Aug 28,2022 08:56

జనాభాపరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌ ప్రపంచ క్రీడా చరిత్రపటంలో ఎక్కడ వుందో కాగడా వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి ఎందుకొచ్చింది? క్రీడల పట్ల పాలకుల నిర్లక్ష్యమే కారణం. 130 కోట్ల మంది జనాభా వున్న దేశంలో క్రీడలకు మొన్న బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులే ఇందుకు నిదర్శనం. 2022-23 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.3062.60 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ ఏడాదిలో అధికసంఖ్యలో అంతర్జాతీయ క్రీడలకు భారత్‌ ఆతిథ్యం, జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా.. తదితరాలకు కలిపి ఈ నిధులు ఏ మూలకు? క్రీడల అభివృద్ధి గురించి మాటలు కోటలు దాటుతున్నా.. ఆచరణ గడప దాటడం లేదు. మన పక్కనున్న చైనా అంతర్జాతీయ క్రీడల్లో అగ్రదేశాలకు వణుకు పుట్టిస్తుంటే.. గత ఒలింపిక్స్‌లో మనకు దక్కింది (ఒక స్వర్ణ, రెండు రజత, నాలుగు కాంస్యాలు) ఏడు పతకాలే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఒక్క అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి.. అన్న చందంగా వుంది. ఈ అంశాలనే అవలోకనం చేస్తూ.. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా  ప్రత్యేక కథనం..
క్రీడల పరంగా భారత్‌ ప్రగతి చూస్తే ఎక్కడవేసిన గొంగళి అక్కడే అని చెప్పక తప్పదు. మన పొరుగుదేశం చైనాతో పోల్చి చూస్తే ఒలింపిక్స్‌లో భారత్‌ పరిస్థితి తీసికట్టే. జనాభాలో ప్రపంచంలోనే చైనా అతిపెద్ద దేశం. దేశ జనాభాకు తగ్గట్టుగానే క్రీడారంగంలో చైనా కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అమెరికాలాంటి సూపర్‌ పవర్‌కే సవాలు విసిరే పరిస్థితికి ఎదిగింది. అదే జనాభా పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌ ఒలింపిక్స్‌ పతకాల పట్టిక 48వ స్థానంలో ఉందంటే.. మన పరిస్థితి ఎంత దయనీయమో చెప్పాల్సిన పనిలేదు.

foot ball


ప్రోత్సాహ లేమి..
ఇతరదేశాల్లో పిల్లలకు బాల్య దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తిని గుర్తిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వారికి తర్ఫీదును ఇస్తారు. మనకు ఇక్కడ ఆ పరిస్థితి వుందా? ప్రపంచ క్రీడల్లో సోషలిస్టు దేశాలు బాలల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిద తర్ఫీదును ఇస్తున్నాయి. 125 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఇటీవలే నిర్వహించిన సర్వే ద్వారా తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. అంతేకాదు దేశ జనాభాలో 3.27 శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వాలు క్రీడలకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నాయో తెలుస్తోంది.
దీనికితోడు క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో ఓ స్పష్టమైన విధానం అంటూ లేకపోవడం భారత క్రీడారంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీ చాలదన్నట్లు నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అంతేకాదు.. ఇందుకోసం ఎలాంటి విధానాలూ లేవని మాజీ క్రీడా దిగ్గజాలు విమర్శిస్తున్నారు. దశాబ్దాలనాటి క్రీడా మౌలిక సదుపాయాలతో భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఏవిధంగా రాణించగలరని భారత హాకీ మాజీ కెప్టెన్‌, అర్జున అవార్డు గ్రహీత ఎం పి గణేశ్‌ గతంలో వేసిన ప్రశ్నకు నేటికీ సమాధానం లేదు.
'పే టు ప్లే'తో పెరుగుతున్న దూరం
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సారు) కొత్తగా తీసుకొచ్చిన 'పే టు ప్లే' నిబంధనలు బాలల పే క్రీడలకు మరింత దూరం చేసేవిగా ఉన్నాయి. 'డబ్బులు కట్టి క్రీడలు నేర్చుకో' అన్న నిబంధనతో.. మట్టిలో మాణిక్యాలు మట్టిలోనే అణిగిపోయే స్థితి తలెత్తుతోంది. కొన్ని క్రీడలు పేదవారికి ఇప్పటికే దూరమయ్యాయి. ఇప్పుడు ఈ నిబంధనతో బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌ తదితర క్రీడలూ పేదవారికి దూరమైనట్లే. బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌ (నిజామాబాద్‌), మేరీకోమ్‌, అథ్లెటిక్స్‌లో అవినాశ్‌ సేబల్‌, ద్యూతీ చంద్‌, హిమాదాస్‌, లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి ఛాను వంటి వారు స్వయంకృషితో పైకి వచ్చినవారే.

hockey

ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ తీరిది..
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలుంటే.. ప్రైవేటు స్కూల్స్‌లో అవీ లేని దుస్థితి. క్రీడా మైదానాలున్న స్కూళ్లలో విద్యార్థులను తీర్చిదిద్దే కోచ్‌లు లేకపోవడం మరో లోపం. గతంలో మాదిరిగా విద్యార్థులు ఇష్టమైన ఆటలు ఆడుకొనేందుకు ఒక పీరియడ్‌ అంటూ లేకపోవడం వంటివి బాలలను క్రీడలకు మరింత దూరం చేస్తోంది. దీనికితోడు ప్రైవేట్‌ స్కూల్స్‌ ధ్యాసంతా అనారోగ్యకర పోటీని పెంచే ర్యాంకుల మీదే. వాటికోసం రాత్రనక, పగలనక పిల్లలను యంత్రాలుగా మార్చేస్తున్నారు.
వాస్తవానికి పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్న మాట.. నేటి తరం పాఠశాలలకు ఏమాత్రం వర్తించదు. చిన్న నగరాలు, పట్టణాల్లో సింగిల్‌ బెడ్‌రూమ్‌ పాఠశాలలు, డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ కళాశాలలను చూస్తుంటే క్రీడారంగంలో భారత్‌ ఏ గతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు. దేశంలోని క్రీడారంగ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నిపుణుల సంఘాల్లో సభ్యుడిగా ఉన్న భారత హాకీ మాజీ కెప్టెన్‌ జాఫర్‌ ఇక్బాల్‌ సైతం ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలను చూసి, తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస క్రీడా సౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు. ఈ విషయంపై భారత మాజీ క్రీడాదిగ్గజాలు, అర్జున అవార్డీలు ఆవేదన చెందుతున్నారు. క్రీడలను సైతం నిర్బంధ పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు.
మన సమాజం, ప్రభుత్వాలు క్రీడారంగం పట్ల తమ ఆలోచనా ధోరణిలో మార్పు రానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నిపుణులు, విశ్లేషకులు చెబుతున్న మాట.

foot ball


మట్టిలో మాణిక్యాలు..
ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించిన ఎందరో అథ్లెట్లు కటిక దారిద్య్రం నుంచి పతకాల సాధనకు పడ్డ కష్టం అంతా.. ఇంతా కాదు. వారిలో కొందరి దీనగాథ వింటే హృదయం ద్రవించిపోతుంది. కొన్ని దేశాలకే పరిమితమైన కామన్వెల్త్‌ క్రీడల్లో 210 మందితో మన బృందం పాల్గొంటే మనకు దక్కింది 61 పతకాలే. అందులో కుస్తీ (12), బాక్సింగ్‌ (10), వెయిట్‌లిఫ్టింగ్‌ (7) విభాగాల్లో 29 పతకాలు రాగా.. మిగతా అన్ని క్రీడాంశాల్లో వచ్చినవి 32 పతకాలే.

కనుమరుగవుతున్న జాతీయ పోటీలు
దేశంలో క్రీడలు ఎన్నిరకాలు ఉన్నా.. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ స్థాయిలో జాతీయ పోటీలు నిర్వహించడం ఓ సాంప్రదాయంగా ఉండేది. ఈ పోటీల నిర్వహణ కోసం జాతీయ ఒలింపిక్‌ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖలు సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవి. అయితే లాభసాటి లీగ్‌ వ్యాపారం భారత క్రీడారంగంలోకి చొరబడటంతో జాతీయ పోటీల నిర్వహణ తూతూ మంత్రంగా మారిపోయాయి. దీంతో భారత క్రీడారంగ మూలాలే బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది.
నిధుల్లో కోత..
మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ పేర్కొన్నట్లు.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్రీడా సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోంది. ఖేలో ఇండియా కింద ఆయా రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో కోత పెడుతోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా నిధుల్లో గుజరాత్‌కు రూ.608 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణకు కేవలం రూ.24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు అంతకంటే తక్కువ కేటాయించడమే ఇందుకు కారణం.
లవ్‌ప్రీత్‌ సింగ్‌..

singh


వెయిట్‌ లిఫ్టింగ్‌లో 100+ కేటగిరీలో కాంస్య పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన ఈ కుర్రాడికి కాంస్యం అంత తేలిగ్గా రాలేదు. కామన్వెల్త్‌ క్రీడలకు ముందు కూరగాయలు అమ్మాడు.. మూటలు ఎత్తాడు. తనను ప్రోత్సహించే స్థోమత కుటుంబానికి లేకపోవడం అతడికి పెద్ద అడ్డంకిగా మారింది. తండ్రి చిన్న దర్జీ. ఆదాయం సరిపోకపోవడంతో అమృత్‌సర్‌లోని మండిలో కూరగాయల దుకాణంలో పనికెళ్లాడు. ఇలా చాలా ఏళ్లు ఇబ్బందులు పడుతూ వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధన చేసి, పతకం కొట్టాడు.
ఆచింట శూలీ..

sulle


ఆచింట శూలీ తండ్రి ఓ ట్రాలీ రిక్షా పుల్లర్‌. పూట గడవడమే కష్టం. తండ్రి ఆకస్మిక మరణం. తల్లి, అన్నతో కలిసి ఎంబ్రాయిడరీ పనిచేస్తూనే కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నాడు. 73 కిలోల కేటగిరీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించడంతో అతని తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఆచింట కుటుంబ, ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. అయినా పట్టుదలతో పైకి వచ్చాడు. నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు.
హర్జీందర్‌ కౌర్‌..

kour


కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం కొట్టిన కౌర్‌.. కుటుంబం జీవనాధారం వ్యవసాయ రంగం. తల్లిదండ్రులకు సాయపడుతూ పొలంలో గడ్డి కోసే యంత్రంతో, పశువులకు దాణా వేసేది. ఆ యంత్రం మీదే పనిచేయడం వల్ల ఆమె తన భుజాలు బలంగా తయారయ్యాయి. కబడ్డీ సాధన చేస్తున్న సమయంలో ఓ కోచ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌కు మారమని సూచించాడు. ఆ విధంగా వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగుపెట్టి, కామన్వెల్త్‌లో పతకం కొట్టి, అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఎల్డోజ్‌ పాల్‌..

paul


కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఎల్డోజ్‌పాల్‌.. ఐదేళ్ల వయసులో అమ్మ చనిపోగా.. అమ్మమ్మ వద్ద పెరిగాడు. తండ్రి కల్లు దుకాణంలో పనిచేసేవాడు. ఆర్థిక బాధలు వర్ణనాతీతం. ఆటల వల్ల ఆర్థిక బాధలు తీరతాయన్న దృఢ నిర్ణయంతో ఈ రంగంలోకి దిగాడు. కామన్వెల్త్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో ఏకంగా స్వర్ణ పతకాన్ని సాధించి, ఔరా అనిపించుకున్నాడు.
సంకేత్‌ సాగర్‌..

weight lifter


వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మహరాష్ట్రకు చెందిన సంకేత్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ముందు కుటుంబ పోషణకోసం సాంగ్లీ ప్రాంతంలో టీ, పాన్‌ దుకాణం నడుపుకున్నాడు. 13 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొన్న సంకేత్‌కు కేవలం ఆ ఆట మీదే దృష్టిపెట్టే పరిస్థితి లేదు. ఉదయం, సాయంత్రం టీ, పాన్‌ దుకాణాన్ని నడుపుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధన చేసి, పతకం కొట్టాడు.
ఆకుల శ్రీజ..

table tenies


టేబుల్‌ టెన్నిస్‌ (టిటి) విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ఏకంగా స్వర్ణ పతకం సాధించింది. టాప్‌ టిటి క్రీడాకారిణి కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న మనక బత్రా సెమీస్‌కు చేరడంలో విఫలమైతే.. ఏమాత్రం అంచనాల్లేని ఆకుల శ్రీజ ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా రెండు పతకాలను సాధించి, ఔరా అనిపించుకుంది.

చెస్‌లో బలమైన కేంద్రంగా భారత్‌..
భారత్‌లో 2007 వరకూ కేవలం 20 మంది మాత్రమే గ్రాండ్‌మాస్టర్లు ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 73కు చేరింది. దాదాపు 50 వేల మంది చదరంగపు క్రీడాకారులు రిజిస్టరై ఉంటే.. ప్రపంచ టాప్‌ 100 ర్యాంకింగ్స్‌లో ఏడుగురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఆ యువకుడికి 17 ఏళ్లు. వరుసగా మూడు ఆటల్లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, ఆల్‌టైమ్‌ రికార్డులో బలమైన చెస్‌ ప్లేయరైన నార్వేకు చెందిన మాగస్‌ కార్ల్‌సెన్‌ను ఓడించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడే చెన్నరుకు చెందిన రమేష్‌బాబు ప్రజ్ఞానంద. అక్క వైశాలి నుంచి చదరంగం ఓనమాలు నేర్చుకొని, ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రజ్ఞానంద సహచరుడైన డి గుకేష్‌ కూడా ఒలింపియాడ్‌లో ఎనిమిది విజయాలు సాధించి, సంచనలం సృష్టించాడు. దీనికి కొద్దిరోజుల ముందు మరో భారతీయ యువకుడు అర్జున్‌ ఎరిగైసి కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచి, వార్తల్లో నిలిచాడు.  ప్రజ్ఞానంద, గుకేష్‌, ఎరిగైసీతో పాటు మరో ఇద్దరు యువ భారతీయులు నిహాల్‌ సరిన్‌, రౌనక్‌ సాధ్వానీ కూడా ఒలింపియాడ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అబుదాబి ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో కార్ల్‌సెన్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించడానికి కొన్ని గంటల ముందు సాధ్వానీ బ్లిట్జ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌ మాస్టర్స్‌ విభాగంలో సాధ్వానీ ఐదు రౌండ్ల తర్వాత ఎరిగైసి, సరిన్‌తో పాటు ఇతరులతో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంది. ఇక గుకేశ్‌ అంకారాలో జరుగుతున్న టర్కిష్‌ చెస్‌ సూపర్‌లీగ్‌లో తన రేటింగ్‌ను మెరుగుపరుచుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈ అత్యంత ప్రతిభావంతులైన యువకులందరూ తమ గ్రాండ్‌ మాస్టర్లీ ఎత్తుగడలను ఒకే సమయంలో చేయడం భారతీయ చెస్‌కు మంచి పరిణామం. వి ప్రణవ్‌, భరత్‌ సుబ్రహ్మణ్యం వంటి మరికొంత మంది యువకులు వింగ్స్‌లో వేచి ఉన్నారు. దీనంతటికీ ఆద్యుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌ను చెప్పుకోవచ్చు. నాణ్యమైన కోచ్‌లు, గ్రాండ్‌మాస్టర్ల ప్రోత్సాహంతో భారత్‌ బలమైన చదరంగ స్థావరంగా ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆటకు పెరుగుతున్న ఆదరణతో మున్ముందు మరిన్ని విజయాలను అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
టాప్‌సీడ్‌..

chess
చెన్నయ్ లో బ్యాంకు ఉద్యోగి రమేష్‌బాబు, నాగలక్ష్మి దంపతులకు 2005లో ప్రజ్ఞానంద జన్మించాడు. ప్రజ్ఞానంద అక్క వైశాలి. ఆమె తల్లి నుంచి.. ప్రజ్ఞానంద అక్క నుంచి ఓనమాలు నేర్చుకున్నారు. వైశాలి అండర్‌-11, 13, 15 విభాగాల్లో, 2015లో నేషనల్‌ ఛైల్డ్‌ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి అందుకొంది. అక్క సాధిస్తున్న అద్భుత విజయాలను చూస్తూ పెరిగిన ప్రజ్ఞానంద చదరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. ఏడేళ్ల వయస్సులోనే వరల్డ్‌ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ (2013)ను గెలిచాడు. దీంతో ఫిడే మాస్టర్స్‌ హోదా అందుకొన్నాడు. 2015లో అండర్‌-10, 2016లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదా పొందాడు. 2018లో ఇటలీలో జరిగిన గ్రెడిన్‌ టోర్నీలోని 8వ రౌండ్‌లో లుకా మురోనిని ఓడించి, గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకొన్నాడు. దీంతో అతిపిన్న వయస్సులో ఈ హోదా దక్కించుకొన్న వారిలో ఆల్‌టైమ్‌ రికార్డుల్లో ఐదో స్థానంలో నిలిచాడు. అయితే గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకోవడం ఆషామాషీ కాదు. విశ్వనాథన్‌ ఆనంద్‌ వంటి దిగ్గజానికి 18వ ఏట 1988లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కిందంటే ఆ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

పఠాన్‌ మహాబాషా
8919999289