- హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవూలురి దొరబాబు
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ (కాకినాడ) : రాష్ట్రంలో చిరు వ్యాపారులకు జగనన్న తోడు పధకం ద్వారా వత్తిడి లేని రుణాలు అందిస్తున్నట్టు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దాపురం వైసీపీ ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని 400 మంది చిరు వ్యాపారులకు రూ. 40 లక్షలు రుణాలను అందించే కార్యక్రమాన్ని స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హౌసింగ్ చైర్మన్ దొరబాబు విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చిన్న రుణం పొందాలన్నా బ్యాంకుల చుట్టూ, మధ్యవర్తుల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. దానికోసం పొందే రుణంలో సగం ఖర్చులకు సరిపోయేదన్నారు. బ్యాంక్ రుణాలు అందకపోతే వారపు పద్దు వడ్డీ వ్యాపారులు ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు. దానితో ప్రతివారం ప్రజలకు తీవ్రమైన వత్తిడి తప్పేది కాదన్నారు. అలాగాక ప్రస్తుతం సీఎం జహన్ మోహన్ రెడ్డి చిన్న వ్యాపారుల ఇబ్బందులను గమనించి నేరుగా బ్యాంకులతో మాట్లాడి వారి అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. దానితో వ్యాపారులకు ఎలాంటి వత్తిడి లేకుండా చూస్తున్నారన్నారు. అయితే తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్బ్యాకుల వద్ద నమ్మకాన్ని సంపాదించు కుంటే భవిష్యత్ లో మరింత ఎక్కువ మొత్తం రుణాలు. పొందే అవకాశం ఉన్నందున ఈ రుణాలను వ్యాపారులు సద్వినియోగ పరచు కోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులకు రుణాల చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్లు ఊబా జాన్ మోసెస్, గోకిన సునేత్రా దేవి, వైసిపి కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ, పాగా సురేష్ కుమార్ , స్వయంభారపు వీరభద్రరావు, సేపెని సురేష్, మున్సిపల్ కమిషనర్ జె రామారావు, , మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సుజాత, సిబ్బంది, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.










