
విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తున్నామని వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేలా సంస్కరణలు చేపడుతున్నది. 'నాడు-నేడు'తో పాఠశా లలను అందంగా తీర్చిదిద్దడం మంచిదే. కాని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన తరువాత అన్ని రూ. కోట్లు ఖర్చు పెట్టి ఏం ఉపయోగం? విశాలంగా ఉన్న ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలు లేరు. ఉన్నత పాఠశాలల్లో పిల్లలు నేలపై కూర్చుని చదువుతున్నారు. పోనీ ఈ విలీనం వలన మంచి ఫలితాలు వచ్చాయా అంటే అదీ లేదు. 2021-22 విద్యా సంవత్సరంలో 44,29,356 మంది చదివితే 2022-23 విద్యా సంవత్సరంలో 40,31,239 మంది చదువుతున్నారు. అంటే 3,98,117 మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. చాలా మంది చదువుకు దూరమయ్యారు. భవిష్యత్తులో 3 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలలు కూడా విలీనం అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆన్‌లైన్ లోనే ఉన్నాయంటూ బైజూస్‌లో క్లాసులు నేర్చుకోమంటున్నది. వాట్సప్‌లో పరిక్ష పేపర్లు రిలీజ్ చేస్తుంది. చివరకి అటెండెన్స్ కూడా అన్‌లైన్ లోనే వెయ్యాలంటుంది. బైజూస్ క్లాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.688 కోట్లు ఖర్చుపెట్టి 4,59,564 మంది విద్యార్ధులకు 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబులు అందించామంటుంది. మరోపక్క రూ.25,000 కంటే తక్కువ ఆదాయ వనరులు ఉన్న వారికి ట్యూషన్లు చెప్పమని ఎడ్ టెక్ సంస్థ చెప్తుంది. తమ కోర్సులను కొనాలని లేకుంటే మీ పిల్లల భవిష్యత్తు నష్టపోతారని బైజూస్ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించా లంటున్న ప్రభుత్వం ఆన్‌లైన్ సదుపాయం లేని వారికి ఆఫ్‌లైన్‌లో కూడా మెటీరియల్ అందుబాటులో ఉంటుంద ని నమ్మబలుకుతున్నది. ఆఫ్‌లైన్‌లో మెటీరియల్ ఉన్నప్పుడు అది ఆన్‌లైన్ విద్య ఎలా అవుతుంది? ఆన్‌లైన్ చదువుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష పేపర్లను ప్రింట్ చేసి విద్యార్ధులకు ఇవ్వకుండా అందులోనూ మిగుల్చుకోవాలనుకుంటున్నది. వాట్సప్‌లో ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు పంపిస్తుంది. ఆ ప్రశ్నా పత్రం రాయడానికే విద్యార్థికి గంట పడుతున్నప్పుడు ఇంక సమాధానాలెప్పుడు రాస్తాడు? ఇది కేవలం విద్యను ప్రైవేటీకరిస్తూ బైజూస్, సామ్‌సంగ్ వంటి కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టడం కోసమే తప్ప మరొకటి కాదు.
ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తయారు చేస్తామంటే ఏంటో అనుకున్నాం. కానీ అది ఫీజుల విషయంలోనని ఇప్పుడు అర్ధమవుతోంది. ఇంటర్మీడియట్ పరిక్ష ఫీజుల వివరాలు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. పరిక్ష ఫీజు రూ. 510. కానీ 18 రోజుల వ్యవధి లోనే అపరాధ రుసుమును రూ.120 నుండి రూ.5,000 వరకు విధించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఫీజులు గతంలో రూ. 2500 ఉంటే ఈ విద్యాసంవత్సరం రూ.8090 నుండి రూ.9980 వరకు పెంచింది. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రులపై ఫీజుల భారం పెద్ద గుదిబండగా మారింది. అయినా రూ.9980 కట్టుకునే స్తోమత ఉన్న వాళ్లు ఇంకో రూ.2000 అప్పు చేసి అన్ని సదుపాయాలు, అధ్యాపకులు ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో చేరతారు కానీ ఏ సదుపాయాలు, అధ్యాపకులు లేని ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎందుకు చేరుతారనే సందేహం కలుగుతుంది. అదే వాస్తవం. ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. అందుకే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్ధులు చేరలేదనే నెపంతో 254 కోర్సులను మూసివేసింది. కొత్తగా ఎఫ్.ఆర్.ఎస్ తీసుకువచ్చింది. విద్యా దీవెన, వసతి దీవెనలో కోత విధిస్తున్నది. ఎఫ్.ఆర్.ఎస్ తీసుకురావడంతో కాలేజీలకు విద్యార్ధులు వస్తున్నారు. కానీ అధ్యాపకులు లేకపోవడం వలన కనీసం వారికి పాఠ్యాంశాల పేర్లు కూడా తెలియడం లేదు. ఏంటి ఉపయోగం? ఈ రకంగా మొత్తం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధంగా సంస్కరణలు చేస్తున్నది. నూతన విద్యా విధానాన్ని, ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడదాం. భవిష్యత్తు తరాలకు ఉచిత విద్యను అందిద్దాం.
- డి.రాము,
ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి.