
రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు... కాలం. అదొక నిత్య ప్రవాహం. మన ఘన స్వాగతాలతో దానికి సంబంధం లేదు. ఉత్సాహ నిరుత్సాహాలతో నిమిత్తం లేదు. మనం విభజించుకున్న కాలం, మన పనులకు, ప్రణాళికలకు అన్వయించుకున్న కాలం..మనకే పరిమితమైన ఒకానొక గణన సౌలభ్యం. కొండకోనల్లో పుట్టి.. ఏటవాలుగా ప్రవహించి.. సముద్రపు మహాలోగిలిలో కలిసిపోయే నదీనదాలను వాటి దారిన వాటిని పోనివ్వం మనం. ఆనకట్టలు కడతాం. కాలువలు తవ్వుతాం. పొలాలకు మళ్లిస్తాం. బంగారం పండిస్తాం. కాలం కూడా అంతే! మన ప్రమేయం లేకుంటే దాని మానాన అది పోతుంది. క్షణక్షణానికి క్షయమైపోతుంది. ఆ క్షణాన మనం ఏం చేశామో అదే మనకు మిగులుతుంది. పాత సంవత్సరం పోతూ పోతూ కొన్ని అనుభవాలను ఇచ్చింది. కొత్త సంవత్సరం వస్తూ వస్తూ కొన్ని సవాళ్లను మోసుకొస్తుంది. పాత అనుభవాల పునాది మీద కొత్త సమస్యలను అధిగమిస్తూ సాగిపోవడమే మన పని.
'హేపీ న్యూ ఇయర్' అని భూనభోంతరాలు దద్దరిల్లేలా స్వాగతించటం కేవలం మన సరదా. వచ్చీ రాగానే ఏ సంవత్సరమూ దానికదే సంతోషాలనో, విషాదాలనో వెంటబెట్టుకు రాదు. నిన్నటి నిజం మీదనే నేటి ఫలితం నిర్మితమవుతుంది. నేటి పునాది మీదే రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా మనచుట్టూ ఉన్న వాస్తవిక పరిస్థితులే రేపూ ఉంటాయి. అవి అలాగే కొనసాగాలా, మార్పేమన్నా తేవాలా అన్నది కాలం మీద ఆధారపడి ఉండదు. కాలం ఒడిలో సాగే మన ఆలోచనల మీద, ఆచరణ మీదా ఆధారపడి ఉంటుంది.
- మళ్లీ కోవిడ్ భయం!

నిన్నటి సమస్యలూ సంగతులూ కొత్త క్యాలెండరు తేదీల మీదుగా కవాతు చేస్తున్నాయి. రెండేళ్ల పాటు అనేక ఆవేదనలనూ ఆందోళనలనూ చవి చూపించిన కోవిడ్ నుంచి గతేడాది నెమ్మది నెమ్మదిగా జన జీవనం తెప్పరిల్లింది. కార్యకలాపాలన్నీ పుంజుకున్నాయి. అంతకంతకు పెరిగిన జీవన వ్యయం వేధిస్తూనే ఉంది. అయినప్పటికీ- క్రమంగా కోలుకోవొచ్చనే ధైర్యం ముందకు నడిపిస్తోంది. మళ్లీ ఇంతలోనే కోవిడ్ కలకలం మొదలైంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వైరస్ వ్యాపిస్తోంది. ఇది మరింత తీవ్రతరం కావొచ్చనే వార్తలూ వస్తున్నాయి. ఈ వార్తలు వింటున్నప్పుడు నిన్నటి విషాదాల, లాక్‌డౌన్ల భయమూ కలుగుతోంది. అనేక జాగ్రత్తల, వ్యాక్సిన్ల అనుభవమూ అభయమిస్తోంది. ఏదేమైనా గత అనుభవాల్లోంచి జాగురుకలమై ఉండడమే మన కర్తవ్యం. అలా అని గతంలో వలె తీవ్ర విజృంభణ, లాక్‌డౌన్లు ఉండకపోవొచ్చని నిపుణుల భరోసా.
2020 నాటి కోవిడ్ కాలం గతంలో లేని చాలా ఆరోగ్య జాగ్రత్తలు నేర్పింది. అనేక ఆయుధాలను సమకూర్చింది. అవసరాన్ని బట్టి వాటిన్నిటినీ అనుసరించొచ్చు. అప్పటి భద్రతా సూత్రాలను, ఆరోగ్య నియమాలనూ ఇప్పుడూ పాటించవొచ్చు. మనిషిని చూసి మనిషి పారిపోయేంత భయాన్నయితే కచ్చితంగా వదిలిపెట్టాలి. కోవిడ్ ప్రారంభ కాలంలో ఇలాంటి భయాలు సామాజికంగా అనేక సమస్యలను తెచ్చిపెట్టాయి. అదే సందర్భంలో అపూర్వమైన మానవత్వ పరిమళాలూ గుబాళించాయి. ఎంతోమంది ఎందరెందరికో అండగా నిలబడ్డారు. అనేక విధాల సహాయ సహకారాలు అందించారు. అలాంటి ఒరవడి సమాజానికి ఎప్పుడూ అవసరమే! పాలకుల వైఫల్యాలూ, మూఢత్వ ప్రచారాలూ ఆ కాలంలో చూశాం. వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికుల నిరంతర సేవలనూ చూశాం. కొన్ని కార్పొరేటు ఆసుపత్రుల ధనదాహం గమనించాం. ప్రభుత్వ వైద్యం ప్రాధాన్యతనూ తెలుసుకున్నాం. ప్రభుత్వాల పట్టనితనంపై సుప్రీంకోర్టు అనివార్య జోక్యాన్ని చూశాం. కష్టకాలంలో ప్రజలు సతమతం కావటాన్ని చూశాం. ఒకరినొకరు ఆదుకోవడం చూశాం. కుటుంబ సభ్యులందరూ కలిసి మెలసి ఉండగలగటం చూశాం. అదే సమయంలో కొన్ని ఇళ్లల్లో గృహహింస పెరగటాన్నీ చూశాం. మానవత్వంతో పరిమళించాల్సిన వైద్యం ప్రయివేటు రంగాన డబ్బుంటేనే అడ్మిషను అన్న దారుణ వాస్తవాన్నీ చూశాం.
ఇవన్నీ అనుభవాలు. మనం జాగ్రత్తగా ఉండటానికి కొంతమేర ఉపయోపడతాయి. ఎలాంటి సమాజం మనచుట్టూ నిర్మితమై ఉందో అర్థం చేసుకోవటానికి దోహదపడుతుంది. కోవిడ్ నాలుగో అల ముందుకు వస్తే ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో అంత ప్రభావమూ, ప్రమాదమూ ఉండకపోవొచ్చని కూడా ఆశావహంగా చెబుతున్నారు. పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నా ఈ సవాలును ఎదుర్కోవటానికి మనం సన్నద్ధం కావాల్సిందే!
- అవసరం మేరకే కొనాలి!

సంక్షోభ కాలంలో ప్రజల చేతిలో డబ్బు లభ్యత తగ్గుతుంది. కాబట్టి మార్కెట్లో సరుకుల అమ్మకం మందగిస్తుంది. ఎలాగైనా అమ్ముకోవాలనే వ్యాపార ఎత్తుగడ అనేక ఆఫర్ల రూపంలో తరచూ మన తలుపును తడుతూనే ఉంటుంది. క్రెడిట్ కార్డులు, ముందస్తు రుణాలు, విడతల వారీ చెల్లింపులు. తక్కువ ధరలు.. ఇలా ఏదొక పేరుతో ఆకర్షక వలయం మనచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వాటిలోని మంచిచెడ్డలను ఒకటికి పదిసార్లు సమీక్షించుకున్నాకనే నిర్ణయం తీసుకోవాలి. అవసరం మేరకే కొనాలి అన్న కఠిన నియమం పెట్టుకోవాలి. ఆరోగ్యం ప్రధానం కాబట్టి- దానిని కాపాడుకోవటానికి పోషకాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఆరోగ్యపరమైన అత్యవసరాలకు కొంత డబ్బు నిల్వ ఉంచుకోవాలి. ఏ కాలంలోనైనా ఇవి అవసరమే! సంక్షోభ కాలంలో మరీ అవసరం.
- ప్రణాళికే ప్రధానం

పాత సంవత్సరం పోతుంది. పోతే పోనీయండి. ఏడాది పొడవునా ప్రోది చేసుకున్న అనుభవాలను మాత్రం పోనీయకండి. నీరసాలూ, నిరుత్సాహాలూ వదిలేయండి. చేదులూ చెడ్డ అనుభవాలూ వడబోయండి. అన్నిటిలోంచి మంచి సారాంశం తీయండి. గత ఏడాది ప్రణాళిక ఉండే ఉంటుంది కదా.. ఒకసారి నెమరేయండి. ఏం చేసి ఏమి సాధించార? ఏం చూసి ఏమి నేర్చుకున్నాం? అసలు ఏమనుకున్నాం? ఆ దారిలో ఎంతవరకూ నడిచాం?
కొత్తలో ఏదైనా కొత్తగానే ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. కొత్త సంవత్సరం కూడా అంతే! ఈ ఏడాది ఫలానా పనులు చేయాలి. ఫలానా సాధించాలి... అనుకుంటాం. ఫలానా ఫలానా పుస్తకాలు చదవాలి, ఫలానా రాయాలి అనుకుంటాం. మొదట్లో కొద్ది రోజులు బాగానే నడుస్తుంది. రోజులు పాతగిల్లుతాయి. లక్ష్యాలు అటకెక్కుతాయి. రోజువారీ జీవితం ముందుకొచ్చి, అంతా తన ఆధీనంలోకి తీసేసుకుంటుంది. దైనందిన జీవితానికి ప్రత్యేకించి ప్రణాళిక అవసరం ఉండదు. రోజువారీ అవసరాలే దానిని ఎప్పటికప్పుడు నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా సాధించాలి అనుకున్న వాటికే ప్రణాళిక అవసరమవుతుంది. ప్రణాళిక అమలు చేయాలి అంటే - ప్రత్యేక శ్రద్ధా, కృషీ అవసరమవుతాయి. మరి అలాంటి ప్రయత్నం జరిగిందా?
''నిన్న నీది కాదు.
రేపటికి రూపు లేదు.
నేడే ఈనాడే నీది. ఈ క్షణమే నీది.
నీ ప్రయత్నం ఇప్పుడే మొదలెట్టు.
ఈ క్షణమే ఆరంభించు.'' అని పెద్దలు చెబుతారు. నిజమే ఇది.
దీనిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటే- సగం విజయం సాధించినట్టే మనం.

- మనకు మనమే అడ్డు
నిజానికి చాలా సందర్భాల్లో మన లక్ష్యాలకు మనమే ప్రధాన అడ్డంకి. చేయాలనుకున్న పని తక్షణావసరం కానప్పుడు వాయిదా వేస్తాం. రేపు చేయొచ్చు.. తరువాత చేయొచ్చు.. అనుకుంటాం. ఈరోజు చాలా పనులు ఉన్నాయి.. అని సమాధానం చెప్పుకుంటాం. తొలి పొరపాటు అక్కడే ఉంది. రోజూ చేయాల్సిన పనులు రోజూ ఉంటాయి. మన శ్రద్ధను బట్టి, అవసరాన్ని బట్టి జరిగిపోతూ ఉంటాయి. అంతకుమించిన ఫలితాలు, ప్రయోజనాలూ సాధించటానికి మాత్రమే ప్రత్యేక ప్రణాళిక, ప్రత్యేక శ్రద్ధా అవసరమవుతాయి. దానికి కూడా రోజూ సమయం కేటాయించాలి. అది రోజులో భాగం అవ్వాలి.. అప్పుడే మన లక్ష్యం లక్షణంగా ఉన్నట్టు.. అలాంటి పరిస్థితే మన లక్ష్యానికి అనువైన తొలి మెట్టు.
అనుకున్నవన్నీ అవ్వకపోవొచ్చు. కొన్నిటికి ఇతరుల తోడ్పాటు, పరిస్థితుల అనుకూలతా కావాలి. కానీ, అత్యధికం మనచేతిలోనే ఉంటాయి. మన చేతిలో ఉన్నది మనం చేయాలి. పరిపూర్ణంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. అప్పుడు బయటి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. మనం ఏమి చేయాలో, ఇతర పరిస్థితుల సహకారం ఎంతో మనకు తొలుతే స్పష్టత ఉండాలి. రంగాన్ని బట్టి, అవసరాన్ని బట్టి లక్ష్యాలు ఉంటాయి. అసలు ఈ ఏడాది మన లక్ష్యాలు ఏమిటి? మనసులో అనుకోవడం కాదు. ఒక కొత్త డైరీలో, మంచి నోట్‌బుక్‌లో రాసుకోవాలి.
ఈ ఏడాది ఏఏ పనులు చేయాలి?
చేయాలి అంటే ఏం కావాలి?
అందులో మనం ఏం చేయాలి? బయటి నుంచి మనకేం సహాయ సహకారాలు అవసరమవుతాయి? వాటిని సమకూర్చుకోవటానికి మనం ఏం చేయాలి? ఇలా విడివిడిగా ప్రతి ఒక్క అంశమూ క్షుణ్ణంగా రాసుకోవాలి. ఒక్కో లక్ష్యానికి ఒక్కో స్వభావం ఉంటుంది. ఒక్కో కాలవ్యవధి అవసరమవుతుంది. మీ లక్ష్యాల స్వభావం ఏమిటి? చేరటానికి పట్టే సమయం ఎంత? అనేదానిని స్పష్టపరుచుకోవాలి. తరువాత లక్ష్యాన్ని చేరే ప్రణాళిక రూపొందించుకోవాలి. దానినే లక్ష్యం చేరే దారి అనుకోవొచ్చు. రూట్‌మ్యాపు అనుకోవొచ్చు.
- లక్ష్యాన్ని ముక్కలుగా చేయాలి

లక్ష్యం పెద్దది అయినప్పుడు దానిని చిన్న చిన్నవిగా విభజించాలి. విద్యార్థి పాఠ్య పుస్తకాన్ని చాప్టర్లుగా విభజించినట్టు విడదీయాలి. నెలలవారీ, రోజువారీ, గంటలవారీగా నిర్దిష్ట లక్ష్యానికి నిర్దిష్ట కాలవ్యవధి పెట్టుకోవాలి. ఏళ్లపాటు శ్రమించి, ఒకేఒక్క వ్యక్తి కొండను తొలిచి.. ఊరికి రహదారి వేసిన అద్భుతం మనకు తెలుసు. కట్టెల మోపును మూకుమ్మడిగా కాక విడివిడిగా అయితే విరిచేయవచ్చు అన్న నీతికథ మనకు తెలుసు. అలాటి అనుభవాలను, మానవ విజయాలను అన్వయించుకోవటం మన సంకల్పానికి బలాన్నిస్తుంది.
- ఆచరణ అన్నిటికన్నా ముఖ్యం
ఇప్పుడు లక్ష్యం ఉంది. ప్రణాళికా ఉంది. దానిని అమల్లో పెట్టే ఆచరణ అన్నిటికన్నా ముఖ్యం. ప్రణాళికకు అనుగుణంగా మన పని ఉండాలి. మరవకుండా, వాయిదా వేయకుండా మనల్ని మనం నిరంతరం అప్రమత్తం చేసుకోవాలి. ఒక కాలవ్యవధిలో జరిగిన, జరుగుతున్న పనిని సమీక్షించుకోవాలి.
ఒకే ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యాపకం. అందరికీ విడివిడి లక్ష్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి లక్ష్యాలూ ఉంటాయి. వాటిపై స్పష్టత ఉండాలి. ఉమ్మడి లక్ష్యాల చేరికకు ఉమ్మడి కృషి అవసరం. వ్యక్తిగత లక్ష్యాల సాధనకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం. అందరి మధ్య సమన్వయం, సహకారం ఎలా ఉండాలో కూడా అనుకోవాలి. అందరి లక్ష్యాలు అందరికీ తెలియాలి. అప్పుడే ఎవరికి ఎలాంటి వాతావరణమూ, సహాయమూ కావాలో తెలుస్తుంది. ఇది ఒక ఇంటికి మాత్రమే కాదు; కార్యాలయ బృందాలకైనా, కళాశాల విద్యార్థులకైనా వర్తిస్తుంది.
ప్రపంచంలోని అందరికీ 24 గంటలే ఉంటాయి. కొందరు వారి వారి రంగాల్లో ఎంతెంతో సాధిస్తారు. ఇతర విషయాల్లోనూ వెనకబడకుండా పురోగమిస్తారు. సాధకులకు, సామాన్యులకు మధ్య తేడా ఇదే! సాధకులు ప్రతి క్షణాన్ని తమ లక్ష్యం వైపు నడిపిస్తారు. విజయాన్ని సాధిస్తారు. సామాన్యులు ఏం జరిగితే దానిలో మునిగి తేలతారు.. బిజీ అయిపోతారు. కాలాన్ని తమకు అనుకూలంగా, అనుగుణంగా మార్చుకున్నవారు విజేతలవుతారు.
- సౌలభ్యం కోసమే ఇంగ్లీషు క్యాలెండరు!

ప్రపంచం మొత్తం ఇప్పట్లా అనుసంధానమై లేనప్పుడు ఎవరి క్యాలెండర్లు వారికి ఉండేవి. ఒక దేశంతో మరొక దేశానికి వ్యాపార వ్యవహారాల్లో సంబంధాలు ఏర్పడ్డాక- ఒకే తరహా కాలగణన అనివార్యమైంది. అలాంటి అవసరాల్లోంచే ప్రపంచదేశాలన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అంగీకరించాయి. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న క్యాలెండరే గ్రెగోరియన్ క్యాలెండరు. ఇందులో ఏడాదికి 365.25 రోజులు ఉంటాయి. మామూలుగా సంవత్సరానికి 365 రోజులే లెక్కిస్తాం. మిగిలిన పావు రోజు నాలుగేళ్లకొకసారి పూర్తి రోజుగా లెక్కపెట్టి - దానిని ఫిబ్రవరి 29వ రోజుగా క్యాలెండర్లో చేరుస్తారు. 29 రోజుల ఫిబ్రవరి నెల ఉన్న సంవత్సరాన్ని లీఫు సంవత్సరంగా పిలుస్తారు. 4 చేత నిశ్శేషంగా భాగించబడే ప్రతి సంవత్సరం లీఫు సంవత్సరమే అవుతుంది. 2020,2024 లీఫు సంవత్సరాలు.
ఇంగ్లీష్ క్యాలెండర్‌లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లోని ధ్వని మన సంస్క ృత పదాలకు దగ్గరగా ఉంటాయి. దశమాన పద్ధతిలో తొలుత ఏడాదికి పది నెలలే ఉండేవి. చంద్రుడి హెచ్చుతగ్గుల ఆధారంగా నెలకు 30 రోజులుగా పరిగణించి, ఏడాదికి పది నెలలుగా భావిస్తే ఋతువుల ఆగమనంలో వ్యత్యాసం కనిపించింది. దీంతో, సూర్యుడి గమనాన్ని పరిగణనలోకి తీసుకొని ఏడాదికి 365 రోజులుగా లెక్కించారు. మరో రెండు నెలలను కొత్తగా చేర్చారు. ఆ సర్దుబాటులో - 7, 8, 9, 10 నెలలుగా ఉన్న సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలు 9, 10, 11, 12 స్థానాల్లోకి వచ్చాయి. పోప్ గ్రెగరీ -30, 1572లో చక్రవర్తిగా ఎన్నికైనప్పుడు ఈ క్యాలెండర్ మార్పు జరిగింది. అప్పటివరకూ జూలియన్ క్యాలెండర్ అమల్లో ఉండేది.
గ్రెగరీ క్యాలెండర్ ఇప్పుడు అంతర్జాతీయంగా అమల్లో ఉంది. ఈ మార్పుని ముందుగా ఐరోపా ఖండంలోని క్యాథలిక్ దేశాలు అంగీకరించాయి. ప్రొటెస్టంట్లు, మరికొన్ని దేశాలు అంగీకరించడానికి చాలాకాలమే పట్టింది. ఈ క్యాలెండర్‌ని ఆఖరిగా 1923లో అంగీకరించిన దేశం గ్రీస్. మన దేశంలో వివిధ శకాల ఆధారంగా స్థానికంగా క్యాలెండర్లు ఉన్నాయి. మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, ఆంధ్ర ప్రాంతాలకు వేర్వేరు సంవత్సరాదులు ఉన్నాయి. ఇవి స్థానికంగా సంప్రదాయాలే తప్ప విశాల ప్రాంతాల ఉమ్మడి కాలగణనకు ఉపయోగపడవు. ఇంగ్లీషు క్యాలెండరు కాలగణనకు సౌలభ్యంగా ఉంటుంది. సంప్రదాయం పేరిట దానికి నిరాకరించటం ఆచరణరీత్యా సాధ్యం కాదు; చాదస్తంగా మిగలటం తప్ప!
- ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం

కోవిడ్ కన్నా ప్రమాదకరమైన పరిణామం ఇది. దాదాపు అన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలూ కొంతకాలంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై అంచనాలు ప్రకటిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం పెరగొచ్చని, ఆర్థిక వృద్ధి మరింత క్షీణించవచ్చని వాటి అధ్యయనాల సారాంశం! కోవిడ్ ముందు నుంచీ ఈ పరిస్థితి ఉంది. దాని నుంచి ప్రపంచం బయటపడకముందే కోవిడ్ రంగప్రవేశం చేసి, ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. దాంతో సంబంధం లేకుండానే నేడు అనేక దేశాలను సంక్షోభం పట్టి పీడిస్తోంది. ఒకపక్క ప్రజల ఆదాయాలు, నిజ వేతనాలు తగ్గిపోయాయి. కార్పొరేట్లు ఏమో కోవిడ్ కష్టకాలంలోనూ వివిధ రూపాల్లో గణనీయమైన లాభాలను ఆర్జించాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి! సామాన్య జనం కోట్లాదిగా ఇక్కట్లలో కూరుకుపోతుంటే - కొద్దిపాటి సంపన్న గణం అంతకంతకూ సహస్ర కోటీశ్వర్లు కావడం పెట్టుబడి సృష్టించే పెను వైరుధ్యం!
ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చని సాక్షాత్తూ అమెజాన్ సిఇఒనే ప్రజలను హెచ్చరిస్తూ ఆ మధ్య ఒక ప్రకటన చేశారు. 'కార్లు, టీవీలు వంటి వాటికి అనవసర ఖర్చు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సంక్షోభం మరింత పెరగొచ్చు!' అని పేర్కొన్నాడు. ఆ తరువాత అమెజాన్‌తో సహా అనేక సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు మొదలైంది! ఈ ధోరణి ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది. కోవిడ్‌లోనూ, ఆ తర్వాతా దాదాపు 20 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది జీతాలపై కోత పడింది. నిత్యావసరాల ధరలేమో ఈ మూడేళ్లలో 50 నుంచి 150 శాతం దాకా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక అంశాల్లో చాలా జాగ్రత్త అవసరం. పెద్ద పెద్ద ఖర్చుల్లో ఇరుక్కోకుండా ఉండడమే వేతన జీవులకు, సామాన్యులకు తాత్కాలిక మార్గం.
కోవిడ్ అనంతరం మనదేశంలో కొన్ని గ్రామీణ ప్రాంత స్వయం ఉపాధి కార్యకలాపాలు పెరిగాయి. కొన్ని నిలదొక్కుకుంటే- కొన్ని దివాళా తీస్తున్నాయి. సమతుల్యతను పాటించే ప్రత్యామ్నాయ ఉపాధి వైపు ఆలోచన సాగించాలి. ఆర్థిక భారాల నుంచి బయటపడటానికి జాగ్రత్త అనేది ఒక చిన్న చర్య మాత్రమే! మొత్తంగా సంక్షోభం నుంచి బయట పడాలంటే- ప్రభుత్వాల ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి. కార్పొరేటు సంస్థలను పెంచి, పోషించే ఏకపక్ష విధానాలకు స్వస్తి చెప్పాలి. ఆ పనిని పాలకులు తమకు తాముగా చేయరు. పైగా వారికి అనుగుణంగా చట్టాలను, విధానాలను మార్చుకుంటూ వెళతారు. ప్రజలే అడ్డుకోవాలి. ఆ చైతన్యం అందరూ ప్రదర్శించినప్పుడే ఆర్థిక సంక్షోభాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రజా సంక్షేమానికి మంచిదారి ఏర్పడుతుంది.
గతించిన కాలం మళ్లీ వెనక్కి రాదు. నడుస్తున్న కాలమే మనది. గతాన్ని ఒక అనుభవంగా తీసుకొని.. వర్తమానాన్ని చక్కదిద్దుకోవటమే సరైన పని. తప్పొప్పులను కాలం మీదికి నెట్టేయకుండా.. ఆ కాలంలోనే ఉండి మనల్ని నిర్దేశిస్తున్న, నియంత్రిస్తున్న శక్తుల మీద దృష్టి పెట్టాలి. కూడవల్సిన వాళ్లం కూడి.. నినదించాల్సిన దానిని నినదించి.. మార్చాల్సిన దానిని మార్చటం కోసం ఉమ్మడిగా కదం తొక్కాలి. అప్పుడే అసలు సిసలు హ్యాపీ న్యూ ఇయర్! అంతదాకా మాత్రం వచ్చి పోయిన అనేక ఏళ్లులాగానే ఇది మరొక న్యూ ఇయర్ ..!
శాంతిమిత్ర
9490099167