస్తుంది' అని చెప్పటంతో ఏం చెయ్యాలో తోచలేదు కాశీకి.
ఆ సమయంలో వారం క్రితం ముసురులో తమింటికి వచ్చిన డాక్టర్‌ శ్రీకాంత్‌ గుర్తుకొచ్చాడు కాశీకి.
మొదటి పురుడు. ఈ పల్లెలో పోస్తే ప్రమాదమనీ డాక్టరు బాబు చెప్పిన విషయం గుర్తుకు వచ్చిందతనికి. వెంటనే సుశీలని బస్సులో పట్నం తీసికెళ్ళాడు.
ఉదయం పదిగంటలకి బస్సు పట్నం చేరుకుంది. అక్కడ నుంచి తిన్నగా ఆటోలో ఇద్దరూ డాక్టరు గారి హాస్పిటల్‌కి బయలుదేరారు. డాక్టరుగారు పేరు చెప్పగానే ఆటోవాడు తనకు ఆ హాస్పిటల్‌ తెలుసనీ తిన్నగా ఆ హాస్పిటల్‌ ముందు ఆటోని తీసికెళ్ళి ఆపాడు.
అరగంట తరువాత ఆమెని లోపలికి మెల్లగా నడిపించుకుంటూ తీసికెళ్ళాడు.
అది ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్‌. హాస్పిటల్‌ ముందర పెద్ద బోర్డు. బోర్డు మీద డాక్టరు శ్రీకాంత్‌ అతని భార్య ఇద్దరి ఫోటోలు.
లోపలికెళ్ళి రిసెప్షన్‌లో డాక్టరు ఇచ్చిన కార్డుని అతనికి చూపించి, నా భార్య బయట ఉంది. నొప్పులు మొదలయ్యాయి. క్రితంసారి డాక్టర్‌గారు మా ఇంటికి వచ్చినపుడు నా భార్యను ఈ ఆసుపత్రికి తీసుకురమన్నారు' అనీ చెప్పాడు.
డాక్టర్‌గారు ఎవ్వరితోనూ మాట్లాడరు. మీరు డబ్బులు కడితే చేర్పించుకుంటాం' అన్నాడు అతను.
'బాబూ! అంత డబ్బు నా దగ్గరలేదు. డాక్టరు గారికి 'పడవ కాశీ' వచ్చాడని చెప్పండి తప్పక నన్ను లోపలికి రమ్మంటారు' అన్నాడు మళ్ళీ ఆశతో.
'నీకేం పిచ్చా! డాక్టరు గారంటే నీ ఫ్రెండనుకున్నావా? ఈ ఊరికల్లా గొప్ప డాక్టరు గారు. నీలాంటి వాళ్ళెందరో. అందరికీ ఫ్రీగా వైద్యం చేస్తే ఇక హాస్పిటల్‌ నడిపినట్లే' అన్నాడు నవ్వుతూ.
కాశీకి అతని మాటలు శూలాల్లా తగలసాగాయి. ఏం చెయ్యాలో తోచటం లేదు. బయట సుశీలకి నొప్పులు మొదలయ్యాయి. ఒక్కసారి బయటకొచ్చి ఆమెని చూసి, మళ్ళీ రిసెప్షన్‌ దగ్గరికి వచ్చాడు. ఈసారి అతను కాశీని చూసి బాగా చిరాకుపడ్డాడు.
'నీకెన్నిసార్లు చెప్పాలి. వెంటనే డబ్బులు కడితే జాయిన్‌ చేసుకుంటాను. లేకపోతే గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసికెళ్ళిపో' అన్నాడు విసుక్కుంటూ.
ఆ సమయంలో ఒక పెద్ద తెల్లటి కారొచ్చి హాస్పిటల్‌ ముందర ఆగింది.
'సార్‌! డాక్టర్‌ గారొస్తున్నారు' అన్నాడు ఫార్మసిస్ట్‌ రిసెప్షనిస్టుతో. అతని మాటలు విన్న కాశీ ఆనందంతో బయటకు పరుగెత్తాడు. అప్పుడే డాక్టరు కారు డోరు తెరిచి, దిగుతున్నాడు. కాశీ. అతనికి ఎదురు వెళ్ళి నమస్కారం పెట్టాడు.
'ఎవరు నువ్వు' అనీ కోపంగా అడిగాడు డాక్టర్‌ శ్రీకాంత్‌.
'బాబూ! నేను కాశీని. వారం క్రితం ముసుర్లో మా ఊరు వచ్చి నా పడవ ఎక్కారు గుర్తుందా?' అన్నాడు కాశీ.
డాక్టర్‌ కాశీవైపు అదోలా చూసి.. 'లేదు. అయినా నువ్వేం చెబుతునావో అర్థం కావటంలేదు' అన్నాడు.
'నేను బాబూ! కాశీని. ఆ ముసురు రాత్రి మీరు మా ఇంట్లో ఉన్నారు. నేను మిమ్మల్ని ఏరు దాటించాను గుర్తు లేదా?' అన్నాడు కాశీ.
'నువ్వేం చెబుతున్నావో అర్థం కావట్లేదు. గిరీ! ఇతన్ని బయటకు పంపించెరు' అంటూ లోపలికెళ్ళిపోయాడు శ్రీకాంత్‌.
కాశీ అతని మాటలకు బిక్క చచ్చిపోయేడు.
'ఎంత మోసం! ఆ రోజు ప్రాణాలకి తెగించి ఏరు దాటించిన విషయం గుర్తుకు లేదంటే, అంతకన్న ఘోరం ఇంకోటి ఉండదు' అనుకున్నాడు. అతనికి ఏడుపు ఉబికి వస్తోంది. కొద్దిసేపటికి భార్య సుశీలను తీసుకొని, ఆటోలో గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి బయలుదేరాడు.
'మావా! అతనికేటైంది. ఎందుకలా మనల్ని మోసం చేశాడు. ఆ రాత్రి నాకొంట్లో బాగు లేకున్నా వండి పెట్టాను!' అంది సుశీల ఏడుస్తూ. ఆమెకు రాను రాను నొప్పులు పెద్దవి కాసాగాయి.
'ఆడు మనిషి కాడే, జంతువు. డాక్టర్‌ అంటే దేవుడంటారు. అలాంటిది చేసిన మేలు కేవలం డబ్బు కోసం మరిచిపోయిన వాడు మనిషి కాదు. ఒరేరు, నువ్వు డాక్టరు కాదురా. డబ్బు మదంలో కళ్ళు నెత్తికెక్కిన జంతువ్వి. నీ కంటే కుక్క గొప్పది. దానికి విశ్వాసం ఉంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదురా. నీకు మళ్ళీ నా అవసరం వస్తుంది. అప్పుడు నీ ముఖం కూడా చూడను. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొనీ మనిషిగా బతుకు. మనుషులను మనుషులుగా చూడటం నేర్చుకో!' అనీ గట్టిగా అరిచాడు కాశీ.
'చేసిన మేలు మరిచిన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును' దూరంగా మైకులోంచి ఘంటసాల భగవద్గీత వినిపిస్తోంది.
ఆటోలో సుశీలను తీసుకొని, కాశీ ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరాడు.

గన్నవరపు నరసింహమూర్తి