Sep 10,2023 12:11

కరోనా తర్వాత వర్చువల్‌ మీటింగ్స్‌కు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆ సమయంలోనే జనానికి బాగా అందుబాటులోకి వచ్చిన వర్చువల్‌ మీటింగ్‌ సాధనం ''జూమ్‌'' (్గశీశీఎ). ఈ జూమ్‌ ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీడియో కాల్స్‌ సమయంలో, మీటింగ్స్‌ సమయంలో ముఖ్యమైన సమాచారాన్ని నోట్‌ చేసుకోవడంతో పాటు ఎడిట్‌ చేయడానికి, టెక్స్ట్‌ డాక్యుమెంట్‌ రూపొందించడానికి, షేర్‌ చేయడానికి ఉపయోగపడేలా 'నోట్స్‌' (చీశ్‌ీవర) అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
జూమ్‌ చాట్‌ బాక్స్‌ మాదిరిగానే వీడియో కాల్‌ స్క్రీన్‌పైన ఈ నోట్స్‌ ఫీచర్‌ కూడా ఓ వైపున కనిపిస్తుంది. మీటింగ్‌లో పాల్గొంటున్న వ్యక్తులు ముఖ్యమైన సమాచారాన్ని నోట్‌ చేసుకోవడానికి మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ 'నోట్స్‌' అనే ఫీచర్‌లో రాసుకోవడంతో పాటు ఎడిట్‌ చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసిన లేదా ఎడిట్‌ చేసిన నోట్స్‌ను జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న సభ్యులందరికీ షేర్‌ చేయవచ్చు. నోట్స్‌ అనే ఈ ఫీచర్‌ను పరిచయం చేయడంవల్ల వినియోగదారులు థర్డ్‌ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని తప్పింది. అంతేకాదు, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు.. ఇతర కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్‌ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ, మీటింగ్‌ అజెండాలు, నోట్స్‌లు తయారుచేసుకునేలా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు 'జూమ్‌ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్‌' హెడ్‌ డారిన్‌ బ్రౌన్‌ వెల్లడించారు.
'జూమ్‌' మీటింగ్‌లో పాల్గొనే సభ్యులు.. ఆ మీటింగ్‌ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్‌ జరుగుతున్న సమయంలో కానీ 'నోట్స్‌' ఫీచర్‌ ద్వారా అజెండా రూపొందించుకుని, దానిని ఆ మీటింగ్‌లోని సభ్యులకు షేర్‌ చేయవచ్చు. అంతేకాదు.. మీటింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్‌ చేసే వీలు ఉంటుంది. ఇంకో ముఖ్యమైన సౌలభ్యం కూడా ఈ 'నోట్స్‌' లో వుంది. టైప్‌ చేసుకున్న సమాచారాన్ని ఫాంట్‌, స్టైలింగ్‌, బుల్లెట్‌లు, టెక్ట్స్‌ కలర్స్‌ ద్వారా ఆకర్షణీయంగా మార్పు చేసుకోవచ్చు. అలాగే, ఈ సమాచారానికి ఇమేజ్‌లను, లింక్‌లను కూడా జత చేయవచ్చు. ఈ 'నోట్స్‌' ఫీచర్‌లోని సమాచారం ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా సేవ్‌ అవుతుంది. కనుక ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా సమాచారాన్ని కోల్పోయే అవకాశం కూడా లేదు. జూమ్‌ వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా రూపొందిన ఈ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది.