
మునుగోడు ఎన్నికల ఫలితం...ఆ మాట కొస్తే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు ఉప ఎన్నికల ఫలితాల గురించి...అట్టే ఆలోచించడానికి ఏమీ లేదు. ఎవరి స్థానాల్లో వారున్నారు. ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలు బిజెపి గెలుచుకుంది. అందులో మూడు గతంలో తాను ప్రాతినిధ్యం వహించినవే.. నిలుపుకుంది. ఇంకో రెండు స్థానాల ఎన్నికలు బిజెపి లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరగా వచ్చినవి. అందులో ఒకటి వచ్చింది ఒకటి పోయింది. అందరి దృష్టి తెలంగాణలో మునుగోడు పై ఉండింది. ఎందుకంటే అక్కడి అధికార పార్టీ తెరాస...బిజెపి వ్యతిరేక పార్టీగా జాతీయ స్థాయిలో రూపుదిద్దుకోనుంది. పైగా అక్కడి శాసనసభ ఎన్నికలు ఏడాదికే రానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అది గెలవడం చాలా అవసరం. ఇక బిజెపి ఆ రాష్ట్రంలో అధికార పార్టీకి తానే గట్టి పోటీదారునని నిరూపించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ఉప ఎన్నికను తీసుకు వచ్చింది. ఆ రెండు బలమైన పార్టీలూ అన్ని రకాలా బలాల్ని ఒడ్డి పోరాడాయి. అందులో భాగంగా ఇరు పార్టీల సౌజన్యంతో అతి ఖరీదైన ఎన్నికలుగా డబ్బు, మద్యం ప్రవహించిన పోటీగా తయారైంది. ఇప్పుడు తెరాస గెలిచింది. అయితే ఒక బల నిరూపణ కోసం, ఒక పైచేయి కోసం ఏ మార్పూ తేలేని ఒక తతంగానికి ఇంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాలా? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఆయా పార్టీలు తెస్తున్న చేటు కొలవగలమా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, సిద్ధాంతాలు మ్యానిఫెస్టోలు వెనక్కిపోయి, రాద్ధాంతమే కీలకమైన వ్యూహంగా మార్చడం. అందుకు అధికార పక్షాలు ముందు నిలవడం మంచి పరిణామాలు కావు. సామాన్యుడికి ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ ధోరణికి ఇది అంతం కాదు..ఆరంభం. డబ్బు ప్రభావం లేని ఎన్నికల సంస్కరణలు వచ్చేలా పౌర సమాజం ఒత్తిడి తీసుకు రాలేకపోతే పరిస్థితిలో మార్పును ఆశించడం అత్యాశే.
- డా|| డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.