
జీవోలో పేర్కొన్న కారణాలను చూసినప్పుడు అవి సహేతుకమైనవి కావని మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆరవ పేరాలో పేర్కొన్న కారణాలన్నీ ఒక సంఘటనలో చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించినవి. వాటిని అన్ని సమావేశాలకూ ఆపాదించటంలో ఎటువంటి సహేతుకత లేదు. ఇప్పటిదాకా రహదారులపై కొన్ని వేల సమావేశాలు జరిగి ఉంటాయి. అలాంటి ఒక్క సంఘటనలో జరిగిన ప్రమాదానికి గల కారణాలను అన్ని సందర్భాలలో జరగటానికి అవకాశం ఉందని సూత్రీకరించటం సరైనదికాదు. ఇప్పటికీ ఆ సంఘటన మెజిస్టీరియల్ విచారణలో ఉందని అదే జీవోలో పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కారణాలన్నీ కూడా నివారించదగినవి. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని...నిర్వాహకులు, పోలీసులు అప్రమత్తంగా ఉంటే నివారించదగినవి.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1, ప్రజాస్వామిక హక్కులపై నెంబర్ వన్ నిర్బంధంగా ఉంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, వీధులలో ప్రధానంగా సమావేశాలు నిర్వహించుకోవటానికి అనుమతించకపోవడం మంచిదని అధికారులకు సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని తీసుకు వచ్చింది. అక్కడ సభలకు అనుమతిస్తే లాజిస్టిక్ చలనంపై వ్యతిరేక ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంటే...పోలీస్ చట్టం-1861, సెక్షన్.3 ఇచ్చిన పర్యవేక్షణ అధికారంతో సెక్షన్ 30 ప్రకారం సమావేశాలను క్రమబద్ధీకరించా ల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
అలాగే మున్సిపాలిటీ, పంచాయితీ రహదారులపై కూడా సమావేశాలకు సాధారణ పరిస్థితులలో అనుమతించరాదని, కేవలం ప్రత్యేక పరిస్థితులలో అరుదుగా మాత్రమే అలాంటి రహదారులపై అనుమతించాలని ఆదేశించింది. ఈ రహదారులు ఇరుకుగా, సన్నగా ఉంటాయి. ఈ రహదారులు స్థానికంగా నివాసం ఉండే ప్రజలు స్వేచ్ఛగా తిరగటానికి ఉద్దేశించబడినవి. ఈ రహదారులలో ఎటువంటి అంతరాయం కల్గించినా అది ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు హాని ఏర్పడుతుంది. పౌర జీవనానికి, అత్యవసర సేవలకు ఆటంకం. సాధారణ ప్రజలకు అసౌకర్యం- అంటూ ఈ రహదారులపై నిషేధానికి చెప్పిన ప్రత్యేక కారణాలే కాకుండా సాధారణ కారణాలను కూడా ఇదే జీవోలో చెప్పారు. రహదారులపై సమావేశాలు పెట్టుకోవటం వలన సాధారణ ప్రజలకు భారీ అసౌకర్యం కలుగుతుందని, అలాగే రహదారులపై మీటింగ్ గాయాలకు, మరణాలకు కారణమౌతుందని చెప్పారు. ఈ జీవో 6వ పేరాలో కొన్ని కారణాలను ప్రస్తావించారు. రహదారులు లేక రహదారుల అంచున సమావేశాలు నిర్వహించటం వలన మరణాలు సంభవిస్తాయని, ట్రాఫిక్ అంతరా యం, వాహనాలకు భారీ అంతరాయం కలుగు తుందని అన్నారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దటానికి ఎక్కువ సమయం తీసుకుంటుందన్నారు. దీనివలన అనారోగ్యంతో వున్నవారు, వృద్ధులు, గర్భిణులు, గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్ళి చికిత్స చేయటానికి వీలుపడక ఇబ్బందులకు గురౌతున్నారన్నారు.
కారణాలు - సహేతుకత
జీవోలో పేర్కొన్న కారణాలను చూసినప్పు డు అవి సహేతుకమైనవి కావని మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆరవ పేరాలో పేర్కొన్న కారణాలన్నీ ఒక సమావేశంలో చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించినవి. వాటిని అన్ని సమావేశాలకూ ఆపాదించటంలో ఎటువంటి సహేతుకత లేదు. ఇప్పటిదాకా రహదారులపై కొన్ని వేల సమావేశాలు జరిగి ఉంటాయి. అలాంటి ఒక్క సంఘటనలో జరిగిన ప్రమాదానికి గల కారణాలను అన్ని సందర్భాలలో జరగటానికి అవకాశం ఉందని సూత్రీకరించటం సరైనదికాదు. ఇప్పటికీ ఆ సంఘటన మెజిస్టీరియల్ విచారణలో ఉందని అదే జీవోలో పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కారణాలన్నీ కూడా నివారించదగినవి. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని...నిర్వాహకులు, పోలీసులు అప్రమత్తంగా ఉంటే నివారించదగినవి. ఆ సంఘటనలో నిర్వాహకుల లోపం ఎంత ఉందన్నది విచారణలో వెలుగు చూడవలసి ఉంది. ట్రాఫిక్ అంతరాయాలు, సాధారణ ప్రజల తాత్కాలిక అసౌకర్యాలు అనేకసార్లు అనేక రూపాలలో జరుగుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటనలు, రాకపోకల సందర్భంగా జరుగుతుంటాయి. అనేక మతపరమైన, ఇతర సందర్భాలలో జరుగుతున్నాయి. అంతరాయాలు, అసౌకర్యాలు లేకుండా పోలీసులు ప్రజలను తాత్కాలికంగా ప్రత్యామ్నా య మార్గాలలో పంపించాలి. పోలీసుల పనే అది. అది కూడా చేయనప్పుడు, చేయలేనప్పుడు సెక్షన్ 30 అమలులో పోలీసులు వైఫల్యం చెందినట్లు. జాతీయ, రాష్ట్ర మున్సి పాలిటీ, పంచాయితీ రహదారుల న్నింటిలోను సమావేశాలు రద్దు చేయడమంటే ఇంక ఎక్కడా నిర్వహించుకోవటం సాధ్యం కాదు. సమావేశాలు, ప్రదర్శనలు లాంటివి ప్రజాసా మ్యానికి ప్రాణం లాంటివి. ప్రాథమికమైనవి. అభిప్రాయాలను పంచుకో వటానికి, ప్రభుత్వాలకు తెలియ చేయటానికి అవి మార్గాలు. వాటిని అడ్డుకోవట మంటే ప్రజాస్వా మిక హక్కులపై ప్రత్యక్ష దాడికి దిగడమే.
కోర్టులు ఏం చెప్పాయి ?
ప్రభుత్వం ఊహిస్తున్న ప్రమాదాలు వాస్తవ దూరమైనవి, ఊహాజనితమైనవి కాకూడదని... వాస్తవానికి దగ్గరగాను, ప్రత్యక్ష సంబంధం కలిగి వుండాలని కోర్టులు చెప్పాయి. ఈ విధంగా చూసిన్పుడు ప్రభుత్వం చెప్పిన కారణాలు చెల్లవు.
నిషేధం అనే పదమే లేదా ?
ఆ జీవోలో నిషేధం అనే పదం లేదు. సమావేశాలు పెట్టుకోవద్దు అని మేమనలేదు అంటున్నారు. ఏ దరఖాస్తును అనుమతించవద్దు అంటే అది నిషేధం కాదా? అన్ని రహదారులను ప్రస్తావిస్తూ అనుమతి నిరాకరించమని ఆదేశిస్తే అది నిషేధం కాదా? కేవలం అరుదుగా మినహాయించదగిన కేసులలోనే అనుమతి ఇవ్వాలని ఆదేశించటం నిషేధం కాదా? అనుమ తించటానికి కారణాలు తెలియచేయాలని ఆదేశించటమంటే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయటమే. కాబట్టి ఆచరణలో ఇది నిషేధంగానే మారుతుంది.
ప్రదర్శనలపై స్పష్టత
ఒకవేళ ప్రదర్శనలకు అనుమతి ఉంటే వాటిని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు? ఈ జీవో సాకుగా చూపి ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ జీవోలో కేవలం మీటింగ్‌లు అనే పదం ఉంది. ప్రదర్శనలకు పంబంధించిన ఎలాంటి పరిమితులు చర్చించలేదు. అలాగని వాటికి మినహాయింపు ఇస్తున్నట్లు సష్టంగా ప్రకటించ లేదు. ప్రభుత్వం దానిమీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన స్పష్టత అధికారయుతంగా ఉండాలి.
ఆచరణ సాధ్యం కాని ప్రత్యామ్నాయాలు
జీవోలో చెప్పిన ప్రత్యామ్నాయ స్థలాలు, మైదానాలు ఎన్ని ప్రాంతాలు, నగరాలు, పట్టణాలలో గుర్తించబడి ఉన్నాయి? అవి ప్రజలకు అందుబాటులో లేకుండా, సభ నిర్వహణ అసాధ్యమనే పరిస్థితి ఉంటే అది నిషేధం కాదా? ఇప్పటివరకు అధికారికంగా చాలా కొద్దిపాటి నగరాలు, పట్టణాలలోనే అలాంటి స్థలాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించకూడదా? ప్రజా సమావేశాలకు ప్రైవేటు స్థలాలు ఎవరైనా ఇస్తారా? పబ్లిక్ మీటింగ్‌లను ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవలసిన దుస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుందా?
సెక్షన్ 29పై స్పందన ఏది?
రెండు సంఘటనలు జరిగాయని పోలీస్ చట్టం-1861 సెక్షన్ 30ను రాష్ట్రమంతటా ప్రయోగించిన ప్రభుత్వాలు... పోలీసులు తమ కస్టడీలో ఉన్న వారిపై హింసను ప్రయోగించకూడదనే సెక్షన్ ఉల్లంఘనలకు సంబంధించి మాత్రం స్పందించలేదు. ఈ సెక్షన్ 29 ప్రకారం కస్టడీలో వ్యక్తులపై హింస నేరం. ఇంత వరకు పోలీసులు తమ కస్టడీలోని వ్యక్తులపై హింస ప్రయోగించలేదా?
ప్రతిపక్షాలు- ప్రజాసంఘాలతో చర్చలు
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపాలి. సమావేశం ఏర్పాటు చేయాలి.
సెక్షన్ 30 దుర్వినియోగం
ఈ సెక్షన్ నిరంతరం దుర్వినియోగం అవుతూంటుంది. సెక్షన్ 144 సి.ఆర్.పి.సి ప్రకారం పౌరహక్కులపై పరిమిత కాలం పాటు షరతులు విధించి నియంత్రించటానికి కార్యనిర్వాహక వర్గానికి అధికారం ఉంది. కాని ఆ పేరుతో అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో చట్టంలో పేర్కొన్న కాల పరిమితి కంటే ఎక్కువ సమయం నియంత్రిస్తున్నారు. ఆచరణలో రాజ్యాంగం ఇచ్చిన పౌరహక్కులను నిషేధిస్తున్నారు. ఈనెల 6న విజయవాడ కమిషనర్ ఇచ్చిన ('సాక్షి') ప్రకటన ప్రకారం జనవరి 6వ తారీకు నుంచి మార్చి 31వ వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుంది. అంటే ఒకేసారి 85 రోజులు ఈ చట్టాన్ని విధించారు. అంతటి ప్రత్యేక పరిస్థితులు (ప్రమాదాలు) ఏం ఉన్నాయో ప్రభుత్వమే చెప్పాలి. అన్ని నగరాలు, పట్టణాలలో ఈ చట్టాన్ని నిరంతరం ప్రయోగిస్తూనే ఉన్నారు.
1861 చట్టమా? 1859 చట్టమా ?
అసలు పోలీస్ చట్టం-1861 ఆంద్ర óప్రదేశ్‌కి వర్తిస్తుందా అనేది సందేహం. ఎందు కంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి 1859లో ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) డిస్ట్రిక్ట్ యాక్ట్- 1859, యాక్ట్ నెం. 24 (రోమన్ అంకెలు) ఆఫ్ 1859 ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వాలకు పోలీసులపై పర్వవేక్షణ అధికారాలు ఉన్నాయి. ఈ చట్టం ఉండగా 1861 చట్టం సెక్షన్ 3లో ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ ప్రభుత్వం జీవో నెం.1 తీసుకు వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక చట్టం ఉండగా వేరే చట్టాన్ని ఉపయోగించి జీవో తీసుకురావటమనేది చట్టపరంగా నిర్ధారణ కావాల్సి వుంది.
1861వ చట్టం మార్పు అవసరం
ప్రజాస్వామ్య పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఈ చట్టం ఏ విధంగాను సహాయపడదు. ప్రభుత్వానికి పోలీసులపై ఎటువంటి మార్గదర్శకాలు, నియంత్రణలు లేని పర్యవేక్షణ అధికారాన్ని ఈ చట్టం ఇచ్చింది. ఫలితంగా పోలీసు వ్యవస్థలో రాజకీయ ప్రభావం విపరీతంగా పెరిగి...చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు...రాజకీయ నాయకుల చట్ట వ్యతిరేక సిఫార్సులకు తలొగ్గి పనిచేస్తున్నారు. పోలీసు జవాబుదారీతనానికి సరైన యంత్రాంగాన్ని ఈ చట్టం కల్పించలేదు. 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు తరువాత వచ్చిన ఈ చట్టం బ్రిటీషు అవసరాలకు అనుగుణంగా ఉన్నది. నేషనల్ పోలీసు కమిషన్ 1981లో ఇచ్చిన 8వ నివేదికలో ...ఒక నమూనా పోలీసు చట్టాన్ని తయారు చేసి అందించింది. అంటే 1861వ చట్టం స్థానంలో అలాంటి చట్టం వుండాలని సూచించింది.
ఉపసంహరించాల్సిందే !
ఏదో ఒక కారణంతో ప్రశ్నించే వారి గొంతు నొక్కి పౌరహక్కులపై నిర్బంధం తీసుకురావటం సరైన చర్య కాదు. సభలు, సమావేశాలపై సహేతుక షరతులు విధించి ప్రజా భద్రతను, సౌకర్యాలను కాపాడవచ్చు. కనుక ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించాలి.
/ వ్యాసకర్త : ఎ.పి.సి.ఎల్.ఎ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది /
పొత్తూరి.సురేష్ కుమార్