Apr 14,2023 07:40

         రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అణగారిన తరగతుల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి ఈ నెలలోనే కావడంతో, ఆ సందర్భంగా ఇది చర్చనీయాంశంగా ఉంది. ఈ తరగతులవారిపై దాడులు పెరుగుతుండడం ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గద్దెనెక్కాక ఒక పథకం ప్రకారమే ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, అణగారిన తరగతులవారికి రక్షణ లేకుండా చేయడం వంటివి జరుగుతున్నాయి. అగ్రకుల దురహంకారం పెరిగిపోయింది. మతమార్పిడుల పేరుతో మైనార్టీలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. మనువాద సిద్ధాంతాలు అమలు చేస్తూ గిరిజనులు, మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలిస్తే ఎవరికైనా ఆందోళన కలగకమానదు. అధికార పార్టీ నాయకులే కొన్ని చోట్ల దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడడం, ఇంకొన్ని ఘటనలపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అణగారిన తరగతులవారి మీద జరుగుతున్న దాడులపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, వారి సిఫార్సులకు అనుగుణంగా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ నానాటికీ బలపడుతోంది.
         సామాన్యులకు, నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఊరటనిస్తాయన్న మాట నిజం. అయితే వాటిని అమలు చేయడం మాత్రమేగాక అణగారిన ప్రజలకు తగిన రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రస్తుతం మోడీ రాజ్యాన్ని యథాతథంగా అమలు చేస్తున్నారన్న విమర్శ సత్యదూరం కాదు. అల్లూరి జిల్లా వాకపల్లి గిరిజన మహిళలపై గ్రేహండ్‌ పోలీసుల సామూహిక అత్యాచారం కేసులో తీర్పు అనంతరం ముఖ్యమంత్రి స్పందన లేదు. దళితుడైన కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన అధికార పార్టీ ఎంఎల్‌సి అనంతబాబుపై తీవ్ర చర్యలు లేవు సరికదా బెయిలుపై జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఘనంగా స్వాగతం పలకడం ఎటువంటి సంకేతాలిస్తుంది? నెల్లూరు జిల్లా దగదర్తి, కాకినాడ జిల్లా తొండంగిలో దళితులపై జరిగిన దాడుల్లో ప్రభుత్వం పెత్తందార్ల కొమ్ముకాసిందన్నది జగమెరిగిన సత్యం. కడపలో జిల్లా స్థాయి పశువైద్య అధికారి డాక్టర్‌ అచ్చెన్నను హత్య చేసిన నిందితులను కాపాడుతోందన్నది జనవాక్యం. విశాఖపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌, పాణ్యంలో ముస్లిం కుటుంబ సభ్యుల ఆత్మహత్యలు... ఇలా ఎన్నో! ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులు జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో 23 శాతం ఖర్చు చేయాల్సి ఉండగా, 12 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అందులోనూ నిధుల మళ్లింపు షరా మామూలే! కులాలవారీగా బిసి కార్పొరేషన్‌ చైర్మను పదవులు ఇచ్చినా నిధుల మాటేమోకానీ వారికి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా లేని దుస్థితి.
           నగదు బదిలీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా అని ప్రభుత్వం సామాజిక భద్రత బాధ్యతను విస్మరిస్తే కుదరదు. ప్రభుత్వం ఒకవైపు నవరత్నాల జపం చేస్తూ మరోవైపున గత కొన్ని దశాబ్దాలుగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వికలాంగులు పొందుతూ వస్తున్న అనేక రాయితీలను అటకెక్కించింది. ఆ బాధ ఈ తరగతులవారిలో నివురుగప్పిన నిప్పులా ఉంది. పరిస్థితిని చక్కదిద్దడానికి, అణగారిన తరగతుల వారికి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలి. ఆయా తరగతుల ప్రజానీకానికి భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కాని మోడీ సర్కారు ఆదేశించిన నయా ఉదారవాద ఆర్థిక విధానాల్ని, నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్న వైసిపి ప్రభుత్వం సామాజిక రంగంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందా అన్న సందేహం ఎవరికైనా కలగడం సహజం. కాబట్టి అణగారిన తరగతులవారికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టేలా ఈ సర్కారుపై ప్రజా ఒత్తిడి పెరగాలి. అందుకు ఐక్య ఆందోళనా పోరాటాల్ని మరింత పెంచాలి. ఇందుకు ఆయా తరగతుల ప్రజానీకం, ప్రగతికాముకులూ నడుం బిగించాలి.