
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన చందంగానే ఉత్తరాంధ్రకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్యాయమే చేస్తోంది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా, విభజన చట్టం లోని ఒక్కటంటే ఒక్క అంశం కూడా సంపూర్ణంగా నేటికీ అమలు కాలేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధుల ద్వారా పెండింగు నీటి ప్రాజక్టులన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలమవుతుందని భావించాం. కానీ, ఈ నిధులు వచ్చిందీ లేదు - ఒక్క చుక్క నీరు కూడా అదనంగా లభ్యం అయిందీ లేదు. రైల్వే జోన్ ఏర్పాటుపై బిజెపి నాయకులు ప్రకటనలతోనే కాలక్షేపం చేస్తూ, ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి జపం ఎంత చేస్తున్నా ఆచరణలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇసుమంత కూడా కానరాలేదు. రాష్ట్ర విభజన తరువాతనయినా, విభజన చట్టంలోని అంశాల అమలు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆశించాం. కానీ కేంద్ర బిజెపి ప్రభుత్వ ద్రోహం వల్ల ఈ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కాలేదు కదా, మరింత వెనుకబాటులోనికే నెట్టబడింది. పేదరికం, వలసలు పెరుగుతూనే ఉన్నాయి. మాతా శిశు మరణాలు, అక్షరాస్యత, వ్యవసాయ దిగుబడి, విద్య, వైద్య సదుపాయలన్నింటిలోనూ వెనుకబాటు స్పష్టంగా కనబడుతూనే ఉంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన చందంగానే ఉత్తరాంధ్రకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్యాయమే చేస్తోంది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా, విభజన చట్టం లోని ఒక్కటంటే ఒక్క అంశం కూడా సంపూర్ణంగా నేటికీ అమలు కాలేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధుల ద్వారా పెండింగు నీటి ప్రాజక్టులన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలమవుతుందని భావించాం. కానీ, ఈ నిధులు వచ్చిందీ లేదు-ఒక్క చుక్క నీరు కూడా అదనంగా లభ్యం అయిందీ లేదు. రైల్వే జోన్ ఏర్పాటుపై బిజెపి నాయకులు ప్రకటనలతోనే కాలక్షేపం చేస్తూ, ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. విశాఖ మెట్రో రైల్ ఊసే మరిచారు. పెట్రో యూనివర్సిటీ నిర్మాణమే ప్రారంభం కాలేదు. గిరిజన యూనివర్సిటీకయితే ఇంకా స్థల సేకరణే జరగలేదు. ఐఐఎం నేటికీ తాత్కాలిక భవనాల నుండే నడుస్తోంది. చేసిన మంచేమీ లేదుగానీ, ప్రపంచమంతా తిరస్కరించిన కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను మాత్రం మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర నెత్తిన రుద్దుతోంది. వీటన్నింటికీ పరాకాష్టగా ఉత్తరాంధ్రకే మణిహారంగా నిలిచిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ఏకంగా అమ్మేయాలనే దుస్సాహసానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడింది.
ఈ ద్రోహాన్ని ఎండగట్టి, రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు న్యాయంగా రావలసిన వాటిని సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిన రాష్ట్ర అధికార, ప్రధాన విపక్ష పార్టీలు ఆ పని చేయకపోగా, తిరిగి కేంద్ర ప్రభుత్వానికి బలం చేకూరేలా వ్యవహరిస్తున్నాయి. విభజన హామీలపై బిజెపిని పదేపదే ప్రశ్నించిన పవన్ ఆ బిజెపి తోనే జత కట్టడం ఉత్తరాంధ్రకు మరీ అన్యాయం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నిజమైన అభివృద్ధి సాధన...ఈ ప్రాంత యువతీ యువకులు, అభివృద్ధి కాముకులు ముందుకు రావడం ద్వారానే సాధ్యం.
ఆ దిశలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక బృందం ఇటీవల నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర అభివద్ధి జాతా చేపట్టింది. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఉపాధి, నీటి ప్రాజక్టులు, ఉపాధి వంటి రంగాలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ముందుకు వచ్చాయి.
ప్రజల ఉపాధి అవకాశాలు పెంచే చర్యలేవీ ప్రభుత్వాలు ఈ కాలంలో కూడా చేపట్టలేదు. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు, 1200 గ్రామాలలో 30 లక్షల మంది ప్రజలకు తాగు నీరందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజక్టుకు 2009 లోనే నాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కేవలం ఆ శిలాఫలకమే మిగిలింది. వంశధార, నాగావళి నదులపై ప్రాజక్టుల పనిలో ఎటువంటి పురోగతీ లేదు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో మహేంద్ర తనయ నదిపై నిర్మించతలపెట్టిన ఆఫ్ షోర్ ప్రాజక్టుకు 2008 లోనే శంకుస్థాపన జరిగినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో 1978లో ప్రారంభించిన జంఝావతి ప్రాజక్టు నేటికీ పూర్తికాలేదు. విచిత్రమేమిటంటే వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజక్టులుగా పేర్కొంది. అయినా నిధులు మాత్రం ఇవ్వకపోవడంతోనే నేటి దుస్థితి. దీని ఫలితంగానే ఈ కాలంలో ఒక్క చుక్క నీరు కూడా అదనంగా రాలేదు. ఇదే నేటి గ్రామీణ పేదరికానికి, వలసలకు ప్రధాన కారణం. మరో పక్క ఈ ప్రాంతంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించిన జూట్, సుగర్ వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతబడుతున్నాయి. వీటిని తెరిపించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేమీ లేకపోగా...మంత్రులే యాజమాన్యాల కొమ్ము కాసిన ఉందంతాలు అధికం.
విద్యలో ఇప్పటికే వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర, మరింత దిగజారేలా పాలకుల విధానాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో 154 మంది శాశ్వత అధ్యాపకులుండవలసిన చోట కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. మూడు వేల మందికి పైగా విద్యార్ధులున్న ఐఐఐటి లో 220 మందికి పైగా సిబ్బందికి గాను, నేడు కేవలం ఇద్దరే శాశ్వత అధ్యాపకులున్నారు. ఆంధ్ర యూనివర్సిటీతో సహా అన్ని విద్యా సంస్థలలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వ ఎయిడ్ రద్దు కావడంతో విజయనగరం ఎం.ఆర్ కాలేజీ, పార్వతీపురం వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ వంటివి పూర్తిగా కళావిహీనమై పోయాయి. విశాఖ ఎవిఎన్ కాలేజీ, అనకాపల్లి ఎఎంఏఎల్, బొబ్బిలి రాజా కాలేజీలలో కూడా ఇదే స్థితి.
అనేక ఆసుపత్రులలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. నూతనంగా నిర్మించిన టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పిల్లల, ఆర్ధో, క్యాన్సర్, కిడ్నీ వంటి అనేక వ్యాధులకు స్పెషలిస్టు డాక్టర్లే లేరు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖ విమ్స్, కెజిహెచ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా ఇదే తీరు. భవనాలున్నా లోపల సదుపాయాలన్నీ అరకొరే.
పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి దమనీయ స్థితిలోకి నెట్టబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాకారం కావాలంటే రాష్ట్ర విభజన చట్టం సంపూర్ణంగా అమలు జరగాలి. వంశధార, నాగావళితో సహా పెండింగ్ నీటి ప్రాజక్టుల నిర్మాణానికి ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ద్వారా 30 వేల కోట్ల రూపాయలు కేటాయించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని విడనాడి, సొంత గనులు కేటాయించాలి. విశాఖ ప్రభుత్వ రంగ పరిశ్రమలను బలోపేతం చేయాలి. కాలుష్య కారక పరిశ్రమల స్థానే పర్యావరణహిత పరిశ్రమల స్థాపన చేపట్టాలి. మూతబడ్డ జూట్, సుగర్, ఇతర పరిశ్రమలను తెరిపించాలి. విద్య, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల కల్పన మెరుగుపరచాలి. ఏజన్సీలో జివో 3 పునరుద్ధరణ, భాషా వాలంటీర్ల కొనసాగింపు చేయాలి. పారిశ్రామిక ఉపాధిలో 75 శాతం స్థానిక యువతకు కచ్చితంగా కేటాయించే నిబంధనను పటిష్టంగా అమలు చేయాలి.
అయితే వీటిని పాలకులు తమంతట తాముగా చేయరని గత అనుభవాలు తెలుపుతున్నాయి. మాటల లోనే తప్ప వారి చేతలలో అభివృద్ధి నీడ కూడా కనపడదు. అందుకే, అసలైన అభివృద్ధికై ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా యువత, మేధావులు, మధ్యతరగతి ప్రజానీకం పూనుకోవలసిన సమయం ఆసన్నమైంది.
/ వ్యాసకర్త : ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి /
ఎ. అజ శర్మ