Oct 23,2022 09:13

ఆనంద్‌ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అదే హైస్కూల్‌లో తల్లి సునంద టీచరుగా పనిచేస్తుంది. ఒకరోజు తల్లితో కలసి బజారుకు వెళ్ళాడు ఆనంద్‌. ఆమెతో మాట్లాడుతూ 'అమ్మా! మనిషి విలువ ఎంత?' అని అడిగాడు.
ఈ ప్రశ్న వినగానే సునంద ఉలిక్కిపడిండి. తొమ్మిదవ తరగతి చదువుతున్న తన కుమారుడు ఆలోచింపజేసే ప్రశ్న వేసినందుకు తల్లిగా తనకు ఆనందంగా ఉంది. స్కూల్‌లో ఇంకా చిన్న తరగతుల పిల్లలు సైతం అనునిత్యం ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఆమె ఓపిగ్గా వారి సందేహాలు తీర్చుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆనంద్‌ అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ 'మనిషి విలువ వెలకట్ట లేనిది. సృష్టిలో మానవజన్మ చాలా గొప్పది' అంది.
'అయితే ధనవంతులు, పేదవారు, కులాలు, మతాలు, అందమైనవారు, అందవిహీనులు ఇటువంటి తారతమ్యాలు దేనికి? అందరి విలువ సమానంగా ఎందుకు లేదు?' ప్రశ్నించాడు ఆనంద్‌.
ఆనంద్‌ ప్రశ్నకు తల్లి నవ్వి.. ఆ సమీపాన కొందరు కార్మికులు మట్టితో బొమ్మలు చేసి రంగులు వేసి అమ్ముతున్నారు. ఆ పక్కనే మరి కొంతమంది మట్టితో కుండలు చేసి, మంటలో కాల్చి అమ్ముతున్నారు. ఆనంద్‌ను అక్కడికి తీసుకువెళ్ళింది తల్లి.
'ఆనంద్‌! ఈ మట్టిని చూడు. చేతితో పట్టుకో. నీకు దాని విలువ తెలుస్తుంది' అంది.
ఆనంద్‌ తల్లివైపు సంశయంతో చూస్తూ 'వద్దమ్మా, నా చేతులకు, బట్టలకు బురదౌతుంది' అన్నాడు.
'చూశావా! ఇప్పుడు నీకు ఆ మట్టితో అవసరం లేదు. అందుకే పట్టుకోవ డానికి కూడా సందేహిస్తున్నావు. కానీ అదే మట్టితో వీళ్ళు బొమ్మలు, కుండలు చేసి అమ్ముకుని డబ్బు గడించి, జీవనం సాగిస్తున్నారు. అప్పుడు ఆ మట్టికి విలువ వచ్చింది కదా! అలాగే ఇదే మట్టిలో రైతు విత్తనాలు నాటి, పంటలు పండిస్తున్నాడు. అవే మనందరం తింటున్నాం. అంటే మట్టి విలువ స్థానాన్ని బట్టి ఎలా మారుతుందో.. మనిషి చేస్తున్న పనులను బట్టి.. అతని విలువ ఉంటుంది. మనిషి సమాజం కోసం చేసే మంచి పనులు, సాధించిన విజయాలను బట్టి అతని విలువ మారుతూ ఉంటుంది. ధనం, మతం, కులం, బలంతో వచ్చే విలువలు తాత్కాలికమైనవే. అందువల్ల సమాజ హితమే మానవ జన్మకు సార్థకత. అప్పుడే మనిషికి సమాజంలో శాశ్వతమైన, నిజమైన విలువ లభిస్తుంది' అని చెప్పింది తల్లి.
ఆమె సమాధానంలో ఎప్పటినుంచో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించినట్లు తలపంకించి.. 'అర్థమైందమ్మా' అన్నాడు ఆనంద్‌ తృప్తిగా.

- షేక్‌ అబ్దుల్‌ హకీం జాని,
994942982