పరాయి పాలనకు చరమగీతం పాడి
కలలుగన్న స్వేచ్ఛా స్వరాజ్యమిప్పుడు
దిక్కుతోచని ఒంటరి పిట్టలా
చీకటి కుహరంలో కూచుని బిక్కుబిక్కుమంటోంది
కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న
డెబ్భైయారు వసంతాల స్వాతంత్య్ర భారతావనిప్పుడు
మచ్చుకైనా దేహానికి ఆచ్ఛాదన లేక
దిక్కులు పిక్కటిల్లేలా పొగిలి పొగిలి విలపిస్తోంది
వరుసమారిన వందేమాతర గీతాలాపనలో
ఇంకా వీధివీధినా రెపరెపలాడుతూ
బానిస బతుకుల పతాకాలే దర్శనమిస్తున్నాయి
సస్యశ్యామల ప్రగతి గీతికల నడుమ
అభివృద్ధి లేమిలో ఆపన్నహస్తం శూన్యమై
బలవన్మరణాలే ప్రతిక్షణం కూడికలవుతున్నాయి
అవినీతిపై ఎలుగెత్తిన గొంతులు
దారి పొడవునా నేలకొరిగి పడుతున్నాయి
అరాచకంపై పైకెత్తిన పిడికిళ్ళు
తునాతునకలుగా గాల్లోనే విసిరేయబడుతున్నాయి
రాజకీయ కురుక్షేత్రంలో
కులాల కుమ్ములాటల ఘాటైన వాసనలు
దేహానికి బలంగా అంటిపెట్టుకుని ఉన్నప్పుడు
మతసామరస్యపు పరిమళాలెలా
చొరవగా మెదళ్ళలోకి చొచ్చుకుపోతాయి
పేట్రేగుతున్న అరాచకపు రాకాసి కోరలు విరిచి
వేళ్ళూనుకుపోతున్న అవినీతి కలుపును పెరికి
స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ కలిగినప్పుడే కదా...
త్యాగధనుల ఆత్మార్పణలకు అర్థం లభిస్తుంది
భరతమాత మోముపై ఆనందాల పువ్వు విరబూస్తుంది
ఇదే కదా... దేశానికి నిజమైన స్వాతంత్య్రం!!
పూజితా చరణ్
81795 78895