Jul 28,2023 07:07

          ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు ముసుగు తొలగించి బాహాటంగా న్యాయవ్యవస్థపై దాడికి దిగారు. ఏడు మాసాలుగా దేశమంతటా పెద్దయెత్తున కొనసాగుతున్న నిరసనలు,ఆందోళనలను, అంతర్జాతీయ సమాజం చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ న్యాయ వ్యవస్థను నిర్వీర్యం గావించే సంస్కరణల బిల్లును ప్రతిపక్షాల బారుకాట్‌ మధ్య నెసెట్‌ (పార్లమెంటు)లో ఆమోదింపజేసుకున్న తీరు ఈ యూదు దురహంకార నేత నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోంది. దీనికి వ్యతిరేకంగా బిల్లు ఆమోదించిన రోజునే పార్లమెంటు వెలుపల పది వేల మందితో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. అంతకుముందు వరుసగా రెండు రోజుల పాటు దేశ వ్యాపితంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి బిల్లును వెనక్కి తీసుకోవాలని నినదించారు. తాజాగా డాక్టర్లు, ఆర్మీ రిజర్విస్టులు సమ్మెకు దిగారు. పత్రికలు ఎడిటోరియల్‌ పేజీని నల్ల రంగుతో ప్రచురించాయి. ఈ నిరసనలు అంతర్యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 75 ఏళ్లుగా పాలస్తీనాపై దురాక్రమణ సాగిస్తూ, పాలస్తీనీయులను తమ సొంతగడ్డపై శరణార్థులుగా మార్చిన నెతన్యాహు అవినీతి కుంభకోణాల్లోనూ పీకల్లోతున కూరుకుపోయాడు. పాలస్తీనీయులను ఊచకోత కోసినా, తన అవినీతి భాగోతాలను ఎవరు ప్రశ్నించినా సహించలేకపోతున్నాడు. పాపాల భైరవుడిగా పేరొందిన ఈ యూదు దురహంకార నేత పై కేసులన్నీ నిష్షాక్షికంగా విచారిస్తే వందేళ్లకుపైగానే జైలు శిక్ష పడుతుంది.కోర్టు అధికారాలను హరించడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. వివాదాస్పద బిల్లు చట్టంగా మారినందున ఇకపై రాజ్యాంగపరమైన ఉన్నత పదవుల్లో క్రిమినల్స్‌ను యథేచ్ఛగా నియమించుకోవచ్చు, తన తాబేదారులను న్యాయమూర్తులుగా ప్రతిష్టించవచ్చు.. తనపై ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అవినీతి, అక్రమార్జన, మోసం వంటి క్రిమినల్‌ కేసుల నుంచి బయటపడి,అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండొచ్చు, నెతన్యాహు ఇంత బాహాటంగా ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుంటే అమెరికా కిమ్మనడం లేదు. ఐరాసలో ఇజ్రాయిల్‌ దాష్టీకాలకు వ్యతిరేకంగా తీర్మానం వచ్చిన ప్రతి సందర్భంలోను దానికి మోకాలడ్డిన చరిత్ర అగ్రరాజ్యానిది. న్యాయవ్యవస్థపై దాడి చేసిన నెతన్యాహుకు ఇటీవల వైట్‌ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌ ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలకడాన్ని ఏమనుకోవాలి? అసలు ఇజ్రాయిల్‌ పుట్టుకే విచిత్రమైనది.1948లో అమెరికా, మరి కొన్ని యూరప్‌ దేశాలు ప్రపంచవ్యాపితంగా ఉన్న యూదులకు ఒక దేశం అంటూ లేదని, పాలస్తీనా భూ భాగంలోని ఒక చిన్న ప్రదేశంలో దీనిని నెలకొల్పారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇజ్రాయిల్‌ పాలస్తీనా భూ భాగాలను ఒకదాని తరువాత ఒకటి ఆక్రమించుకుంటోంది. ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకుంటూ, ప్రత్యర్థి దేశాలపై ఆంక్షలు మీద ఆంక్షలు విధించే అమెరికా, ఇజ్రాయిల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మన్ను తిన్న పాములా మిన్నకుండిపోయింది. అగ్రరాజ్య ద్వంద్వ వైఖరికి ఇదొక నిదర్శనం.
          ఆర్మీ రిజర్విస్టులు దీనిని వ్యతిరేకిస్తుండడంతో తమ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదముందని గ్రహించిన ఇజ్రాయిలీ కార్పొరేట్‌ శక్తులు ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నించాయి. ఇజ్రాయిల్‌లో ఆర్మీ రిజర్విస్టుల సమ్మె నెతన్యాహును ఎక్కువగా కలవరపరుస్తున్నది. మోడీ ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టిన అగ్ని వీర్‌ లాంటివారే ఈ ఆర్మీ రిజర్విస్టులు. ఆర్మీలో తర్ఫీదు పొందిన ఈ యూదు యువకులను సంవత్సరానికొకసారి కాంట్రాక్టు పద్ధతిలో ఆర్మీ వినియోగించు కుంటుంది. .న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా ఇప్పుడు సమ్మెలో ఉన్నారు. వీరి సహకారం లేకుంటే పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌ను పూర్తిగా ఆక్రమించుకోవడానికి, అలాగే ఇరాన్‌, సిరియా భూ భాగాల ఆక్రమణకు నెతన్యాహు ప్రభుత్వం పన్నిన పన్నాగాలు పారవు.
           ఇజ్రాయిల్‌ పరిణామాలు భారత్‌లో చాలా మందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నెతన్యాహును రోల్‌ మోడల్‌గా తీసుకుని ఇక్కడ నరేంద్ర మోడీ న్యాయవ్యవస్థను అణగదొక్కే యత్నాలు చేస్తున్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు యూదు దురహంకారాన్ని రెచ్చగొడుతూ, అరబ్బులను ద్వితీయ శ్రేణి పౌరులుగా నెతన్యాహు పరిగణిస్తుంటే, ఇక్కడ మోడీ కూడా అదే మాదిరిగా మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ, మైనార్టీలపై దాడులకు దిగుతున్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ఘోరాలు దీనినే సూచిస్తున్నాయి. అవినీతి, కుంభ కోణాలు, మోసాల్లో ఇద్దరూ ఇద్దరే. ప్రతిపక్షాలపైన, తన రాజకీయ ప్రత్యర్థులపైన, అనుమానమున్న స్వపక్షీయులపైన నిఘా వేసేందుకు ఇజ్రాయిల్‌ నుంచి పెగాసస్‌ పరికరాలను, ఆయుధాలను మోడీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వీరిరువురి మధ్య ఇలాంటివే అనేక సారూప్యతలున్నాయి. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై దాడికి ఇప్పటికే ఒకసారి మోడీ ప్రభుత్వం విఫల యత్నం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఆర్టినెన్స్‌ తీసుకొచ్చిన విషయాన్ని మరచిపోలేం. ఇజ్రాయిల్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రతిఘటన లాంటిదే భారత్‌లోనూ రావాలి. భారత్‌ను మరో ఇజ్రాయిల్‌గా మార్చే మోడీ యత్నాల పట్ల సదా అప్రమత్తత అవసరం.