Oct 15,2022 07:15

ప్రతీ విషయంలో నేతాజీకి భిన్నంగా ఆలోచించేవారు...ఆయన వారసత్వాన్ని ఉపయోగించుకుంటామంటే అది పూర్తిగా అసాధ్యమైన విషయం. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా స్వేచ్ఛను కోరుకున్న ఈ దేశ స్త్రీపురుషుల హృదయాల్లో, మనసుల్లోనే ఆయన కొలువై వుంటారు. అంతేకానీ ఆయన భావాలను పంచుకోని వారిలో...ఆయన కీర్తి పతిష్టలను సొంతం చేసుకోవాలని ఆరాటపడే వారి హృదయాల్లో మాత్రం కాదు.

అందమైన పిల్లల్ని కనాలనుకునే, అల్లరి చిల్లరగా తిరిగే ఓ అనాకారి పక్షి కథ ఒకటి నా చిన్నతనంలో విన్నట్లు గుర్తు. అప్పుడే గుడ్లు పెట్టిన ఓ అందమైన పక్షి గూటి లోకి దొంగచాటుగా దూరి ఒక గుడ్డును దొంగిలిస్తుందా తుంటరి పక్షి. తర్వాత తన సొంత గూటికి చేరి ఆ గుడ్డును పొదగడంతో అందమైన పక్షి పిల్ల బయటికి వస్తుంది.
       మన ప్రధానమంత్రి సెప్టెంబర్‌ 8వ తేదీన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించినపుడు నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. తమ స్వంత సంఫ్‌ు పరివార్‌లో స్వాతంత్య్ర సమరయోధులు లేని లోటును...ప్రజల దృష్టిలో సావర్కర్‌ను ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధునిగా నిలబెట్టడంలో ఏమాత్రం సఫలీకృతం కాని లోటును...పూడ్చే ప్రయత్నమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ప్రధాని ఆగస్ట్‌ 15న ఎర్రకోట ప్రాకారాల నుండి, సుభాష్‌ చంద్రబోస్‌తో పాటు సావర్కర్‌ను కూడా గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడుగా పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా వారి పార్టీకి చెందిన వారు, సంఫ్‌ు పరివార్‌ సభ్యులు, సుభాష్‌ చంద్రబోస్‌, సావర్కర్‌ ఫోటోలున్న బ్యానర్లను ప్రదర్శించారు (అండమాన్‌ జైలులో జీవిత ఖైదు విధించబడిన సావర్కర్‌, తనకు క్షమాభిక్ష పెట్టాలని బ్రిటిష్‌ వారిని వేడుకుంటూ, విడుదలైతే వారికి అత్యంత విధేయంగా సేవలు చేసుకుంటానని ఉత్తరాలు రాశాడు).
     బ్రిటిష్‌ వారికి చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు సావర్కర్‌ చాలా కష్టపడ్డాడనీ, జాతీయోద్యమాన్ని, దానితో సంబంధం ఉన్న వారిని తీవ్రంగా విమర్శించడమే కాక, హిందూ ముస్లిం మత విభజనను మరింత ఎక్కువ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడనేది రహస్యమేమీ కాదు. ''ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ హిందూత్వ'' అనే తన రచనలో... భారతదేశం ''పుణ్యభూమి'' లేదా ''పవిత్ర భూమి''గా లేనటువంటి ముస్లింలు, క్రైస్తవులకు పౌరసత్వంలో సమానమైన హక్కులను నిరాకరించాలనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. సంఫ్‌ు పరివార్‌ పక్షీయులు హిందూత్వను తమ రాజకీయ సిద్ధాంతంగా స్వీకరించారు.
        నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌పై సావర్కర్‌ ప్రత్యేకమైన ఆగ్రహాన్ని ప్రదర్శించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన నేతాజీని ''జీహాదీ హిందూ'' అని పేర్కొన్నాడు. హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహించేందుకు అనేక చిహ్నాలను స్వీకరించడానికి సిద్ధపడ్డాడని నేతాజీని తీవ్రంగా విమర్శించాడు. ఉదాహరణకు, ''ఇత్‌మద్‌, ఇత్తేహాద్‌, ఖుర్బానీ'' ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ నినాదంగా ఉంది.
         ప్రధానమంత్రి పాల్గొన్న నేతాజీ విగ్రహావిష్కరణలో బ్రహ్మాండమైన ప్రణాళికను రూపొందించారు. దేనినీ వదిలిపెట్టలేదు. ఆయన పైన, విగ్రహం పైనే దృష్టంతా కేంద్రీకరించబడింది. భారత రాష్ట్రపతి గానీ, మోడీ సహచర మంత్రివర్గ సభ్యులు గానీ, ఆఖరికి సుభాష్‌ చంద్రబోస్‌ కూతురు అనితా ప్ఫాఫ్‌ గానీ, బోస్‌ కుటుంబ సభ్యులు గానీ, ఏ ఒక్కరూ దానిలో భాగస్వాములు కాలేదు. కేవలం ప్రధానమంత్రి, విగ్రహం మాత్రమే ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే ప్రజల మనసుల్లో వీరిరువురిని నిలిపేందుకు ఇది కూడా సరిపోవడం లేదు.
       సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని చూసేందుకు ప్రతీరోజూ ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సాయంకాల సమయంలో ప్రజలు విగ్రహం చుట్టూ గుంపులు గుంపులుగా చేరడంతో దానిని చూడడం కష్టతరంగా ఉంది. 'సుభాష్‌ చంద్రబోస్‌ను చీకటి నుండి బయటకు తీసుకొని వచ్చి, మోడీ తన బాకీ తీర్చుకుంటున్నాడని మీరు అనుకున్నారా?' అని నేతాజీ కుమార్తె అనితను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికామె కొద్దిసేపు ఆలోచించి, 'అది నిజమని నేననుకోవడం లేదు. సుభాష్‌ చంద్రబోస్‌ ఎప్పటికీ ఈ దేశంలోని స్త్రీ,పురుషుల హృదయాల్లో కొలువై ఉన్నాడు. దేశంలోని ప్రతీ మూలలో ప్రజలు ఆయన్ను ఎంతగా గౌరవించారో, ఎంతగా ప్రేమించారో తలచుకుంటే నాకు ఎప్పటికీ ఆశ్చర్యంగానే వుంటుంది' అన్నారు.
       ఇది అనేకమంది ధ్రువీకరించే వాస్తవం. సుభాష్‌ చంద్రబోస్‌ ధైర్యం, వలస పాలన అణచివేత నుండి ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఆయన సంకల్పం, ఆయన అకాల మరణం, అనేకమంది భారతీయుల దృష్టిలో ఆయనను ఒక నాయకుడిగా నిలిపాయి. నేతాజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే తపన అనేకమందిలో మరింతగా పెరిగింది. భారీ స్పందనతో ఆయన ఆత్మ కథ అనేక పర్యాయాలు ప్రచురణ అయ్యింది. అనేక భాషల్లో, అనేక పత్రికలలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆయన గురించి వ్యాసాలను ప్రచురించారు. ప్రజలు ఆయన ప్రసంగాలను వింటున్నారు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో నేతాజీతో కలిసి పని చేసిన నేతల ద్వారా ఆయన విశ్వాసాలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చేసిన సేవల గురించి ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 

                                                                                జైహింద్‌ నినాదం

''జైహింద్‌'' నినాదాన్ని తీసుకొచ్చిందెవరు? అని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. కలకత్తాలో హౌస్‌ అరెస్ట్‌ నుండి నాటకీయంగా తప్పించుకొని జర్మనీ చేరుకున్న సుభాష్‌ చంద్రబోస్‌ కు వ్యక్తిగత కార్యదర్శి అయిన అబీద్‌ హసన్‌ ఆ నినాదాన్ని తీసుకొచ్చాడని తెలిసి వారు ఆశ్చర్యపోతున్నారు. జర్మనీ నుండి జపాన్‌ వరకు జలాంతర్గామి ద్వారా సాగిన సుదీర్ఘ, ప్రమాదకర ప్రయాణంలో నేతాజీకి తోడుగా ఉన్నారాయన. ఆసియా వచ్చిన తర్వాత కూడా అబీద్‌ హసన్‌ను తనతోనే తనుండే ఇంట్లోనే వుండమని నేతాజీ ఒత్తిడి చేసేవారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలా సింగపూర్‌, బ్యాంకాక్‌, టోక్యో, బర్మా లో నేతాజీతోనే కలిసి నివసించాడాయన. మన ప్రధానమంత్రి ఇలాంటిదేదో చేస్తారని ఊహించడం కష్టం. అదే విధంగా లౌకికతత్వం పట్ల సుభాష్‌ చంద్రబోస్‌కు ఉన్న అవగాహనను మన ప్రధాని అంగీకరిస్తారని ఊహించడం కూడా అసాధ్యమే.
       హసన్‌ ఇచ్చిన ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూను సుభాష్‌ చంద్రబోస్‌ మేనల్లుడైన సిసిర్‌ బోస్‌ భార్య కృష్ణ బోస్‌ రికార్డ్‌ చేశారు. ఆమె ఆ ఇంటర్వ్యూ సమగ్ర నివేదికను రాసి, ప్రచురించారు. ఇప్పుడది ''నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితం, రాజకీయాలు, పోరాటాలు'' పేరుతో వ్యాస సంపుటిగా ప్రచురించబడింది.
          ఇండియన్‌ లెజియన్‌ ఏర్పాటు చేయడానికి జర్మనీ లోని భారతీయ యుద్ధ ఖైదీలను సుభాష్‌ చంద్రబోస్‌ నియమించాడనీ, తనతో పాటు యుద్ధ ఖైదీలు అనేకమందిని ప్రత్యేక శిక్షణ కోసం పంపించారని కృష్ణ బోస్‌కు అబీద్‌ హసన్‌ చెప్పాడు. కృష్ణ బోస్‌ కథనం ఇంకా ఇలా సాగుతుంది... ''ఇండియన్‌ లెజియన్‌ క్యాంపుల్లో సైనికుల కోసం ప్రార్థనా స్థలాలుండేవి. సైనికులు వారికిష్టం వచ్చిన రీతిలో వ్యక్తిగతంగా లేదా అందరూ కలిసి ఒక చిన్న గుడిలో లేదా మసీదులో లేదా గురుద్వారా లేదా చర్చిలో ప్రార్థన చేసుకోవచ్చు. కొందరు సైనికులు ఒక ప్రతిపాదనతో అబీద్‌ హసన్‌ దగ్గరకు వెళ్ళారు. వేర్వేరు సమూహాలుగా ప్రార్థనలు చేసేకంటే అందరూ కలిసి ప్రార్థన చెయ్యాలని భావించడంతో ఆయన సంతోషపడ్డాడు. తరువాత సైనికులంతా కలిసి కూర్చొని, దేవుని ప్రార్థించేందుకు ఒక ప్రార్థనను కూర్పు చేశారు. తరువాత క్యాంపును బోస్‌ సందర్శించినప్పుడు పురుషులంతా ప్రార్థన చెయ్యాలని నిర్ణయించారు. సందర్శన ముగింపులో సైనికులు నేతాజీ ముందు నిలబడి సగర్వంగా ఉమ్మడి ప్రార్థనను ఆలపించారు. నేతాజీ ఏమీ స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత వ్యక్తిగతంగా కలిసేందుకు అబీద్‌ హసన్‌ను పిలిపించారు. అబీద్‌ గదిలోకి ప్రవేశించగానే 'ఏంటీ? అర్థంపర్థం లేని పని మొదలుపెట్టావ'ని నేతాజీ అడిగాడు''.
 

                                                                       మత విశ్వాసం వ్యక్తిగతమైనది

భారతీయుల్ని ఈ విధంగా ఐక్యం చెయ్యడం లోపభూయిష్టమైనది, వెంటనే దీనిని నిలిపి వేయాలని నేతాజీ అబీద్‌తో గట్టిగా చెప్పాడు. వ్యక్తులకు మత విశ్వాసం అనేది వ్యక్తిగతమైన విషయం. వారి రాజకీయ ఉద్యమాల్లో మతం ఎలాంటి పాత్రను పోషించకూడదు. భారత జాతీయవాదం మతపరమైన గుర్తింపులను, భావోద్వేగాలను అధిగమించాలి. సర్వమతాల సంఘీభావ తత్వశాస్త్రంపైన లేదా భిన్న మతాల అంగీకార కథనాల పునాదుల పైన భారత జాతీయవాదం ఆధారపడకూడదని నేతాజీ నొక్కి వక్కాణించాడు. ''నేడు మీరంతా ఐక్యం అయ్యేందుకు మతాన్ని ఉపయోగిస్తున్నారంటే... ఇలాంటి భావోద్వేగాలను ఉపయోగించడం ద్వారా రేపు విభజన విత్తనాలు చల్లే వాడికి కూడా మీరు తలుపులు తెలుస్తున్నార''ని నేతాజీ అబీద్‌ కు చెప్పాడు.
           ఎలాంటి మతపరమైన భావనలు సూచించని విధంగా భారతీయులందరికీ ఆమోదయోగ్యమైన నినాదం గురించి అబీద్‌ హసన్‌ ఆలోచన చేసేందుకు ఈ ఘటన తోడ్పడింది. అలా వచ్చినదే ''జైహింద్‌''. ప్రజాదరణ పొందిన ఆ జైహిందే నేటికీ నిలిచి ఉంది. దశాబ్దాల క్రితం ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ సైనికులు, అధికారులు మతపరమైన భావనలను సూచించని జైహింద్‌ను ఉపయోగించి నట్లే...మిలిటరీలో పని చేస్తున్నవారు, పోలీసులు తమ పైఅధికారులకు సెల్యూట్‌ చేస్తున్న సమయంలో ''జైహింద్‌''ను ఉపయోగిస్తున్నారు.
            నా చిన్నతనంలో విన్న కథలో తుంటరి పక్షి ...అందమైన పక్షి గూటి నుండి గుడ్డు దొంగిలించి, పొదుగుతుంది. ఈ ప్రపంచంలోకి అడుగెట్టిన పిల్ల పక్షి రెక్కలు వచ్చాక... మోసకారి పక్షిని వీడి...తన అసలు కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
అదేవిధంగా, ప్రతీ విషయంలో నేతాజీకి భిన్నంగా ఆలోచించేవారు...ఆయన వారసత్వాన్ని ఉపయోగించుకుంటామంటే అది పూర్తిగా అసాధ్యమైన విషయం. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా స్వేచ్ఛను కోరుకున్న ఈ దేశ స్త్రీపురుషుల హృదయాల్లో, మనసుల్లోనే ఆయన కొలువై వుంటారు. అంతేకానీ ఆయన భావాలను పంచుకోని వారిలో...ఆయన కీర్తి పతిష్టలను సొంతం చేసుకోవాలని ఆరాటపడే వారి హృదయాల్లో మాత్రం కాదు.

(వ్యాసకర్త : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు)
సుభాషిణీ ఆలీ

సుభాషిణీ ఆలీ