Sep 14,2023 08:43

కేరళ : కేరళలో ఇద్దరి మరణాలకు కారణమైన నీపా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఈ వేరియంట్‌ బారినపడగా ఇద్దరు మతిచెందారు. కాగా వైరస్‌ తొలిసారిగా బయటపడ్డ కోజీకోడ్‌ జిల్లాలోని అటాన్‌చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కమిలుంపర గ్రామాలను కంటెయిన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, విద్యాసంస్థలను మూసివేయడంతో పాటు పొరుగున ఉన్న కన్నూర్‌, వయనాడ్‌, మలప్పురం జిల్లా అధికారులను ప్రభుత్వం అలర్ట్‌లో ఉంచింది. ఈ వైరస్‌ బారినపడ్డ వారు మరణించే అవకాశం ఎక్కువగా ఉండటంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ బృందం కేరళకు బయలుదేరింది. కోజీకోడ్‌ జిల్లాలోని మెడికల్‌ కాలేజీలో మొబైల్‌ క్యాంపు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. దీంతోపాటూ 75 ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. కాగా, బుధవారం రాష్ట్రంలో మరో నీపా వైరస్‌ కేసు వెలుగు చూసింది. ఇక బాధితులతో సన్నిహితంగా మెలిగిన సుమారు 130 మందిని అధికారులు గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని ఐసీఎంఆర్‌ ఎపిడమిక్‌ బందాలు కోజీకోడ్‌లో సర్వే నిర్వహిస్తున్నాయి.