Mar 25,2023 07:26

         దేశాన్ని కుల, మత జాఢ్యాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవున్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయులంతా స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనేవున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరోమారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్‌ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది.
        శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతులవారు పాల్గొనడం ఆనవాయితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవాయితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం. శృంగవృక్షం జాతరలోనూ అదే జరిగింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు.. దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. 'మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?' అంటూ కుగ్రామమైన శృంగవృక్షంపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరానికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొండంగి గ్రామానికి చెందిన నడింపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్రమించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సినవాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచిదంటూ దళితులకు మైండ్‌వాష్‌ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతికరం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) వంటి ప్రజాసంఘాలు నిలదీయకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో !
       విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని, దళితులకు, అణగారిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు. 'దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?' అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావాజాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు శిరోముండనాలు చేయించడం, అత్యాచారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసుకోవడం దేనికి సంకేతం. దాడులు జరిగినప్పుడు ఒంటికాలిపై లేవడం.. అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఇలాంటి దాడులకు పాల్పడినవారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలి. శృంగవృక్షంలో ప్రాణాలు కోల్పోయిన రవి కుటుంబానికి ప్రజా సంఘాలు కోరుతున్నట్లుగా ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల పరిహారం, ఐదు ఎకరాల సాగుభూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. అంతేకాదు, దాడికి కారకులైనవారిని కఠినాతికఠినంగా శిక్షించాలి. కేంద్రంలో మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రాకుండా చూడాలంటే దళితులు, గిరిజనుల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దాడి జరిగిన తరువాత లేపనం పూయడం కాదు..ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. అణగారిన తరగతులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అనువైన వాతావరణం కల్పించాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. ఇందుకు విశాల ప్రజా ఉద్యమాలే మార్గం.