
ఈ మధ్య రెండు అంశాలపై వార్తలు వచ్చాయి. ఒకటి దేశంలో నిపుణులైన కార్మికుల లేమి గురించి ఒక నివేదిక వెలువడింది. నైపుణ్య శిక్షణ పేరుతో చేసిన హడావుడి ఎలా విఫలమైందో అంతకు ముందే విశ్లేషణలు వచ్చాయి. విద్వేష ప్రసంగాల మీద నమోదైన కేసుల గురించి ఒక కమిటీని ఆగస్టు 18 లోగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం కొన్ని చోట్ల పని చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రెండింటిలోనూ కేంద్ర వైఫల్యం స్పష్టమైంది. నిజానికి సుప్రీం కోర్టు ఆదేశం మోడీ సర్కార్‌ను పరోక్షంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. నైపుణ్య మెరుగుదల కోసం ఎన్నో పథకాలు, ఏకంగా మంత్రినే ఏర్పాటు చేసిన ఘనత తమదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పథకాలు, ప్రకటనల మాదిరే ఇది కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. 2023 ఆగస్టు రెండవ వారంలో స్కిల్ ఫైనాన్సింగ్ రిపోర్టు 2023 కొన్ని అంశాలను వెల్లడించింది. దేశంలోని 78 శాతం మంది యువతరానికి అభ్యాససిద్ధమైన నైపుణ్యాలు లేవు. జనాభాలో 15-24 సంవత్సరాల యువత 25.4 కోట్ల మంది ఉన్నారు. ఉపాధికి అవసరమైన ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 46.2 శాతం మందే ఉన్నారు. మొత్తం మీద నైపుణ్యాల ర్యాంకులో మన దేశం ప్రపంచంలో 60వ స్థానంలో ఉంది. 2015 వరకు మన దేశంలోని కార్మికుల్లో 4.7 శాతమే నైపుణ్య శిక్షణ పొందగా దక్షిణ కొరియాలో 90, జపాన్‌లో 80, బ్రిటన్‌లో 68, అమెరికాలో 52 శాతం ఉన్నారు. మన దేశంలో శిక్షణ పెద్ద ఎత్తున అవసరం గనుక నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుందని కూడా సదరు నివేదిక సలహా ఇచ్చింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి పార్లమెంటు ప్రసంగంలో ఏడు సార్లు యువత అనే పదాన్ని ఉచ్ఛరించారు తప్ప ఒక్కసారి కూడా నైపుణ్యం గురించి చెప్పలేదు (అది మోడీ సర్కార్ రాసి ఇచ్చిన ప్రసంగమే). 2023 బడ్జెట్‌లో ప్రకటించిన నైపుణ్య శిక్షణ పథకాలు వాస్తవ రూపం ధరించాలంటే సంవత్సరాలు పడుతుంది. లోక్‌సభలో 2022 మార్చి 14న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం పిఎంకెవివై 1.0 కింద 18.04 లక్షల మంది నమోదై శిక్షణ పొందగా వారిలో 13.32 లక్షల మందికి నైపుణ్య సర్టిఫికెట్లు ఇచ్చారు. వారిలో కేవలం 2.53 లక్షల మందికే లేదా 19 శాతం మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 3.0 ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణ్యంగా నైపుణ్యం ఇవ్వాలని నిర్ణయించారు, తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ట్రంలో కూడా మొత్తంగా అది విఫలమైంది. పిఎంకెవివై 3.0లో 4.98 లక్షల మంది నమోదు చేసుకోగా 4.45 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 1.72 లక్షల మంది సర్టిఫికెట్లను పొందారు. వారిలో కేవలం 15,450 మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 1.0లో 12,218 నైపుణ్య శిక్షణ కేంద్రాలుండగా, 2.0 నాటికి 9,030 కేంద్రాలు, 3.0లో కేవలం 683 మాత్రమే ఉన్నాయి. ఇదీ ఆ విశ్లేషణ సారం.
యువ భారతం అని, తగినంత మంది పని చేసే వారున్నారని గొప్పలు చెప్పుకుంటే చాలదు. ఏటా కోటి మంది కొత్తగా పని కోసం వస్తున్నారు. ఏటికేడు కొత్త సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయివేటు రంగం ఆ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది జూన్‌లో భారత్ కోసం కృత్రిమ మేథ అనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పాతిక లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏ దేశానికైనా నిపుణులైన కార్మికులు అవసరం. అది వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అమెరికా మీడియా యుఎస్ న్యూస్ 2022 సెప్టెంబరులో 85 దేశాల పరిస్థితుల మీద సర్వే చేసి జాబితాను ప్రకటించింది. కార్మిక నైపుణ్యంలో జపాన్, దక్షిణ కొరియా తరువాత చైనా మూడవ స్థానంలో ఉంది. మన దేశం ఇరవై ఒకటవ స్థానంలో ఉంది. మొత్తం మీద అన్ని రకాల నైపుణ్యాల్లో చైనా 17వ దేశం కాగా మనం 31వ స్థానంలో ఉన్నాం. ఏ దేశమైనా నైపణ్యం పెంచటమే కాదు, పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది. మన దేశంలో ఆ రెండూ లేవు.
మరి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. చేసేందుకు ఉపాధి లేక, ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేక నామమాత్రపు వేతనాలతో పని చేసే యువతను తప్పు దారి పట్టించటానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకుండా ఆవు పేడ, మూత్రంలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తే ధనిక దేశంగా మారతాం అనే ఆలోచనలో ఇంకా ఉన్నామంటే అతిశయోక్తి కాదు.
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా... దేశంలో ఉన్న విద్వేష పూరిత వాతావరణం, ఉదంతాల గురించి సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలో పదే పదే ఆందోళన వెల్లడిస్తున్నది. జాతి, మతం, పుట్టిన ప్రాంతం, నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన భిన్న పౌర సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి సామరస్యతను దెబ్బతీసే శక్తులను అదుపు చేసేందుకు ఐపిసిలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన 153 ఏ ప్రకారం నమోదు చేసిన కేసులు దేశంలో 2014-2020 కాలంలో 323 నుంచి 1,804కు పెరిగాయి. జాతీయ సమగ్రతను దెబ్బ తీసేందుకు పాల్పడేవారి మీద 153 బి సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. ఇవి 13 నుంచి 82కు పెరిగాయి. తప్పుదారి పట్టించే, విద్వేషాన్ని, శతత్వాన్ని పెంచే సమాచారాన్ని వ్యాపింప చేయటం, ప్రకటనలు చేసే వారిని శిక్షించేందుకు ఉన్న సెక్షన్ 505 కేసులు 2017లో 257 ఉంటే 2020 నాటికి 1,527కు పెరిగాయి. రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చోట ఒక సామాజిక తరగతి మీద అసలు కేసులే నమోదు చేయటం లేదన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. అందుకే బాధితులు లేదా ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు తమంతట తాముగా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేశంలో తలెత్తుతున్న ఆందోళనకర పరిస్థితికి ఈ కేసులు, సుప్రీం కోర్టు ఆదేశాలు నిదర్శనం.
2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, హృషికేష్ రారు బెంచ్ ''ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్ 51వ చెబుతున్నది. మతం పేరుతో జరుగుతున్నదేమిటి? ఇది విషాదం'' అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేషపూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాలు ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టికల్ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహోదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.
అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోల్‌పై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్ సర్కార్ విడుదల చేసింది. 2002లో గోద్రా రైలు సజీవదహనం, దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ 'ఘన'కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్ కుటుంబం పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే ఈ నేరగాళ్లను గుజరాత్ ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవం పేరుతో ఆగస్టు 15న విడుదల చేసింది. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.'' ఈ కేసులో నేరగాళ్లకు, బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు. బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు. ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు. ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం'' అని పేర్కొన్నారు. ఇలాంటి రెండింజన్ల పాలనే మణిపూర్‌లో కూడా ఉన్నందున మహిళలను నగంగా తిప్పి, అత్యాచారం చేసిన ఉదంతాన్ని వెల్లడి కాకుండా తొక్కి పెట్టాలని చూశారు. వీడియో వెల్లడి కావటంతో మొక్కుబడి ప్రకటనతో సరిపుచ్చారు. విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినటం లేదు. రిజర్వేషన్ల గురించి ఆందోళన తలెత్తితే మణిపూర్‌లో చర్చ్‌లను తగులబెడతారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తారు. మత విద్వేషం చెలరేగితే హర్యానాలో ఒక మతానికి చెందిన వారి నివాసాలు, దుకాణాల మీదకు మాత్రమే అక్కడి ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లు నడుపుతారు. దేశం ఎటుపోతోంది అని గాదు ఎటు తీసుకుపోతు న్నారు, ఎవరు అన్నది ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. దేశంలో ముస్లింలు, దళితుల మీద జరుగుతున్న దాడులను నమోదు చేసేందుకు 2017లో హిందూస్థాన్ టైమ్స్ పత్రిక పూనుకుంది. దాన్ని వెంటనే యాజమాన్యం నిలిపివేసింది, దానికి చొరవ చూపిన సంపాదకుడు రాజీనామా చేసి తప్పుకున్నారు. దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉండి వుంటుందో వేరే చెప్పాలా ?
సత్య