
ఒక అడవికి రాజుగా శార్వరి అనే సింహం ఉండేది. ఆ సింహం వద్ద ఒక ముత్యాలహారం ఉండేది. అడవిలో దొరికిన ముత్యాలహారం తాతలకాలం నుండి వస్తుంది.
'అడవిలో మంచిపనులు చేసే సహాయగుణం కల జంతువును ఎంపికజేసిద రానున్న నా పుట్టినరోజు వేడుకల్లో ముత్యాలహారంతో సత్కరిస్తాను. ఆ సత్కారం పొందిన జంతువు 'సేవారత్న' బిరుదుతో పిలువబడుతుంది. సత్కారం అందుకున్న జంతువును అన్ని జంతువులూ గౌరవించాలి' అని ప్రకటించింది సింహం.
కొన్ని మాసాల తర్వాత మృగరాజు పుట్టినరోజు రానే వచ్చింది. వేడుక ఘనంగా జరిగింది. విందు అనంతరం సేవారత్న ఎంపిక ప్రారంభమైంది. ఒక్కో జంతువు వాటి మంచి పనులను చెప్పసాగాయి. చివరకు మూడు ఎలుగుబంట్లు మిగిలాయి. మొదటిది ముందుకొచ్చి 'మహారాజా! నేను చాలా జంతువులను ఆపదల నుండి కాపాడాను. ఆహారం దానం చేసి, ఆకలి తీర్చాను. తగాదాలను పరిష్కరించాను. పిల్లలను భుజంపై ఎక్కించుకుని అడవి అంతా తిప్పాను' అంటూ తన సేవల గురించి చెప్పుకొచ్చింది. సింహం జంతువులతో 'ఇన్నిసేవలు చేసిన ఈ ఎలుగుబంటును అభినందించాలి. దీని సేవలు అందుకున్న జంతువులు ముందుకొచ్చి వాటి గురించి చెప్పండి' అంది. ఏ జంతువూ ముందుకు రాలేదు. రెండోది ముందుకొచ్చి 'మహారాజా! నేను ఆకలిగొన్నవారికి అరటిపండ్లు, తేనె దానం చేస్తున్నాను. కావాలంటే అడగండి' అంది.
సింహం జంతువులతో 'నిజమేనా!' అంది. ఒకకోతి, ఏనుగు ముందుకొచ్చి 'ఈ ఎలుగుబంటు అడిగితే ఒక అరటిపండు ఇచ్చింది' అన్నాయి. అప్పుడప్పుడూ ఒకచుక్క తేనె నాలుకమీద వేస్తుంది. అని మరికొన్ని జంతువులు చెప్పాయి.
సింహం మూడో ఎలుగుబంటుతో 'మరి నువ్వు ఏవైనా మంచిపనులు చేశావా?' అంది.
మూడో ఎలుగుబంటు ముందుకొచ్చి 'మహారాజా! గొప్పగా చెప్పుకోదగిన సేవలు నేనేమీ చేయలేదు' అంది.
వెంటనే కొన్ని ముసలి జంతువులు. వికలాంగ జంతువులు ముందుకు వచ్చి 'మహారాజా! ఈ ఎలుగుబంటు చాలాసార్లు పండ్లు, గింజలు, తేనె ఇచ్చి మా ఆకలి తీర్చింది' అన్నాయి. కొన్ని పిల్లజంతువులు ముందుకొచ్చి 'ఈ ఎలుగు మమ్మల్ని అప్పుడప్పుడూ భుజంపై ఎక్కించుకుని, అడవిలో తిప్పి సంతోషపెట్టింది' అన్నాయి.
'దీనికి వైద్యం తెలుసు. మాకు ఉచితంగా వైద్యం చేసింది. అన్నాయి కొన్ని జంతువులు. తమకు ఆపదలో సహాయ పడింద'ని మరికొన్ని జంతువులు చెప్పాయి. 'వీలున్నప్పుడల్లా అడవిలో మొక్కలను నాటుతుంద'ని మరికొన్ని జంతువులు చెప్పాయి. 'తగాదాలను సింహందాకా రాకుండా చక్కగా పరిష్కరిస్తుంద'ని ఇంకొన్ని చెప్పాయి.
అన్ని విషయాలూ విన్న మృగరాజు 'సమాజంలో సేవారత్నలు మూడురకాలు. కొందరు మొదటి ఎలుగుబంటిలాగా ఏమీ చేయకుండా నేను అదిచేశాను. ఇదిచేశాను అని చెప్పుకుంటూ భ్రమలో బతుకుతుంటారు. మరికొందరు రెండో ఎలుగుబంటులాగా ఒక అరటిపండో, చీనీపండో ఇచ్చి, కొండంత ప్రచారం చేసుకుంటారు. మరికొందరు మూడో ఎలుగుబంటులాగా అనేకరకాల సేవలుచేస్తూ కూడా తమ గురించి చెప్పుకోరు. సహాయం పొందినవారు వారి గురించి చెప్పుకుంటారు. మీరు ఈ మూడో ఎలుగుబంటిని ఆదర్శంగా తీసుకుని, మీకు చేతనైన సహాయాలు చేయండి. నిజమైన సేవలో ఆత్మసంతృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. మంచిని పంచండి.' అని చెప్పింది. మూడో ఎలుగుబంటు మెడలో ముత్యాలహారం వేసి, పూలుచల్లి 'సేవారత్న' బిరుదుతో సన్మానించింది సింహం.
- డి.కె. చదువులబాబు
94407 03716