ప్రజాశక్తి : చీరాల (బాపట్ల) : కూరగాయల మార్కెట్ వద్ద ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలోని దుకాణ నిర్వాహకులు సోమవారం నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని దుకాణం ఎదుట కొనసాగించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... ఆ ప్రాంతం లో కూరగాయల మార్కెట్, పచారి దుకాణాలు అధికంగా ఉండటంతో మహిళలతో నిత్యం రద్దీగా ఉన్న ప్రదేశంలో మద్యం షాప్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే మద్యం షాప్ ఏర్పాటు పనులను నిలుపుదల చేయాలని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా షాపు నిర్మాణం చేపడితే ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. అనంతరం చీరాల మున్సిపల్ కార్యాలయం లో ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం కు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు, కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ఎం.బాబురావు, పి.కొండయ్య, ఎల్.జయరాజు, ప్రజా వేదిక నాయకులు గుమ్మడి ఏసురత్నం, ఆ ప్రాంత వ్యాపారులు పచ్చి పులుసు వెంకటస్వామి, అమర ఆంజనేయులు, పెనుగొండ కిషోర్, పులిమీ ఆదిశంకరరావు, గుంటూరు నారాయణ, చేబ్రోలు సురేష్, పలువురు పాల్గొన్నారు.










