Oct 29,2022 06:51

అధికారిక భాషలలో ఇంగ్లీష్‌ను ఒక భాషగా కొనసాగించాలని దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ప్రజల అభిప్రాయం. కెనడాలో ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ రెండు అధికార భాషలు ఉన్నట్లు... నేడు మన దేశంలో హిందీ, ఇంగ్లీష్‌ రెండు అధికార భాషలున్నాయి. ఈ పరిస్థితుల్లో హిందీ, ఇంగ్లీష్‌ రెండూ అధికార భాషలుగా ఉండేలా విధాన నిర్ణేతలు రాజ్యాంగపరమైన నిబంధనల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం హిందీ, ఇతర భారతీయ భాషలను ప్రేమిస్తాం. కాబట్టి, ఆధునిక శాస్త్ర సాంకేతిక అవసరాలను తీర్చగలిగేలా వాటి సహజ అభివృద్ధికి హామీ ఇచ్చే ప్రయత్నాలు చెయ్యాలి. అదే సమయంలో సైన్స్‌ను, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకునేందుకు మనకు ఇంగ్లీష్‌ కూడా చాలా అవసరం.

భారత రాష్ట్రపతికి 2022 సెప్టెంబర్‌ 9న సమర్పించబడిన అధికారిక భాషా కమిటీ నివేదిక లోని పదకొండవ సంపుటి, మీడియాలో అంతగా ఆసక్తి రేకెత్తించినట్లు లేదు. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులను మినహాయిస్తే ఏ రాజకీయ నాయకుడు ఆ సిఫార్సులకు ప్రతిస్పందించలేదు.
        ప్రింట్‌ మీడియాలో చెప్పిన దాని ప్రకారం ప్రధానమైన సిఫార్సులు ఏమంటే, ప్రభుత్వ నియాకపు పరీక్షల భాషగా ఇంగ్లీష్‌ స్థానంలో హిందీ ఉండాలి. కేంద్రీయ విద్యాలయాలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎమ్‌), సెంట్రల్‌ యూనివర్సిటీలలో బోధనా మాధ్యమంగా హిందీ మాత్రమే ఉండాలి. హిందీని ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా కట్టుబడి ఉండాలి. అధికార భాషా కమిటీ అనేది 'అధికార భాషా చట్టం-1963' కింద ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్దమైన కమిటీ. కేంద్ర ప్రభుత్వ అధికారిక లక్ష్యాల కోసం హిందీని ఉపయోగించడంలో సాధించిన ప్రగతిని సమీక్షించి, ఆ నివేదికను రాష్ట్రపతికి సమర్పించే బాధ్యత అధికార భాషా కమిటీది. అయితే ఈ చట్టం ప్రకారం, మొత్తం నివేదికను లేదా దానిలోని ఏదైనా కొంత భాగానికి (సెక్షన్‌ 4(4)) రాష్ట్రపతి కొన్ని మార్గదర్శకాలను జారీ చేయాల్సి వుంటుంది.
        రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 343...దేవనాగరి లిపిలో ఉండే హిందీని, దేశ అధికార భాషగా ప్రకటిస్తుంది. అధికార భాషా సమస్యపై రాజ్యాంగ పరిషత్‌ వాడివేడి చర్చలు జరిపిందన్న విషయం అందరికీ తెలిసిందే. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన ముఖ్యనేతలు కుదిర్చిన రాజీ ఫలితంగానే రాజ్యాంగం లోని ''అధికార భాష'' అనే అధ్యాయం తుది రూపు దిద్దుకుంది. చివరికి దేశ అధికార భాషగా హిందీని ప్రకటిస్తూ, రాజ్యాంగం అమలు ప్రక్రియ ప్రారంభం నాటి నుండి ఇంగ్లీష్‌ కూడా పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతుందని ప్రకటించారు. అవసరమైతే పదిహేను సంవత్సరాల తరువాత కూడా ఇంగ్లీష్‌ భాష కొనసాగే అవకాశం కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేస్తుందని కూడా చెప్పారు. దాని ప్రకారమే...కేంద్రం యొక్క అధికారిక అవసరాలు, పార్లమెంట్‌లో వ్యాపార లావాదేవీల కోసం హిందీతో పాటుగా ఇంగ్లీష్‌ను కూడా నిరవధికంగా అధికార భాషగా కొనసాగిస్తూ 'అధికార భాషా చట్టం-1963'ను పార్లమెంట్‌ ఆమోదించింది.
          సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐఎమ్‌ లు, ఐఐటీలలో బోధనా మాధ్యమంగా ఉన్న ఇంగ్లీష్‌ స్థానంలో పూర్తిగా హిందీని తీసుకు రావాలని కమిటీ చెప్పడంతో, అధికారిక భాషా కమిటీ చేసిన సిఫార్సులు రాష్ట్రపతికి సమస్యగా తయారయ్యాయి. కేంద్రం అవసరాలు తీర్చుకోవడంలో హిందీ భాష సాధించిన ప్రగతిని సమీక్షించి, దానిని రాష్ట్రపతికి సమర్పించడం కమిటీ విధి. అంతే తప్ప వృత్తి విద్యా సంస్థల్లో, యూనివర్సిటీలలో బోధనా మాధ్యమాన్ని సిఫార్సు చేసే అధికారం కమిటీకి లేదు. అంతేకాక హిందీతో పాటుగా ఇంగ్లీష్‌ కూడా కొనసాగుతుందని పార్లమెంట్‌ ఒక చట్టం ద్వారా ప్రకటించింది. అదే చట్టం కింద ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్దమైన కమిటీ (స్టాట్యుటరీ కమిటీ)కి ఇంగ్లీషును కొనసాగించవద్దని సిఫార్సు చేసే అధికారం లేదు.
 

                                                                హిందీ యేతర రాష్ట్రాల్లో దుష్ఫలితాలు

ఇంగ్లీష్‌ స్థానంలో హిందీని తీసుకురావాలని నాడు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలితంగా 1960లలో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైన భావోద్వేగాలను, ఆహుతులు, దహనాలు, హింసాత్మక నిరసనలను భారతదేశం చూడాల్సి వచ్చింది. కాబట్టి దక్షిణాది ప్రాంతాల్లో ప్రజల భావాలను శాంతింపజేసేందుకుగాను ఇంగ్లీషును కొనసాగించాలనే నిర్ణయం పార్లమెంట్‌ చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్‌ను నిరవధికంగా ఉపయోగించవచ్చనే చట్టం లోని నిబంధన... ప్రజల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడంలో సహాయపడింది. భాషకు సంబంధించిన సమస్యకు, ప్రజలను మానసికంగా విభజించగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని అవగాహన చేసుకోవడానికి గొప్ప పరిశోధన ఏమీ అవసరం లేదు. ఇది ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు హిందీ నేర్చుకోడానికి, వారి ఇష్టాయిష్టాలకు సంబంధించిన సమస్య కాదు. ఈ సమస్యలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకసారి ఇంగ్లీష్‌ స్థానంలో హిందీని తీసుకొస్తే, అఖిల భారత స్థాయిలో జరిగే ఉద్యోగ నియామకాలలో ఉపయోగించే భాష కూడా హిందీ మాత్రమే ఉండాలి.
కాబట్టి, హిందీ మాతృభాషగా ఉన్నవారితో పోలిస్తే, హిందీ యేతర రాష్ట్రాలకు చెందిన వారు ముఖ్యంగా దక్షిణాది వారు తీవ్ర ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ఫలితంగా అఖిల భారత సర్వీసుల నియామకాలలో హిందీ యేతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. రాజ్యాంగ నిర్మాతలు ఈ సమస్యను ముందుగానే ఊహించారు. అందుకే, ప్రజాసేవల విషయంలో హిందీ మాట్లాడని ప్రాంతాలకు చెందిన వ్యక్తుల న్యాయమైన వాదనలు, వారి ప్రయోజనాల పట్ల అధికారిక భాషా కమిటీ జాగ్రత్త వహించే విధంగా ఆర్టికల్‌ 344(3) ను రాజ్యాంగం ఏర్పరచింది.
భారతదేశంలో రెండు ప్రధాన భాషల సమూహాలు ఉన్నాయి. ఒకటి, ఇండో యూరోపియన్‌ భాషా సమూహం. రెండు, ద్రావిడ భాషా సమూహం. హిందీ మొదటి సమూహానికి చెందగా, తమిళం (సంస్కృతం కంటే పురాతనమైనది) రెండవ సమూహానికి చెందినది. ద్రావిడ సమూహంలోని తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషలు చాలా ఉన్నతమైన సాహిత్యాన్ని కలిగి వున్నాయి. అయినా ఉత్తర, దక్షిణాది ప్రాంతాలను ఒకచోటుకు తీసుకొచ్చింది ఇంగ్లీష్‌ భాష మాత్రమే. రాజ్యాంగ పరిషత్‌లో మౌలానా ఆజాద్‌ ఇలా పేర్కొన్నారు: ''భాషకు సంబంధించినంత వరకు ఉత్తర, దక్షిణాది ప్రాంతాలు రెండు భిన్నమైన భాగాలు. ఈ రెండు ప్రాంతాల కలయిక ఇంగ్లీష్‌ మాధ్యమం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ రోజు మనం ఇంగ్లీష్‌ను వదిలివేస్తే, తరువాత భాషాపరమైన సంబంధం ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది''.
          దేశానికి ఒక అధికారిక భాష అనే భావన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఏర్పడింది. హిందీ, ఉర్దూల కలయికతో కూడిన హిందూస్థానీని ప్రోత్సహించారు. తరువాత, రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హిందుస్థానీ అనే భావనను విడిచిపెట్టి, దేవనాగరి లిపిలో ఉండే హిందీని అధికార భాషగా స్వీకరించారు. రెండు ప్రధాన భాషా సమూహాలు ఉన్న దేశంలో, ప్రజల ఐక్యతను నిలబెట్టడంలో ఒకే అధికారిక భాష అనే భావన ఎక్కువ దూరం వెళ్ళకపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో, అఖిల భారత సర్వీసుల ప్రాంతీయ ప్రాతినిధ్యంలో, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది నియామకాలలో తీవ్రమైన అసమతుల్యతలకు దారితీయవచ్చు.
 

                                                              మారుతున్న ప్రపంచానికి ఇంగ్లీష్‌ అవసరం

దక్షిణాది రాష్ట్రాలు ఢిల్లీ నుండి ఎవరు పాలిస్తారో నిర్ణయించలేవు. కేంద్ర నిర్ణయాన్ని ప్రభావితం చేయలేవు. కాబట్టి ఆ ప్రాంత ప్రజల భాషాపరమైన సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశ అధికారిక భాషగా సరైన స్థానం ఇవ్వబడిన హిందీ చాలా అందమైన, సరళమైన భాష. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ నిర్మాతలు, హిందీతో పాటుగా ఇంగ్లీష్‌ కూడా అధికారిక భాషగా కొనసాగేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇంగ్లీష్‌ భవిష్యత్తును నిర్ణయించే అంశాన్ని వారు పార్లమెంటుకు వదిలివేస్తే, అది చట్టం ద్వారా ఇంగ్లీష్‌ నిరవధికంగా కొనసాగాలని నిర్ణయించింది. స్వాతంత్య్ర పోరాటం, జాతీయవాద ఉత్సాహం, అన్నింటినీ మించి దేశం కోసం ఒక జాతీయ భాష కావాలనే గాంధీజీ బలమైన కోరిక... రాజ్యాంగ పరిషత్‌ను ప్రభావితం చేశాయి. అయితే భారత్‌ ప్రపంచ దేశాలతో సంబంధాలను ఏర్పరచుకోవడం మొదలయ్యాక ఆ పరిస్థితి నెమ్మదిగా మారింది. కాబట్టి 1960ల నాటికి, ఇతర రంగాలలోని మానవ కార్యకలాపాలతో పాటుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజ్ఞాన సముపార్జనకు ఇంగ్లీష్‌ చాలా కీలకమనే విషయాన్ని రాజకీయ వర్గాలు తెలుసుకున్నాయి. ఆ విధంగా ఇంగ్లీష్‌ను కొనసాగించాలని పార్లమెంట్‌ నిర్ణయించింది.
            అధికారిక భాషలలో ఇంగ్లీష్‌ను ఒక భాషగా కొనసాగించాలని దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ప్రజల అభిప్రాయం. కెనడాలో ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ రెండు అధికార భాషలు ఉన్నట్లు... నేడు మన దేశంలో హిందీ, ఇంగ్లీష్‌ రెండు అధికార భాషలున్నాయి. ఈ పరిస్థితుల్లో హిందీ, ఇంగ్లీష్‌ రెండూ అధికార భాషలుగా ఉండేలా విధాన నిర్ణేతలు రాజ్యాంగపరమైన నిబంధనల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం హిందీ, ఇతర భారతీయ భాషలను ప్రేమిస్తాం. కాబట్టి, ఆధునిక శాస్త్ర సాంకేతిక అవసరాలను తీర్చగలిగేలా వాటి సహజ అభివృద్ధికి హామీ ఇచ్చే ప్రయత్నాలు చెయ్యాలి. అదే సమయంలో సైన్స్‌ను, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకునేందుకు మనకు ఇంగ్లీష్‌ కూడా చాలా అవసరం.

(వ్యాసకర్త లోక్‌ సభ మాజీ సెక్రటరీ జనరల్‌)

('ద హిందూ' సౌజన్యంతో)
పి.డి.టి. ఆచారి

పి.డి.టి. ఆచారి