
మతం లేకపోతే కులం ప్రశ్న లేదు. కులం లేకపోతే కులాధిపత్యం లేదు. కులాధిపత్యం లేకపోతే ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు మరుగున పడి...దేశ గణతంత్ర సామ్యవాదానికి పునాదులు బలపడతాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, గుజరాత్‌లో ఈ ''నో కేస్ట్-నో రెలిజియన్'' ఉద్యమం గత 6-7 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆ ప్రకారం పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు పొంది, భారతీయ మతాధిపత్య సమాజానికి ఛాలెంజ్ విసిరారు.
'నో రెలిజియన్' అంటే మతం లేదని కాదు. మతాలు లేవని ఎలా వాదించగలం? 'నో రెలిజియన్' అంటే ఏ మతాన్నీ ఆశ్రయించని వారని అర్ధం.
''నో రెలిజియన్'' అనే పదానికి తెలుగులో నాస్తికత్వం, దైవ భక్తి లేమి, అనాచారము, మత దూషణగా అర్ధం చెపుతూ వక్రీకరించడం భావ్యం కాదు.
మన భారతీయ మతాల్లో ఏమున్నాయి అని ఆలోచిస్తే మత గ్రంథాలు, దేవుడు, కర్మ-కాండలు, స్వర్గం, నరకం, మూఢ నమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటితో కుల వ్వవస్ధ ఉన్నది. ఆయా మతాల్లో ఉన్న అనేక కులాల్లో వివక్ష పెంచే విధంగా రకరకాల నిబంధనలు ఉన్నాయి. అశాస్త్రీయమైన వాటినీ, నిర్హేతుకమైన వాటిని అంగీకరించని కోట్లాది మంది ప్రజలు ఆచరించే జీవన విధానమే ''నో రెలిజియన్''. అన్ని మతాలలో కాస్తో కూస్తో మంచి ఉన్నది. కనుక అన్ని మతాలలో ఉన్న మంచిని క్రోడీకరించుకుని పెంచుకుంటూ, పంచుకుంటూ పోవడమే ఈ ''నో రెలిజియన్'' జీవనవిధానం. కొందరు దీనిని నాస్తికత్వంగా చూస్తున్నారు. నాస్తికత్వం అంటే దేవుని ఉనికిని నమ్మక పోవడం అని అర్ధం. ఆస్తికులు అంటే దేవుణ్ణి విశ్వసించేవారు. కానీ అన్ని మతాలలోనూ నాస్తికులు, ఆస్తికులు అనే ఈ రెండు వర్గాలూ కనబడతాయి. దేవుణ్ణి నమ్మే వారు నమ్మనివారూ కూడా కొన్ని మత సంప్రదాయ కట్టుబాట్లకు బద్ధులై ఉండడం మనం చూస్తాం. మనం ఉదాహరణకు నిత్య జీవితంలో ఎందరినో నాస్తికులైన హిందువులను చూస్తాం.
మరొక నూతన భావజాలం కూడా ఉంది. అదే ''లౌకిక మానవవాదం''. గతంలో చెప్పుకున్నట్లు అన్ని మతాలనూ ఆదరిస్తూ అన్ని మతాలలో ఉన్న మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం దీని ప్రత్యేకత. అలా అయితే ఏ మతానికీ ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే కాదు, అస్సలు మతమనే ఆలోచననే విస్మరించడం ఈ ''నో రెలిజియన్'' గొప్పతనం.
'నో రెలిజియన్' అనే పదం 15-16 శతాబ్దాల మధ్య ''ఇర్రెలిజియన్'' అనే ఆంగ్ల పదం (మతము అనవసరం / లేదు ) నుండి వచ్చింది. 1993 జరిగిన పౌర మరియు రాజకీయ హక్కుల అంతర్జాతీయ సదస్సులో యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కమిషన్ చేసిన తీర్మానంలోని 18వ నిబంధన ప్రకారం ''ఆస్తిక వాదుల, నాస్తికుల నమ్మకాలు, మనోభావాలతో పాటు అలాగే ఎటువంటి మతాన్నీ ఆచరించనివారి భావాలను (నో రెలిజియన్) కూడా గౌరవించాలని తీర్మానించింది. మత స్వేచ్ఛలో (ఫ్రీడమ్ అఫ్ రెలిజియన్) ఇదొక ప్రత్యేక అంశంగా పరిగణించవచ్చు. అంతే కాదు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛతో (ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ) కూడిన అంశం కూడా. ఫలానా మతాన్ని నమ్మనని లేదా నమ్మవద్దని చెప్పే హక్కు ఏ ప్రజాస్వామ్య దేశానికి ఉండకూడదు. ప్రస్తుతం వార్తలలో ఆకర్షిస్తున్న ప్రముఖమైన వార్త ''ప్రపంచంలో అతి పెద్ద కొత్త మతం-మతం లేని తనం'' (నో రెలిజియన్). మతాలన్నీ రాజకీయాలూ వ్యాపారాల చుట్టూ తిరుగుతూ మానవ సంబంధాలను కుంటుపరుస్తున్న తరుణంలో ఇదొక ఆటవిడుపుగా అనిపిస్తుంది. నిజానికి ఇది ఇప్పుడు మొదలైనది కాదు. ఈ వాదన 2015 ప్రాంతంలోనే క్రైస్తవ సమాజంలో యు.కె లో ఆరంభమైంది. అక్కడ పిల్లలు బైబిల్ లోని ''జెనిసిస్'' థియరీని అంతకు ముందు ఎప్పుడో ప్రశ్నించడం మొదలుపెట్టారు. మన దేశంలో పిల్లలకు అటువంటి ప్రశ్నలు ఉత్పన్నం రానీయకుండా, వారిలో సైంటిఫిక్ టెంపరిమెంట్ అనే స్పృహను రానీయకుండా మత సంస్థలూ రాజకీయ పార్టీలూ విద్యా విధానాలూ తమ శాయశక్తులా పనిచేస్తున్నాయి. యూరోప్, ఉత్తర-దక్షిణ అమెరికా, యుకే లలో ఇలా ఏ మతాన్నీ ఆచరించని వారిని 'నన్స్' (అశీఅవర) ఏదీ కానీ వారు లేదా ఏ మతానికీ చెందని వారు అంటారు.
అమెరికాలో ఇప్పటికే ఈ ''నన్స్'' జనాభా నాలుగవ వంతుగా ఉంది. రెండవ అతి పెద్ద మతంగా ఈ వర్గం పరిగణించబడుతూ సంఖ్యలో కేథలిక్కులను, ప్రొటెస్టంట్లను మించిపోయారు. వీరు ఇప్పుడు ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా తయారయ్యారు. వారి చావు, పుట్టుక, పిల్లల చదువుల వ్యవహారం, జనాభా పరిగణన...సంబంధిత విషయాలపై తర్జనభర్జనలు పడుతున్నాయి ప్రభుత్వాలు. ఈ కార్యకలాపాలను నిర్వహించుకునేటప్పుడు ఏ మత పెద్దను, మూఢవిశ్వాసాన్ని దరిచేరనీయకుండా ఒక ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక హేతుబద్దమైన వ్వవహారాలను నిర్వహించుకుంటూ ప్రపంచ వినూత్న ప్రత్యామ్నాయ సంస్కృతికి పునాది వేయబోతున్నారు. నేడు గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సంప్రదాయ వివాహ వ్యవస్థ నిర్వీర్యం అవడం చూస్తున్నాం. త్వరలో ఫ్రాన్స్ ''నో రెలిజియన్ల'' అతి పెద్ద దేశంగా అవతరించబోతుంది. ఆ వెనుక నెదర్లాండ్, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. ఈ 'నన్స్'తో ఆస్ట్రేలియా తన క్రైస్తవ మతాధిపత్య ప్రాపకాన్ని కూడా త్వరలో కోల్పోబోతుంది. క్రమేణా ప్రపంచంలో మతం ప్రమేయం కుంచించుకుపోతున్నది. ఈ దేశాలతో సహారా ఆఫ్రికా దేశాలు పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. అన్ని దేశాలూ వైజ్ఞానికంగా పురోగమిస్తున్న తరుణంలో దేవుని ఉనికి ప్రశ్నించబడడం, మతం తన ప్రాభవాన్ని కోల్పోవడం సహజమే.
మతాన్ని నమ్ముకుని ఉండడం వలన కలిగే నష్టాన్ని వారు అంచనా వేస్తున్నారు. సరైన విద్య, వైద్యానికి దూరం అవడం, బలవంతపు పేదరికం లాంటి వాటికి మతమే కారణంగా భావిస్తున్నారు. మతాన్ని వీడితేనే తమకు పురోగతి ఉంటుందని, విముక్తి కలుగుతుందని నమ్ముతున్నారు. ఇదొక మత పరమైన వైరుధ్యం. ఒక మత శాఖ అదే మతానికి చెందిన మరొక శాఖను అణిచివేయడాన్ని ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. షియా సున్నీల మధ్య, కేధలిక్కులు, ప్రొటెస్టంట్ల మధ్య ఆధిపత్య పోరాటాల్లో ఒకరి హక్కులు మరొకరు హరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఒకటి ఉన్నత వర్గంగా మరొకటి అణచివేతకు గురౌతున్న వర్గంగా తయారవుతున్నాయి. వర్ణ వివక్ష మరొక కారణం. ఈ జాఢ్యం నుండి బయటపడాలని అటువైపు అభ్యుదయవాదులు, ఇటువైపు పీడితులు ఇరు వర్గాలవారూ పోటీ పడి తమ మతాలను వీడి ''నో రెలిజియన్''లో నమోదు అవుతున్నారు. తద్వారా తమకు మత విముక్తితో పాటు...ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, విద్య వైద్యం అందబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో కోట్లాది మంది హిందూ మతాన్ని వీడి క్రైస్తవం లోకి, ఇస్లాం లోకి మతాలను మార్చుకోవడం చూశాము. ఈ మత మార్పిడి అగ్ర కులాల పీడన నుండి ఉపశమనంగా భావించారు. బహుశా ఇప్పుడు కూడా అటువంటి మార్పు వైపు ప్రజలు నడుస్తున్నారేమో అనిపిస్తుంది.
ఇటీవల 'పిఇడబ్ల్యు' అనే పరిశోధనా సంస్ధ ప్రపంచ వ్యాపితంగా చేసిన ఒక సర్వేలో మతాచారాలను నమ్ముతున్న, ఆచరిస్తున్న వారిలో స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. అయితే విద్యావంతులైన, ఉద్యోగస్తులైన కార్మిక శక్తిగా అవతరిస్తున్న స్త్రీల ఆలోచనలు మారడం పురుషాధిక్యతను ప్రశ్నించడం నేడు మనం గమనిస్తున్నాం.
ఇక మన దేశానికి ఈ ''నో రెలిజియన్'' భావజాలాన్ని అన్వయించుకుని చూస్తే ఎలా ఉంటుంది? అనేది ఆసక్తి కరమైన చర్చ అవుతుంది. ఈర్ష్యాద్వేషాలు, కులమత భేదాలూ, భాషావేశాలూ చెలరేగాయి నేడు. మైత్రి, కరుణ, సమానత, సమన్యాయం అవసరమైన నేడు సామాన్యుడికివి మరింత దూరం జరిగిపోవడం చూస్తున్నాం. మతం లేకపోతే కులం ప్రశ్న లేదు. కులం లేకపోతే కులాధిపత్యం లేదు. కులాధిపత్యం లేకపోతే ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు మరుగున పడి దేశ గణతంత్ర సామ్యవాదానికి పునాదులు బలపడతాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, గుజరాత్‌లో ఈ ''నో కేస్ట్-నో రెలిజియన్'' ఉద్యమం గత 6-7 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆ ప్రకారం పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు పొంది, భారతీయ మతాధిపత్య సమాజానికి ఛాలెంజ్ విసిరారు. ఈ పరిణామం మత విముక్తి పోరాటంగా మారుతుందేమో వేచి చూడాలి.
- డా|| మాటూరి శ్రీనివాస్