మంచిమిత్రుల మనసు ముంగిట
చిలుక పలుకుల చిన్నారులమవుదాం
కుటుంబ బంధాల గంధాన్ని పులుముకొని
ఆత్మీయుల స్పర్శలో ఆమనై పోదాం మొక్కలను పువ్వులను
ప్రేమతో అభిషేకిద్దాం
పండుటాకులను మనసు స్పర్శతో పలకరిద్దాం
గతి తప్పిన, మతి తప్పిన గుడ్డి నక్షత్రాల ముంగిట
సంస్కృతీ, సాంప్రదాయాల తోరణాలు కడదాం
అనుబంధాల అత్తరు రాద్దాం
మానవత్వపు గంధం పూద్దాం
రండి..ఇటువైపు రండి..
ఓసారిలా రండి
పీడితుల జీవితంపై ప్రేమపన్నీరు చల్లుదాం
మమతను, మానవతను వర్షిద్దాం
కుల మతాల చెత్తను
మానవత్వం గొయ్యిలో పాతిపెడదాం
కణకణమండేఅస్పృశ్యత..అసమానతల నిప్పుల కొలిమిని
అక్షరాల ఉప్పెనతో ఆర్పేద్దాం
దోపిడీ వ్యవస్థ పంకిలాన్ని
కవి గుండె కలంతో కడిగేద్దాం!
డి.కె.చదువులబాబు
9440703716