Jul 24,2022 08:25

ఓ పెరటి చెట్టు పసిపిల్లవాణ్ని పట్టుకుని, అమాంతంగా మింగేస్తుంది. 1980 దశకంలో విడుదలైన 'పోల్టర్జిస్ట్‌' అనే ఈ ఆంగ్ల సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. జెకె రౌలింగ్‌ రచించిన హరీ పోటర్‌ అండ్‌ థి ఫిలాస్ఫర్స్‌ స్టోన్‌ గ్రంథంలో ''డెవిల్స్‌ స్నేర్‌'' అని పిలువబడే ఒక కాన్‌స్ట్రిక్టర్‌ ప్లాంట్‌ను సమీప జీవుల్ని బంధించి, పీల్చి పిప్పిచేసి వదిలిపెడుతుంది. డబ్ల్యు జె బ్యూల్‌ అనే అనే శాస్త్రజ్ఞుడు 1887 సముద్రం, భూమి నుండి పరికిశోధనలు చేసి ఆఫ్రికా, మధ్య అమెరికా ప్రాంత అడవుల్లో కొన్ని చెట్లు మనుషుల్ని, పెద్ద జంతువుల్ని తినేస్తున్నట్లు చెప్పాడు. 'యటేవేవో'గా పేర్కొని, వాటి చిత్రాలు గీశాడు.
సర్రేసీనియా..
ఇది సర్రేసీనియేసీ కుటుంబానికి చెందినవి. ఈ జాతిలో పది వరకూ రకాలున్నాయి. ఇవి ఉత్తర అమెరికాలోని సముద్ర తీరాల్లో పెరుగుతాయి. వీటి పత్రాలు గరాటు ఆకారంలో ఉండి, లోపల ద్రవాలుంటాయి. ఈ ద్రవాలు వర్షపు నీటితో కలిసి గాఢతను కోల్పోకుండా గరాటు పైభాగంలో మూత వంటి నిర్మాణం ఉంటుంది. చక్కటి రంగుతో కమ్మటి వాసనలు గుప్పిస్తూ ఉంటాయి. గరాటు పై అంచుల్లో తేనెలాంటి స్రావాలు ఉంటాయి. ఇది కీటకాలను ఆకర్షిస్తూ ఉంటుంది. కీటకం గరాటుపై వాలి స్రావాలను పీల్చగానే అందులోని మత్తు దాన్ని ఎగిరిపోకుండా చేస్తుంది. కీటకం జారి గరాటు అడుగుభాగంలో పడి చనిపోతుంది. గరాటు ద్రవాల్లో ఉన్న ప్రొటియేజ్‌లు, ఇతర ఎంజైమ్‌లు ఆ కీటకాన్ని జీర్ణం చేస్తాయి.
నెపంథిస్‌..
నెపంథేసియే కుటుంబంలో 100కి పైగా రకాలు మొక్కలున్నాయి. ఇవి ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే మాంసాహార మొక్కలు. వీటిని సాధారణంగా మంకీ కప్స్‌ అంటారు. భారత్‌తోపాటు చైనా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, మడగాస్కర్‌, సీషెల్స్‌, ఆస్ట్రేలియా దేశాల్లోని చిత్తడినేలల్లో పెరిగే మొక్కలివి. వీటిలో కొన్ని మొక్కలు 10 నుంచి 15 మీటర్ల పొడవుండి తీగల్లా ఎగబాకుతాయి.
నెపంథిస్‌ కాండంపై కత్తుల ఆకారంలో పత్రాలు ఉంటాయి. పత్రాల చివర కూజాల్లాంటి నిర్మాణాలు, పైభాగంలో మూత ఉంటుంది. కూజా లోపల చిక్కని ద్రవం ఉండి, జీర్ణరసంలా పనిచేస్తుంది. కూజా లోపలికి వచ్చిన కీటకాలు ఆ ద్రవాల్లో పడగానే చనిపోతాయి. కీటకాలు జీర్ణమై, వాటిలోని పోషకాలు మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. నెపంథిస్‌ రఫ్లీషియానా, నెపంథిస్‌ రజా, నెపంథిస్‌ అటెన్‌బరోగి జాతులకు చెందిన మొక్కలు పెద్దవిగా ఉండి ఎలుకలు, బల్లులు మొదలైన పెద్ద ప్రాణులను కూడా తినేస్తాయి.
యుట్రిక్యులేరియా..

f


లెంటిబ్యులారియేసి కుటుంబానికి చెందిన వీటిలో వందల రకాలున్నాయి. మంచు ఖండం అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ పెరుగుతాయి. ఈ ప్రజాతిలోని 80 శాతం జాతులు తడి నేలల్లో, 20 శాతం మంచినీటి కుంటల్లో ఉంటాయి. ప్రధానంగా పుష్పాల కోసం సాగుచేస్తారు. వీటి పత్రాలు తిత్తుల్లా రూపాంతరం చెంది ఉంటాయి. లోపల సూక్ష్మక్రిములు, కీటకాలు ప్రవేశించగానే అది మూసుకుపోతుంది. అనంతరం తిత్తిలోపలి జీర్ణరసాల ప్రభావం వల్ల కీటకం జీర్ణమవుతుంది.
డ్రాసిరా..

f


డ్రాసిరేసి కుటుంబంలోనూ చాలారకాల మొక్కలున్నాయి. అంటార్కిటికా మినహా అన్నిచోట్లా కనిపిస్తాయి. సెంటీమీటర్‌ నుంచి మీటర్‌ వరకూ ఎత్తు పెరుగుతాయి. పత్రాల ఉపరితలం అంతటా సన్నని కేశాల వంటి నిర్మాణాలు నిటారుగా పెరుగుతాయి. వీటి నుంచి తియ్యని జిగురు స్రావాలు విడుదలవుతాయి. కీటకాలు కేశాలపై వాలగానే జిగురు అంటుకుంటుంది. వెంటనే చుట్టూ ఉన్న కేశాలు కీటకాన్ని చుట్టి ఊపిరి ఆడకుండా చేసి, చంపేస్తాయి.
సన్‌డ్యూస్‌ ..

f


ఈ మొక్కలు పత్రాలు మందంగా ఆల్చిప్పల్లా ఉండి, చివరల ముళ్లలాంటి కేశరాలుంటాయి. లోపల చిక్కటి ద్రవం సువాసనలతో కీటకాలను ఆకర్షిస్తాయి. కీటకం లొపలికి రాగానే రెండు పత్రాలూ మూసుకుపోతాయి. చివర ఉండే కేశరాలు పత్రాలను కట్టేసినట్లు లాక్‌ చేసేస్తాయి. ఆ కీటకం జీర్ణమైన తరువాతే పత్రాలు తెరుచుకుంటాయి. వీటిని ఇండోర్‌ మొక్కలుగా మలిచి, ఇళ్లలో సహజమైన పద్ధతుల్లో దోమలు, బల్లులు, బొద్దింకలు వంటి కీటకాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ మొక్కల మీద ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి.
 

- చిలుకూరు శ్రీనివాసరావు
8985945506