Sep 13,2023 08:00
  • ఇద్దరు మృతి : కేంద్రం
  • కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం

న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి మన్షుఖ్‌ మండవీయా మంగళవారం వెల్లడించారు. పుణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో శాంపిల్స్‌ను పరిశీలించగా, కోజికోడ్‌ జిల్లాలో ఇద్దరు మృతుల్లో ప్రాణాంతక వైరస్‌ ఉన్నట్లు వెల్లడయిందని తెలిపారు. కేరళలో నిఫా వైరస్‌ వ్యాప్తి పరిస్థితిని సమీక్షించేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు నిపుణుల బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారు. నిఫా వైరస్‌ అనుమానంతో నలుగురి నమూనాలను పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు తెలిపారు.
           రెండు నిఫా మరణాల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోందని, కోజికోడ్‌లో ఆరోగ్యశాఖ అప్రమత్తమైందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. మంగళవారం ఉదయం కోజికోడ్‌ జిల్లా చేరుకున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మొదటిగా మరణించిన వ్యక్తికి చెందిన నలుగురు బంధువులు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పారు. వారిలో ఒక చిన్నారి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సోమవారమే మొదటి అనుమానిత మరణం వార్త రావడంతో ఈ వైరస్‌ను ట్రేస్‌ చేయడానికి, కాంటాక్ట్‌లు గుర్తించడానికి, నమూనాలను పరిశీలించడానికి 16 కోర్‌ కమిటీలను రాష్ట్ర ఆరోగ్య శాఖ నియమించినట్లు చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, వైరస్‌ వ్యాప్తి చెందకుండా మాస్క్‌లు ధరించాలని కోరారు. నాలుగు అనుమానిత నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. నిఫా వైరస్‌ వార్తలతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రి పిఎ మహమ్మద్‌ రియాజ్‌ కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 30న మొదటి అనుమానిత మరణంతోనే జిల్లాలోని మారుతోంకర పంచాయతీ పరిస్థితిని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. 90 ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలించారు. సమీప పంచాయతీల్లో ఇటీవల మరణాలకు గల కారణాలను కూడా పరిశీలిస్తున్నారు. ఐదేళ్ల తరువాత కేరళలో మళ్లీ నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. 2018లో ఈ వైరస్‌తో పెరంబ్రా సమీపంలోని జానకిక్కడ్‌ ప్రాంతంలో ఐదుగురు మరణించారు.