
అధికార వైసిపి హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్‌కు సంబంధించినదిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అసభ్య వీడియో వ్యవహారంలో అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. గత గురువారం వీడియో బయటికి రాగా వారం రోజులైనా పోలీస్ దర్యాప్తు ఒక కొలిక్కి రాలేదు సరికదా ప్రభుత్వ పెద్దల, అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎంపి మాధవ్ ఒక మహిళతో నెరపిన వీడియో కాల్ సంభాషణలో అసభ్యత చోటు చేసుకుందన్నది అభియోగం. బాధ్యతాయుత ఉన్నత పదవిలో, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు వచ్చిన మరుక్షణం ప్రభుత్వం స్పందించి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి. అధికార పార్టీ ఎంపి కూడా అయినందున వాస్తవాలు తేల్చి తన నిష్పక్షపాతాన్ని ప్రజల ముందు ప్రదర్శించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై తప్పనిసరిగా ఉంటుంది. కానీ సర్కారు వైఖరి అడుగడుగునా కొత్త సందేహాలకు పురిగొల్పుతోంది. ఎలాగైనా మాధవ్‌ను తప్పించేందుకు చేస్తున్న ప్రయాశగా ప్రభుత్వం తీరు ఉండటం దిగ్భ్రాంతికరం.
వీడియో బహిర్గతమైన వారానికి అనంతపురం జిల్లా ఎస్‌పి చేసిన ప్రకటన అభ్యంతరకరం. వీడియో ఒరిజనల్ కానందున మార్ఫింగ్ జరిగిందో ఎడిటింగ్ జరిగిందో అసలు వీడియోలో ఉన్నది మాధవ్ అవునో కాదో చెప్పలేమన్నారు ఎస్‌పి. మరో వైపు వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపలేదనీ తెలిపారు. నకిలీదో అసలీదో తేల్చాల్సింది ఫోరెన్సిక్ ల్యాబ్ తప్ప ఎస్‌పినో మరెవరో కాదు. ఆ మాత్రం సోయి ఒక ఐపిఎస్ అధికారికి లేదనుకోగలమా? ప్రభుత్వ ఒత్తిడితో అలా చెప్పారా? బాధితులు ముందుకొచ్చి ఒరిజినల్ వీడియో అందజేసి ఫిర్యాదు చేస్తేనే దర్యాప్తు ముందుకు సాగుతుంది. లేకపోతే అంతే సంగతులు అని చేతులెత్తేయడం జిల్లా స్థాయి అధికారికి తగనిపని. అంతకుముందు రోజే హోం మంత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు చేయిస్తున్నామని విస్పష్టంగా చెప్పారు. అటు ఢిల్లీలో వైసిపి ఎంపి భరత్ సైతం ఆ మాటే చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వరంలోనూ తేడా వచ్చింది. వీడియో నిజమని తేలితే మాధవ్‌పై కఠినాతి కఠినమైన చర్యలుంటాయని తొలుత ఢంకా భజాయించిన సజ్జల, నాలుగు గోడల మధ్య వ్యవహారం అని చాలా చిన్న విషయంగా మార్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం, వైసిపి నుండి వెలువడుతున్న విభిన్న ప్రకటనలు చూస్తుంటే మాధవ్‌ను వెనకేసుకు రావడమే కాదు రక్షించేందుకూ గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎవరికైనా అనుమానం వస్తుంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవ్ వ్యవహారం బాధ్యతాయుతంగా కాకుండా అనుమానాలు బలపడేలా ఉన్నాయి. తనను అప్రతిష్ట పాల్జేసేందుకు నకిలీ వీడియో సృష్టించారని, దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని ఎస్‌పికి తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఎస్‌పి మాత్రం తమకు మాధవ్‌కు చెందిన అభిమాని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మాధవ్ నుండి ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదనీ తెలిపారు. ఎస్‌పి చెప్పిందే నిజమైతే మాధవ్ ఫిర్యాదు చేయలేదనేగా? మాధవ్ పేర్కొన్నట్లు కుట్రే అయితే తానే బాధితుడు కనుక దర్యాప్తు చేయించి ఛేదించమని ఎందుకు కోరట్లేదు? వీడియోపై దర్యాప్తు చేయమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డిజిపిని ఆదేశించారు. మహిళా సంఘాలు కూడా విచారణకు డిజిపిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. లోక్‌సభ స్పీకర్‌కు, ప్రధాని మోడీకి ఫిర్యాదులు వెళ్లాయి. మహిళలపై అత్యాచారాలను వినూత్నంగా 'దిశ' ద్వారా కట్టడి చేస్తామంటున్న ప్రభుత్వం ఇంతగా కలకలం రేపిన స్వపక్ష ఎంపి వ్యవహారంపై అంటిముట్టనట్లుండటాన్ని బట్టి మహిళల రక్షణపై సర్కారు చెప్పేవన్నీ ఉత్తుత్తి మాటలుగా ప్రజలు భావిస్తారు. రాష్ట్ర ప్రతిష్టను, మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కించపర్చిన మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వం సూమోటోగా దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. దోషి అని తేలితే మాధవ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి గౌరవం. ప్రజలకు, మహిళలకు ప్రభుత్వంపై విశ్వాసం కుదురుతుంది.