Aug 05,2023 07:20

2019లో అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి, జ్ఞానవాపి మసీదు ఆవరణ లోని హిందూ విగ్రహాల వద్ద ప్రార్ధనలు చేసుకునేందుకు హిందువులకు గల హక్కును నొక్కిచెబుతూ వారణాసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేగాక మసీదులోని కొలనులో వున్న ఫౌంటెన్‌కు కార్బన్‌ డేటింగ్‌ నిర్ధారించేందుకు, వీడియోగ్రాఫ్‌ సర్వేలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ వచ్చారు. ముస్లింలు ప్రార్ధనలు చేయడానికి ముందు ఈ కొలనులో కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుంటారు. 'ఆరాధనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం -1991' వున్నప్పటికీ న్యాయపరమైన ప్రక్రియలన్నీ జరుగుతూనే వున్నాయి.

           ఆలయం-మసీదు విషయంలో కొత్త ఫ్రంట్‌ ఏర్పడుతోందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పరోక్షంగా ప్రకటించారు. ఈసారి వివాదం జ్ఞానవాపి మసీదు, వారణాసి లోని విశ్వనాథ్‌ ఆలయం మధ్యన నెలకొంది. జ్ఞానవాపి మసీదు పూర్వం ఆలయమని నిర్ధారించడానికి మసీదు ఆవరణలో తగిన రుజువులు కూడా వున్నాయని ఆదిత్యనాథ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల ముస్లిం కమ్యూనిటీ ముందుకు వచ్చి గతంలో చారిత్రక తప్పిదం జరిగిందని, దీనికి పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నామని చెప్పాలని అన్నారు.
        జ్ఞానవాపి మసీదు ఆవరణలో హిందువుల పూర్వాపరాలను నిర్ధారించడానికి చట్టబద్ధత పెరుగుతున్న నేపథ్యంలో ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు, జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తు విభాగాన్ని అనుమతిస్తూ ఆగస్టు 3వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.
         2019లో అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి, జ్ఞానవాపి మసీదు ఆవరణ లోని హిందూ విగ్రహాల వద్ద ప్రార్ధనలు చేసుకునేందుకు హిందువులకు గల హక్కును నొక్కిచెబుతూ వారణాసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేగాక మసీదులోని కొలనులో వున్న ఫౌంటెన్‌కు కార్బన్‌ డేటింగ్‌ నిర్ధారించేందుకు, వీడియోగ్రాఫ్‌ సర్వేలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ వచ్చారు. ముస్లింలు ప్రార్ధనలు చేయడానికి ముందు ఈ కొలనులో కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుంటారు.
          'ఆరాధనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం -1991' వున్నప్పటికీ న్యాయపరమైన ప్రక్రియలన్నీ జరుగుతూనే వున్నాయి. పార్లమెంట్‌ రూపొందించిన ఈ చట్టం 1947 ఆగస్టు 15 నాటికి వున్న ఆరాధనా స్థలాలు (ఆలయాలు, మసీదులు, చర్చిలను భిన్న మతానికి చెందిన ఆరాధనా స్థలాలుగా) మార్చడాన్ని నిషేధిస్తోంది. అంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరాధనా స్థలాలకు సంబంధించి యథాతథ స్థితికి ఈ చట్టం హామీ కల్పిస్తోందని అర్ధం. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అటువంటి మార్పిడికి సంబంధించి కోర్టు కార్యకలాపాలు తగ్గుతాయి. అయితే అయోధ్య వివాదం, అందుకు సంబంధించి సాగిన కోర్టు కార్యకలాపాలు దీనికి ఏకైక మినహాయింపుగా వుంది. రామజన్మభూమి ఆలయం పేరుతో చేపట్టిన ఉద్యమం మాదిరిగా...ఆరాధనా స్థలాలను మార్చేందుకు ఎలాంటి ఆందోళనలు, మతోన్మాద కార్యకలాపాలు జరగవని...పి.వి.నరసింహా రావు ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన ఈ చట్టం హామీ కల్పించింది. రామజన్మభూమి ఆలయ ఉద్యమం దేశంలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసింది.
          అయోధ్య వివాదంలో తన తీర్పును వెలువరిస్తూ సుప్రీం కోర్టు, 1991 నాటి చట్టాన్ని లౌకిక దేశంగా అంతర్గత బాధ్యతలకు సంబంధించిన చట్టంగా సమర్ధించింది. ''వర్తమానాన్ని, భవిష్యత్తును అణచి వేసేందుకు సాధనాలుగా చరిత్రను, అందులోని తప్పులను ఉపయోగించరాదని పార్లమెంట్‌ ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా పేర్కొంది'' అని కూడా సుప్రీం కోర్టు తెలిపింది. 2019 లోనే సుప్రీం కోర్టు ఆరాధనా స్థలాల చట్టం-1991ని ఇంత గట్టిగా ధృవీకరించినప్పటికీ, తదనంతర కాలంలో వారణాసి కోర్టుల్లో జ్ఞానవాపి మసీదు ఆవరణపై తలెత్తిన వ్యాజ్యానికి స్వస్తి పలికేందుకు కోర్టు నిర్ణయాత్మకంగా ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా వుంది.
           వారణాసి సివిల్‌ జడ్జి ఆదేశించిన విధంగా మసీదు ఆవరణ సర్వే, వీడియోగ్రఫీపై స్టే విధించాలని కోరుతూ మసీదు కమిటీ 2022 మేలో సుప్రీం కోర్టును ఆశ్రయించినపుడే ఉన్నత న్యాయస్థానానికి ఒక అవకాశం లభించింది. ఆరాధనా స్థలాల చట్టం ప్రాతిపదికన కోర్టు, ఈ జ్యుడీషియల్‌ కార్యకలాపాలకు ముగింపు పలికి వుండాల్సింది. కాని దానికి బదులుగా (ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌ విచారణకు అర్హమైనదని పేర్కొనడాన్ని సవాలు చేస్తూ) మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా న్యాయమూర్తికి బదిలీ చేసింది. ఆయన సీనియర్‌ న్యాయమూర్తి అయినందున ఈ పిటిషన్‌ విచారణకు అర్హుడనే ప్రాతిపదికన ఈ బదిలీ జరిగింది.
          ఎఎస్‌ఐ సర్వేకు సంబంధించి మసీదు కమిటీ తిరిగి జులైలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పుడైనా అన్ని జ్యుడీషియల్‌ కార్యకలాపాలకు ముగింపు పలికి వుండాల్సింది.
         అప్పటి నుండి, ఈ కేసులో మరిన్ని పిటిషన్లు దాఖల య్యాయి. జ్ఞానవాపి మసీదును తొలగించి, అక్కడ ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ కూడా ఒక పిటిషన్‌ దాఖలైంది. ఇదంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరుగుతోందన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం.
          జ్యుడీషియల్‌ విభాగం ఉన్నత స్థాయిలో ప్రదర్శించిన ఈ పిరికితనం జ్ఞానవాపి మసీదు స్వభావాన్ని ప్రశ్నిస్తూ దిగువ కోర్టుల్లో అనేక చర్యలు తీసుకోవడానికి దారితీసింది. వీడియోగ్రఫీ సర్వే ద్వారా ఇప్పుడు ఎఎస్‌ఐ సర్వే ద్వారా వాస్తవాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించేందుకు కారణమైంది. ఈ క్రమంలో, మసీదు ఆవరణలో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలంటూ మహిళలు వేసిన పిటిషన్‌ విచారణకు అర్హమైనదనని జిల్లా కోర్టు సమర్ధించింది. మసీదు ఆవరణలోని కొలనులో గల ఫౌంటెన్‌ రూపంలో శివలింగం వుందని వీడియోగ్రఫీ సర్వే వెల్లడించింది. ఇక తాజా తీర్పులో అలహాబాద్‌ హైకోర్టు మసీదు ఆవరణను ఎఎస్‌ఐ సర్వే చేయడానికి అనుమతించారు.
ఈద్గా-కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి మథుర కోర్టుల్లో ఇదే తరహాలో న్యాయ క్రమం నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో దిగువ న్యాయ వ్యవస్థ సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నందున తమ ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చట్టబద్ధతను ఉపయోగించుకోవాలన్నది హిందూత్వ శక్తుల వ్యూహంగా కనిపిస్తోంది. న్యాయపరమైన అనుకూలతను సాధించిన తర్వాత, న్యాయ విరుద్ధమైన పద్ధతుల ద్వారా వాస్తవ పరిస్థితులను మార్చే ప్రయత్నాలు జరగవచ్చు.
          మొగ్గ దశలో వుండగానే ఈ దుశ్చర్యను తుంచివేయడం, అయోధ్య తీర్పు సమయంలో విస్పష్టంగా తేల్చి చెప్పిన 1991 చట్టాన్ని వర్తింపచేయడం సుప్రీం కోర్టు చేయాల్సిన పని.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)