
వేరే రాష్ట్రం ప్రకటన ఈయన ఒకసారి, రెండు సార్లు కాదు. అనేక సార్లు... ఇదే ప్రకటన చేస్తూ వస్తున్నారు. వారి అధిష్టానం నుండి దీనిపై ఎలాంటి స్పందన ఇప్పటివరకూ లేదు. అధిష్టానం సమ్మతితోనే ఈయన ఈ ప్రకటనలు చేస్తున్నారా? లేక వారే ఈయనతో చేయిస్తున్నారా? అలాంటిదే అయితే, రాష్ట్రంలో మరో వేర్పాటువాదాన్ని అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని భావించవలసి వస్తుంది.
రాష్ట్ర రాజధాని విశాఖకు రాకపోతే, విశాఖ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఉత్తరాంధ్ర ప్రజలు ఏర్పాటు చేసుకుంటారని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇటీవల ఆయన ఇదే మాటను పదేపదే ప్రకటిస్తున్నారు.
తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఒక రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో-శ్రీకాకుళం చుట్టూ సముద్రం ఉంది. కానీ, ఇక్కడ ఫిషింగ్ హార్బరు లేదు. జెట్టీ లేదు. ప్రాజెక్టులు పూర్తి కాలేదు. గ్రామాల్లో తాగు నీరు లేదు. మేమెలా ఉండాలి?-అని ప్రశ్నించారు. అయితే, అవన్నీ ఎందుకు లేవో, ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు బాధ్యత వహించాలి? అధికారంలో ఉన్నవారే కదా! అంటే వీరి ప్రభుత్వమే, అందులో మంత్రిగా ఉన్న వీరే సమాధానం చెప్పాలి. అందులోనూ ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యే అవడమే కాక, ఐదు సార్లు మంత్రిగా కూడా చేశారు. తన పదవీ కాలంలో ఉత్తరాంధ్రకు కాకపోయినా, కనీసం వీరి జిల్లాకైనా ఏమైనా మంచి చేశారా? సమాధానం చెప్పవలసిన వారే ప్రశ్నించడం వింతగానే ఉంటుంది.
వేరే రాష్ట్రం ప్రకటన ఈయన ఒకసారి, రెండు సార్లు కాదు. అనేక సార్లు... ఇదే ప్రకటన చేస్తూ వస్తున్నారు. వారి అధిష్టానం నుండి దీనిపై ఎలాంటి స్పందన ఇప్పటివరకూ లేదు. అధిష్టానం సమ్మతితోనే ఈయన ఈ ప్రకటనలు చేస్తున్నారా? లేక వారే ఈయనతో చేయిస్తున్నారా? అలాంటిదే అయితే, రాష్ట్రంలో మరో వేర్పాటువాదాన్ని అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని భావించవలసి వస్తుంది.
శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 193 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతముంది. అపార మత్స్య సంపద ఉత్పత్తి అయ్యే భావనపాడు వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించమని ఎప్పటి నుండో అక్కడి మత్స్యకారుల డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లు దాటినా ప్రభుత్వం ఎందుకు దీనిని పూర్తి చేయలేదు? ఎవరు అడ్డుపడ్డారు? రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి ఇదే జిల్లాకు చెందిన వారైనా ఎందుకీ స్థితి నెలకొంది? వీరికి ఆ ప్రాంతంలో కార్పొరేట్ కంపెనీ నిర్మించబోయే పోర్టు మీద, ఆ పేరున బలవంతపు భూ సేకరణ మీద ఉన్న శ్రద్ధ ... ఇక్కడి మత్స్యకారులపై లేకపోవడం తప్ప మరొకటి కాదు.
ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి, తాగు నీటికి కటకటలాడడానికి కారణమెవరు? ఎవరిని నిందించాలి? ఉత్తరాంధ్రలో అతి పెద్ద నది అయిన వంశధారపై రెండో దశ నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు? ఈ మూడేళ్లలోనైనా చేసిందేమైనా ఉందా? నిర్వాసితులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం ఎందుకు ఇవ్వలేదు? మహేంద్ర తనయ నదిపై నిర్మించే ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు ఎందుకు అతీగతీ లేకుండా ఉంది ?
ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు కానీ, చేసిన అన్యాయమే ఎక్కువ. సముద్ర తీరాన్ని మొత్తం కాలుష్య కారక పరిశ్రమలతో కలుషితం చేసేస్తున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగడానికి కూడా నీరు లేక కొన్ని గ్రామాల్లో ప్రజలు తమను తరలించాలని వేడుకుంటున్నారు. స్వంత గ్రామాల నుండే బయటకు పోవాలని కోరుకునేంత తీవ్రంగా కాలుష్యం వెదజల్లబడుతోంది. ఇది చాలదన్నట్లు దేశమంతా తిరస్కరించిన, ప్రమాదకరమైన కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటును ఉత్తరాంధ్ర నెత్తిన రుద్దుతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై అంత ప్రేమున్న వారు ఈ కాలుష్యం నుండి ఉత్తరాంధ్రను, తన స్వంత జిల్లాను కాపాడవచ్చు కదా! ఎవరు కాదన్నారు ?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయకుండా తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ఎగనామం పెట్టింది. హక్కుగా రావలసిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వలేదు. పదేళ్లయినా ఇంకా విద్యా సంస్థల నిర్మాణం పూర్తి చేయలేదు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణమే ప్రారంభం కాలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వలేదు. సరికదా ఉన్న రైల్వే డివిజన్‌నే ఎత్తేయాలని నిర్ణయించింది. విశాఖ మెట్రో రైలు మాటే మరిచింది. వీటిపై ఎప్పుడైనా వైసిపి ప్రభుత్వం కేంద్రాన్ని నిలేసింది లేదు. తెలుగు ప్రజలు ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని నిర్ణయిస్తే, దాన్ని వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గట్టిగా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు? దీనికి మించి ధర్మాన నిస్సిగ్గుగా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించడం ఆ ద్రోహంలో భాగం పంచుకోవడం కాదా? మంత్రి గారి మాటలు వింటుంటే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం అసలు తీర్మానమే కాదేమోనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం అమ్మకాలు జరుపుతున్నారని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. 'విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో అనేక త్యాగాల ఫలితంగా వచ్చినదాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్ముతూ ఉంటే ఈ మంత్రిగారు సమర్థిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతటి ద్రోహం చేస్తున్నారో విజ్ఞులైన ప్రజలే అర్థం చేసుకోవాలి.
ఉత్తరాంధ్ర ప్రజలు సహజంగానే సౌమ్యులు. అయితే తేడా వస్తే మాత్రం అవకాశం వచ్చినప్పుడు తాట తీస్తారు. నేడు ఉత్తరాంధ్ర ప్రజలు గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా దీన్ని కాపాడుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుకుంటున్నారు. పెండింగు నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని కోరుకుంటున్నారు. పర్యావరణం పరిరక్షించబడాలని కోరుకుంటున్నారు. అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ నిస్సందేహంగా ప్రత్యేక రాష్ట్రాన్ని మాత్రం కోరుకోవడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు విబేధాలను కాదు, ఐక్యతను కోరుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేతనైతే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పరిపాలించాలి. అంతే కానీ, ప్రాంతాలు, ప్రజల మధ్య రాజధాని పేరుతో చిచ్చు మాత్రం పెట్టకూడదు. ప్రత్యేక రాష్ట్రం డిమాండు లేవనెత్తడం చిన్న విషయమేమీ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి, ప్రత్యేక రాష్ట్రంపై తమ వైఖరిని స్పష్టం చేయాలి.
(వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
కె. లోకనాథం