- కదలని పెండింగ్ ప్రాజెక్టులు
తాజాగా కేంద్రం ... ఎపి విభజన సమస్యలపై ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈనెల27న న్యూఢిల్లీలో తలపెట్టిన సమావేశం అజెండాలోనూ విశాఖ రైల్వే జోన్ ప్రస్తావనే లేదు. కొత్త రాజధాని నుండి ర్యాపిడ్ రైలు కనెక్టివిటీకి సంబంధించి మాత్రం చేర్చారు. అజెండాలో చేర్చడానికే ఎనిమిదేళ్లయితే .. అది కార్యరూపం దాల్చడానికి ఎన్ని దశాబ్ధాలు పడుతుందో !
రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వివిధ ప్రాంతాల్లో రైల్వే మార్గాలను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని కొనసాగిస్తోంది. ఎపి విభజన చట్టం సెక్షన్ 93 షెడ్యూల్(8) ప్రకారం రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎనిమిదేళ్లయినా పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అలాగే నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, కోటిపల్లి-నర్సాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ల నిర్మాణాలు కూడా దశాబ్ధాల తరబడి కొనసాగుతుండడంతో అంచనా వ్యయం భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా కేటాయింపులు లేకపోవడంతో నత్తనడకన నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నిధులివ్వకపోవడం వల్లే వీటిని పూర్తిచేయడంలో జాప్యం జరుగుతోందని కేంద్రం వాదిస్తోంది. కోవిడ్ అనీ చూడకుండా ప్రయాణికుల నుండి, చివరకు వలస కార్మికులను సైతం వదిలిపెట్టకుండా ముక్కుపిండి ఛార్జీలను వసూలు చేసింది.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేయమని ప్రజలు అడిగితే....ఏటా రూ.8200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రైల్వే డివిజన్‌ను ఎత్తివేస్తామని ప్రకటించింది. అదే సమయంలో జోన్ ఏర్పాటుకు విశాఖలో అన్ని వసతులూ ఉన్నా మీనమేషాలు లెక్కిస్తోంది. డివిజన్‌ను కొనసాగిస్తూ జోన్ ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష. రాజకీయ లబ్ధి కోసం బీహార్‌లో ఆఘమేఘాల మీద జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.... ఇక్కడ ఎనిమిదేళ్లయినా వినిపించుకోవట్లేదు.
పడకేసిన ప్రాజెక్టులు
కోస్తాలో వరదల తాకిడికి ప్రత్యామ్నాయంగా ఉంటుందనే ఉద్దేశంతో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏర్పాటు కోసం మూడు దశాబ్దాల క్రితమే ఆలోచన చేశారు. 308 కిలోమీటర్ల ఈ లైను నిర్మాణానికి రూ.2,450 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. ఇప్పటివరకు 46 కిలోమీటర్లు మాత్రమే ...గుంటూరు జిల్లా శావల్యాపురం వరకు నిర్మించారు. మిగిలిన 262 కిలోమీటర్లనూ మరో మూడు దశల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మూడు దశలు పూర్తయ్యేదెప్పుడో ! భద్రాచలం-కొవ్వూరు ప్రతిపాదన సర్వేలకు పరిమితమైంది. 2010-11 బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదు. మోడీ వచ్చాక ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కడప-బెంగళూరు మధ్య 257 కి.మీ మార్గాన్ని నిర్మించేందుకు 2006లోనే లైన్ మంజూరైంది. అయితే ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాలుగు దశల్లో భాగంగా మొదటి దశలో కడప-పెండ్లిమర్రి సుమారు 21 కి.మీ పనులు పూర్తయ్యాయి. ఇటీవల 13 కి.మీ.వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే రాష్ట్ర నిధుల కొరతతో ఈ మార్గాన్ని ముద్దనూరు మీదుగా అనంతపురం జిల్లా ముదిగుబ్బ వరకు నిర్మించి ...అక్కడ ప్రస్తుత లైన్‌లో కలిపే ప్రతిపాదనను ఓ లేఖ ద్వారా రైల్వే శాఖ దృష్టికి రాష్ట్ర సర్కారు తీసుకెళ్లింది. దీనిపై రైల్వే శాఖ నుండి స్పందన కానరాలేదు.
రాష్ట్రం పేరు చెప్పి...
2000లో అంకురార్పణ జరిగిన 51 కిలోమీటర్ల కోటిపల్లి-నర్సాపురం లైన్ నిర్మాణం కూడా నత్తనడకనే సాగుతోంది. అంచనా వ్యయం అప్పట్లో రూ300 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.2200 కోట్లకు పెరిగింది. అయితే అప్పటినుండి 2016 వరకు రైల్వే శాఖ వివిధ బడ్జెట్ల ద్వారా కేటాయించింది కేవలం రూ.70 కోట్లే. ఆ తరువాత కేటాయింపులు పెంచింది. అయితే 2008 నుండి 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. 2014 నుండి 2018 వరకూ రూ.126 కోట్లు కేటాయించింది. ఆ తరువాత రాష్ట్రం నుండి ఒక్కపైసా కేటాయింపుల్లేవు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించిన తరువాతే మిగిలిన నిధులను కేటాయిస్తానని రైల్వే శాఖ భీష్మించుకుని కూర్చోంది. ఇలా దాదాపు అన్ని ప్రాజెక్టులకూ రైల్వే శాఖ తొలి నుండీ నామమాత్రపు కేటాయింపులు చేస్తోంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టుల పూర్తిలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
షేక్ ఖాజావలి










