
కొత్త మెడికల్ కాలేజీల్లో ఇంకా సదుపాయాల ఏర్పాటు పూర్తి కాలేదు. హాస్టళ్ల నిర్మాణం కూడా పూర్తికాకపోవడంతో బయట ఏర్పాటు చేసే మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు. అలాంటి చోట్ల భారీగా ఫీజులు నిర్ణయించి, పాత కాలేజీల్లో 'ఏ' కేటగిరీ ఫీజుకే వైద్య విద్య అందుబాటులో ఉంటుందని చెప్పడం దేనికి సంకేతం? పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా రూ.కోటికి పైగా వెచ్చించి వైద్య విద్యను అభ్యసించిన తర్వాత సదరు వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేస్తారా? కార్పోరేట్ ఆస్పత్రిలో వ్యాపారం చేస్తారా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు రాకపోతే ప్రజారోగ్యం ఏమి కావాలి? ప్రభుత్వ వైద్య రంగాన్ని ఏం చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు? పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ సీట్ల వ్యాపారానికి అంకురార్పణ చేయడం ద్వారా జగన్ ఏం సంకేతమిస్తున్నట్టు ?
మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో, లేదంటే కలెక్టర్ చదివిస్తారో మీ ఇష్టం. మీరు చదివించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఉచితంగా ఉన్నత విద్య అందిస్తాం...ఇవీ విపక్ష హోదాలో ఉన్న జగన్ మాటలు మాత్రమే కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కూడా అవే చెప్పారు. కానీ తీరా చూస్తే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను అమ్ముకుంటున్నారు. ప్రతిభకు, ఎస్.సి, ఎస్.టి, బి.సి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. మాట్లాడితే పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే పేదలకు వైద్య విద్య దూరమవుతోంది. ఎంబిబిఎస్ కోసం కోటి రూపాయలు వెచ్చించగలిగిన వారికి మాత్రమే అందుతోంది. అంటే ఈ ప్రభుత్వం ప్రతిభ కలిగిన పేదల పక్షాన ఉన్నట్టా లేక డాక్టర్ పట్టా కోసం కోటి రూపాయలు ఖర్చు చేయగల పెత్తందారుల ప్రయోజనాల కోసం ఉన్నట్టా !
ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల అమ్మకం...
ఈ ఏడాది మే 7న జరిగిన జాతీయ పోటీ పరీక్షలు నీట్‌కి ఎ.పి నుంచి 68 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 48 వేల మంది అర్హత సాధించారు. కొత్తగా 5 మెడికల్ కాలేజీల్లో 2023-24 నుంచి ప్రవేశాలకు ఎంసిసి అనుమతించడంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందని, ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయని అంతా ఆశించారు. కానీ ఎ.పి ప్రభుత్వం జులై 19న 107,108 నెంబర్లతో కొత్త జీవోలు తీసుకొచ్చింది. సరిగ్గా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు ఈ జీవోలు విడుదల చేసింది. వాటి ప్రకారం కొత్తగా ప్రారంభిస్తున్న మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్మకానికి తెరలేపారు. ఆయా కాలేజీల్లో 150 మంది చొప్పున మొత్తం 750 సీట్లకు అనుమతి వచ్చింది. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో అంటే 113 సీట్లు పోగా మిగిలిన 637 సీట్లను ఏపీలో కన్వీనర్ కోటా ఏ కేటగిరీలో రిజర్వేషన్లను అనుసరించి ప్రతిభ ఉన్న వారితో భర్తీ చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో కేవలం 50 శాతం అంటే 319 సీట్లు మాత్రమే మిగిల్చారు. 35 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో బి కేటగిరీ సీట్లుగా మార్చారు. 223 సీట్లను ఆ కేటగిరీలోకి మార్చారు. దానికి ఏడాదికి రూ. 12 లక్షల చొప్పున ఫీజుగా ప్రకటించారు. మరో 15 శాతం సీట్లను అంటే 95 సీట్లు ఎన్నారై కోటాలో చేర్చారు. ఏడాదికి రూ.20 లక్షలు ఫీజుగా జీవోలో పేర్కొన్నారు. అంటే ఎంబిబిఎస్ కోర్సు కోసం బీ కేటగిరీ విద్యార్థి సుమారుగా రూ.60 లక్షలు, ఎన్నారై కోటాలో రూ.కోటి రూపాయలు చెల్లిస్తేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కుతుంది.
ఎ.పి లో వందేళ్ల క్రితమే తొలి మెడికల్ కాలేజి విశాఖలో ఏర్పాటయ్యింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఎయిమ్స్ కూడా మంగళగిరిలో అందుబాటు లోకి రావడంతో 12 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వాటితో పాటుగా 2023-24లో ఎ.యు పరిధిలో 20, ఎస్వీయూ పరిధిలో 14, స్టేట్ వైడ్ కాలేజ్ గా విజయవాడ సిద్ధార్థ కాలేజీ కలుపుకుంటే మొత్తం 35 కాలేజీలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొత్త కాలేజీలు తీసేస్తే పాత కాలేజీలన్నింటా ఆలిండియా కోటా సీట్లు పోగా మిగిలిన వాటిని మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. కానీ ఎ.పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది ప్రారంభమయ్యే కొత్త 5 కాలేజీల్లో మాత్రం మొత్తం సీట్లలో 85 శాతం ప్రతిభ ఉన్న వారికి దక్కాల్సి ఉండగా, కేవలం 42.5 శాతం అంటే సగం సీట్లు మాత్రమే మెరిట్‌కి దక్కుతున్నాయి. మిగిలిన సీట్లను ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల మాదిరిగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ప్రతిభకు కాకుండా పైసలున్న వారికే సీటు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎ.పి లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు ఏ కేటగిరీ అంటే ప్రతిభకు కేటాయిస్తుండగా, కొత్త ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ప్రైవేటు కాలేజీల కన్నా తక్కువగా మెరిట్ స్టూడెంట్లకు సీట్లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రతిభను ఏ విధంగా పాతరేస్తున్నారో అర్థమవుతోంది.
ఎస్.సి, ఎస్.టి, బి.సి రిజర్వేజన్లకు ఎగనామం..
కొత్తగా ప్రారంభమవుతున్న మచిలీపట్నం మెడికల్ కాలేజీలో 150 సీట్లకు గానూ 22 సీట్లు ఆలిండియా కోటాలో పోతే మిగిలిన 128 సీట్లు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ తరపున కన్వీనర్ కోటాలో ఏ కేటగిరీలో ఉండాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బి.సి ఏ 7 శాతం, బి.సి బీ 10 శాతం, బి.సి సీ 1 శాతం, బి.సి డీ 7 శాతం, బి.సి ఈ 4 శాతం కేటాయించాల్సి ఉంది. దానిని అనుసరించి ఎస్సీలకు 20 సీట్లు, ఎస్టీలకు 8 సీట్లు, బి.సి ఏ 9 సీట్లు , బి.సి బీ 13 సీట్లు, బి.సి సి కి ఒక్క సీటు, బి.సి డీ కి 9, బి.సి ఈ 5 సీట్ల వరకూ సుమారుగా దక్కాలి. మొత్తం బి.సి, ఎస.్‌సి, ఎస్.టి లకు కలిపి 64 సీట్లు రావాలి. అవి కాకుండా స్పోర్ట్స్, ఎన్‌సిసి, పోలీస్ అమరవీరులు వంటి వివిధ రిజర్వేషన్ కోటాలో కూడా సీట్ల కేటాయింపు ఉంటుంది.
కానీ ప్రస్తుతం జగన్ ప్రభుత్వ నిర్ణయం మూలంగా అదే మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ఆలిండియా కోటా పోగా మిగిలిన 128 సీట్లలో 64 సీట్లను బీ, సీ కేటగిరీలుగా మార్చేశారు. వాటికి ఫీజులు నిర్ణయించారు. రిజర్వేషన్లు అమలు చేయబోమంటూ జీవోలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ విద్యా సంస్థలో రిజర్వేషన్లు తొలగిస్తున్నట్టు ప్రభుత్వమే చెబుతోంది. దాని మూలంగా 64 సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో కేవలం 32 సీట్లు మాత్రమే సగమే ఎస్.సి, ఎస్.టి, బి.సి లకు దక్కుతున్నాయి. తద్వారా ఎస్సీలు 10 సీట్లు, ఎస్టీలు 4 సీట్లు, బీసీలు 37 సీట్ల వరకూ కోల్పోతున్నారు. అంటే 5 కొత్త కాలేజీలకు కలిపి ఎస్సీలకు 50 సీట్లు , బీసీలకు 185 సీట్లు, ఎస్టీలకు 20 సీట్ల వరకూ జగన్ ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. నిత్యం నా ఎస్.సి, నా బి.సి, నా ఎస్.టి లు అంటూ మాట్లాడే ముఖ్యమంత్రి హయంలోనే మొదటిసారి ఎస్.సి, ఎస్.టి, బి.సి లకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు మాయమవుతున్నాయి. ఇవి ప్రస్తుతానికి 5 కాలేజీలు మాత్రమే. త్వరలో మరో 12 కాలేజీలు ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తర్వాత ఇదే విధానాన్ని అన్ని ప్రభుత్వ కాలేజీలకు వర్తింపజేయరనే నమ్మకం ఎలా కలుగుతుంది ?
సెల్ఫ్ ఫైనాన్స్ అంటే చెల్లుతుందా !
కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్ల విక్రయానికి తెరలేపిన ప్రభుత్వం దానికి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటూ చెబుతోంది. దేశంలో ఇప్పటి వరకూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో పేరుతో కొత్త కోర్సులు ప్రారంభించిన చరిత్ర ఉంది. కానీ తొలిసారిగా పాత కోర్సులను కొత్త కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ చెప్పడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించే వరకూ కొత్త కోర్సులకు అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేయడమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం. కానీ ఇప్పుడు ఎ.పి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తమ ఘనతగా చెబుతోంది. అంటే ప్రభుత్వమే కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అంగీకరిస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో పాత కోర్సులకు కొత్త పేరు పెట్టి సీట్ల విక్రయానికి శ్రీకారం చుట్టడం ప్రభుత్వ తీరుని తేటతెల్లం చేస్తోంది.
మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే 60 శాతం నిధులు అందిస్తోంది. పిడుగురాళ్ల, అరకులో నిర్మాణంలో ఉన్న కాలేజీలకు కూడా నిధులు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఎ.పి ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి రూ. 585 కోట్లు కేటాయించినట్టు పేర్కొంది. అంటే ప్రభుత్వ నిధులతో నిర్మించిన కాలేజీలు, ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే చెల్లుతుందా. ఇప్పటి వరకూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా మినహా ఒకటే కేటగిరీలో ప్రతిభ కలిగిన వారికి అవకాశం దక్కేది. కానీ ప్రస్తుతం దానిని ఆలిండియా కోటాతో పాటుగా, ఎ, బి, సి కేటగిరీ విద్యార్థులు కూడా ఉంటారని ఎ.పి ప్రభుత్వ జీవో చెబుతోంది. అంటే ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన కాలేజీలో నాలుగు కేటగిరీల విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పడం విస్మయకరంగా కనిపిస్తోంది. ప్రభుత్వ తోడ్పాటు లేని కొత్త కోర్సులకు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసుకురాగా, దాన్ని ప్రభుత్వ వ్యయంతో అందుబాటులోకి వస్తున్న పాత కోర్సులకు వర్తింపజేస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడం అసంబద్ధ వ్యవహారాన్ని చాటుతోంది.
దేశానికి భిన్నంగా...
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చింది. అందులో ఎ.పి లో 5 కాలేజీలు ఉండగా, తెలంగాణలో 9 ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లలోనే తెలంగాణలో 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందబాటులోకి తెచ్చారు. కర్ణాటకలో కూడా గత ఏడాది నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. తమిళనాడులో సైతం కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాకు కనీసంగా ఒక మెడికల్ కాలేజి అందుబాటులో ఉండాలన్న విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల విక్రయానికి సిద్ధపడిన దాఖలాలు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనగానే దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉంది. కేవలం ఎ.పి లో జగన్ ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా నడుస్తోంది.
పాత మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు, సిబ్బంది, బోధనాస్పత్రులో అందుబాటులో ఉండే రోగుల సంఖ్య వంటివి మెరుగ్గా ఉంటాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఇంకా సదుపాయాల ఏర్పాటు కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల నిర్మాణం కూడా పూర్తికాకపోవడంతో బయట ఏర్పాటు చేసే మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. అలాంటి చోట్ల భారీగా ఫీజులు నిర్ణయించి, పాత కాలేజీల్లో ఏ కేటగిరీ ఫీజుకే వైద్య విద్య అందుబాటులో ఉంటుందని చెప్పడం దేనికి సంకేతం? పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా రూ.కోటికి పైగా వెచ్చించి వైద్య విద్యను అభ్యసించిన తర్వాత సదరు వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేస్తారా? కార్పోరేట్ ఆస్పత్రిలో వ్యాపారం చేస్తారా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు రాకపోతే ప్రజారోగ్యం ఏమి కావాలి? ప్రభుత్వ వైద్య రంగాన్ని ఏం చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు? పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ సీట్ల వ్యాపారానికి అంకురార్పణ చేయడం ద్వారా జగన్ ఏం సంకేతమిస్తున్నట్టు? ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే విపక్షాలు, వివిధ సంఘాలు తప్పుబట్టాయి. విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను అమ్మకానికి పెట్టాలనే ఆలోచన విరమించుకోవాలి.
/ వ్యాసకర్త మెడికల్ విద్యార్థిని /- వెన్నెల