Feb 25,2023 12:23

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : సంక్షేమ హాస్టల్లో మెస్‌ ఛార్జీలు నెలకు రూ.2,500 పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపి నాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నందిగామ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో గోపి నాయిక్‌ మాట్లాడుతూ .... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల హాస్టల్‌ లో చదువుతున్న విద్యార్థులకు 3, 4 తరగతులకు 5 నుంచి 10 తరగతులకు 1150- 1400 రూ, ఇంటర్‌ ఆ పై చదువులకు విద్యార్థులకు 1600 రూపాయలు పెంచినట్టు ప్రభుత్వం మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచి ఐదు సంవత్సరాలు అవుతుందన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు ప్రతిరోజూ పెరిగాయన్నారు. కరోనా తర్వాత నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మెస్‌ చార్జీలను నామమాత్రంగా పెంచిందన్నారు. ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తనిఖీ చేయడంతోపాటు రోజుకి 37 రూపాయలతో 3 పూటలా పౌష్ఠికాహారం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. దానికితోడు ఇచ్చిన నూతన మెనుకి పెంచిన ఛార్జీలు ఏ మాత్రం సరిపోవన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ హాస్టల్లో పౌష్టికాహారం అందాలంటే నెలకి 2500 రూపాయలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని, గత రెండేళ్ల నుండి కాస్మోటిక్‌ చార్జీలు ఇవ్వడం లేదని వాటిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటం చేస్తామని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షుడు పార్టీ రవికుమార్‌,ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ నాయకులు వేల్పుల వంశీ,మార్కాపుడి రవి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.