Nov 07,2023 10:48

ప్రకృతి మనకు ఎన్నో అరుదైన పండ్లు, కాయలను అందించింది. పల్లెల్లో దొరికే కొన్ని అరుదైన రకాలు ఉన్నాయి. తాటి చెట్టు నుంచి పడిన తాటికాయ మొలకలనే తేగలు అని కూడా పిలుస్తారు. ఇవి తినడానికి ఎంతగానో రుచిగా ఉంటాయి. అందుకే పల్లెల్లో తేగలంటే పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. తాటికాయలను ఒక దగ్గర జమ చేసి వాటిని భూమిలో పాతిపెడతారు. వర్షాకాలంలో వర్షాలకు అవి మొలకెత్తి శీతాకాలం వచ్చేసరికి తేగలుగా మారుతాయి. కొంత మంది వీటిని సేకరించి తేగలుగా తయారుచేసి పట్టణాలు, నగరాల్లో విక్రయిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. రుచికి తోడు శరీరానికి అవసరమైన ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు వీటిలో ఉంటాయి. తాటి తేగలలో విటమిన్‌ సి, విటమిన్‌ బి, పొటాషియం, పాస్పరస్‌, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఈ తాటి తేగల్లో ఫైబర్‌ బాగా ఉపయోగపడుతుంది. వీటిని నేరుగా తినడం ఇష్టం లేనివారు చిన్న ముక్కలుగా కట్‌ చేసి, ఎండబెట్టుకుని పిండిగా మార్చుకుని కూడా తినొచ్చు. ఈ తాటి తేగల పిండితో రొట్టెలు తయారు చేసుకుని తింటే ఆ పిండిలోని ఫైబర్‌ కారణంగా శరీరంలోని మలినాలు బయటికి పోతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి తేగలు బాగా తోడ్పడుతాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో కూడా తాటి తేగలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తహీనత సమస్యకు కూడా మంచి పరిష్కారం లభిస్తుంది.
 

                                                                      తేగల తయారీ ఇలా...

తాటిచెట్లకు ముంజల గెలలు ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజలను తింటారు. కోయకుండా వదిలేస్తే అవి పండ్లుగా మారి నేలపై రాలిపడతాయి. కొన్ని సహజంగానే మొలకెత్తుతాయి. మరికొన్నిసార్లు వీటిని సేకరించి పొలాల ఒడ్డున, నీరుపారే ప్రాంతంలో పాతిపెడ తారు. అవి మొలకెత్తి పెరుగుతున్న క్రమంలో వాటిని తవ్వి తీసి ఆకులు కత్తిరించి కాండాన్ని కుండలో ఉడకబెడతారు లేదా మంటపై కాలుస్తారు. ఆ తరువాత వాటి మీది పొరను తొలగిస్తారు. ఇవి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.