Dec 13,2022 07:34

ప్రస్తుతం ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతున్న చోట్ల పని చేస్తున్న కార్మిక వర్గం అంతర్జాతీయంగా సంఘటితంగా లేకపోవడం పెట్టుబడికి అనుకూలంగా పని చేస్తున్న అంశం. అందువల్లనే పెట్టుబడి ప్రతీ ఉత్పత్తి ప్రదేశంలోనూ కార్మికుల సమరశీలత స్థాయిని కనిష్టంగా ఉంచగలుగుతోంది.

నయా ఉదారవాదం కార్మికోద్యమ సంఘటిత శక్తిని ఒకవైపు దెబ్బ తీస్తున్నా, కార్మికుల ప్రతిఘటన పెరుగుతూ వుంది. ఇదే విశేషం.

కోవిడ్‌ వ్యవహారం కాని, ఉక్రెయిన్‌ యుద్ధం కాని నయా ఉదారవాద విధానాల అమలు కారణంగానే తలెత్తాయి తప్ప ఆ విధానాలతో నిమిత్తం లేకుండా పుట్టుకొచ్చినవి కావు.


యా ఉదారవాద విధానాల అమలు ఒకసారి మొదలవగానే, అది ఎక్కడికక్కడ బలాబలాల పొందికను కార్మిక వర్గానికి ప్రతికూలంగా మార్చేందుకు దారి తీస్తుంది. ఈ మార్పులు సద్యోజనితంగా (స్పాంటేనియస్‌గా) జరుగుతూంటాయి. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిది: పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా సంచరించగలిగినా, కార్మికవర్గం అదే విధంగా సంచరించలేకపోవడం. దీనివలన ఆ పెట్టుబడి ఒక దేశపు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా మరో దేశపు కార్మిక వర్గాన్ని పోటీ పెట్టగలుగుతుంది. ఒక దేశంలోని కార్మికవర్గం సమ్మె పోరాటానికి దిగితే, పెట్టుబడి తన ఉత్పత్తి కార్యకలాపాలను మరో దేశానికి తరలించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పెట్టుబడి మరో దేశానికి తరలిపోయే ప్రమాదం ఉంది అన్న బెదిరింపుతోటే కార్మికవర్గపు సమరశీలతను అన్ని దేశాల్లోనూ దెబ్బ తీయగలిగే వీలు ఉంటుంది.
            కార్మికులు గనుక అంతర్జాతీయంగా సంఘటితపడి వుంటే, తమ సమ్మె పోరాటాలను ఏ ఒక్క దేశానికో గాక అంతర్జాతీయంగా పలు దేశాలకు విస్తరింపజేయగలిగితే, అప్పుడు కార్మికవర్గాన్ని బెదిరించగల శక్తి పెట్టుబడికి అంతగా ఉండదు. అసలు కార్మికోద్యమమే ఉనికిలో లేని ఏదో ఒక కొత్త ప్రదేశానికి తమ ఉత్పత్తి కార్యకలాపాలను తరలించుకుపోతాం అని అప్పుడు కూడా బెదిరించవచ్చు. కాని ఆ విధంగా చేయడం పెట్టుబడికి చాలా ఇబ్బందులతో కూడుకున్న విషయం. ప్రస్తుతం ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతున్న చోట్ల పని చేస్తున్న కార్మిక వర్గం అంతర్జాతీయంగా సంఘటితంగా లేకపోవడం పెట్టుబడికి అనుకూలంగా పని చేస్తున్న అంశం. అందువల్లనే పెట్టుబడి ప్రతీ ఉత్పత్తి ప్రదేశంలోనూ కార్మికుల సమరశీలత స్థాయిని కనిష్టంగా ఉంచగలుగుతోంది.
         పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతున్నకొద్దీ భూగోళం మీద కొన్ని ఎంచుకున్న ప్రదేశాలలో చెల్లాచెదురుగా తన ఉత్పత్తి కార్యకలాపాలను మొత్తంగా గాని, ముక్కలు ముక్కలుగా గాని నిర్వహించగలిగే శక్తి పెట్టుబడికి పెరుగుతుంది. అంటే పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతూన్న కొద్దీ భూగోళమంతా చెల్లాచెదురుగా విస్తరించగలిగే లక్షణం బలపడుతుంది. దాంతోబాటు కార్మికవర్గ సమరశీలతను దెబ్బ తీయగల శక్తీ పెరుగుతుంది.
          ఇక రెండవ అంశం: నయా ఉదారవాద విధానాలు ఉత్పత్తి కార్యకలాపాలను సంపన్న పశ్చిమ దేశాల నుండి సాపేక్షంగా వెనుకబడ్డ వర్ధమాన దేశాలకు తరలించడానికి దారి తీస్తాయి. తద్వారా సంపన్న దేశాలలోని కార్మికవర్గపు బేరసారాల శక్తిని బలహీనపరుస్తాయి. మరోపక్క ఆ వర్ధమాన దేశాలలో కూడా ఇంకా చాలామంది నిరుద్యోగులుగానే కొనసాగుతూ వుంటారు గనుక అక్కడి కార్మికవర్గపు సంఘటిత శక్తి కూడా పెద్దగా పెరిగేది ఉండదు.
         విస్తారమైన సంఖ్యలో నిరుద్యోగులు ఉన్న వర్ధమాన దేశాలతో లింకు పెట్టడం ద్వారా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని కార్మికులను అదుపు చేయగలుగుతుంది. అంతకు మునపటి కాలంలో సంపన్న దేశాలలో కార్మికుల స్థితిగతులకు, వర్ధమాన దేశాలలోని కార్మికుల స్థితిగతులకు నడుమ వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. అప్పుడు మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచం రెండు వేరు వేరు భాగాలుగా ఉంటూ, పెట్టుబడి కాని, కార్మికులు కాని ఒక భాగం లోనుంచి రెండో భాగం లోకి కదలడానికి వీలు లేనట్టు ఉండేది. ఈ వ్యత్యాసాన్ని తొలగించి, వర్ధమాన దేశాలలోని రిజర్వు కార్మిక సైన్యాన్ని మొత్తం వినియోగించి అక్కడ వృద్ధి శరవేగంగా జరిగేటట్టు చేయవచ్చుననే హామీతో నయా ఉరదారవాద విధానాలు అమలులోకి వచ్చాయి (నిజానికి వర్ధమాన దేశాల వెనుకబాటుకు, దాని పర్యవసానంగా అక్కడ నెలకొన్న భారీ నిరుద్యోగానికి సామ్రాజ్యవాద దోపిడీయే కారణం. కాని నయా ఉదారవాద సిద్ధాంతం ఆ వాదనను గుర్తించదు).
         కాని నయా ఉదారవాదం ఇచ్చిన ఆ హామీ నెరవేరలేదు సరికదా, వర్ధమాన దేశాలలో ఆ విధానం అమలులోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం మరింత పెరిగింది. అయితే నయా ఉదారవాదం వలన పనులు దొరికిన కార్మికుల సంఖ్య తగ్గినట్టు పెద్దగా కనిపించదు కాని...ప్రతీ కార్మికుడికీ లభించే పనిదినాలు మాత్రం బాగా తగ్గిపోయాయి.
         చిన్న ఉత్పత్తిదారులకు, రైతు వ్యవసాయానికి ప్రభుత్వాలు అందించే మద్దతు నయా ఉదారవాద కాలంలో తగ్గిపోయింది. ఈ రంగాలలో బడా కార్పొరేట్లు చొరబడడానికే ఆ విధంగా ప్రభుత్వాలు తమ మద్దతును కుదించివేస్తాయి. అదే సమయంలో వస్తువుల, సేవల దిగుమతులు నిరాటంకంగా, ఏ ఆంక్షలూ లేకుండా జరిగేలా ప్రభుత్వాలు విధానాలు అనుసరిస్తాయి. వాటినుండి ఎదురయ్యే పోటీని తట్టుకోడానికి దేశీయంగా ఉత్పత్తిదారులు అనివార్యంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టవలసి వస్తుంది. దాని వలన నిరుద్యోగం పెరగక తప్పదు. కార్మిక ఉత్పాదకతలో పెరుగుదల వస్తుంది. దాంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. చేతివృత్తులవారు, వ్యవసాయదారులు తమ ఉపాధి కోల్పోయిన కారణంగా పట్టణాలకు ఉద్యోగాల కోసం అంతకంతకూ ఎక్కువగా ఎగబడతారు. నిరుద్యోగ సైన్యం భారీగా పెరుగుతుంది. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమం బలహీనపడడానికి దోహదం చేస్తుంది.
         కార్మికోద్యమ బలహీనతకు దోహదం చేసే మూడో అంశం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ. ప్రైవేటు రంగ కార్మికుల కన్నా ప్రభుత్వ రంగంలో కార్మికులు మెరుగైన స్థితిలో సంఘటితమై ఉంటారు. అమెరికాలో ప్రభుత్వ రంగంలో మూడో వంతు సంఘాలుగా ఏర్పడివుండగా, ప్రైవేటు రంగంలో మాత్రం కేవలం 7 శాతమే సంఘాలుగా ఏర్పడ్డారు. అంటే ప్రైవేటీకరణ వలన కార్మికోద్యమం చప్పబడిపోతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థలోనే కార్మికవర్గ సమరశీలత సన్నగిల్లుతుంది.
      ఫ్రాన్స్‌లో ఇప్పటికీ ప్రభుత్వ రంగం గణనీయంగా ఉంది. అందుచేతనే అక్కడ సమరశీలంగా కార్మిక పోరాటాలు జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ప్రభుత్వ రంగం గణనీయంగానే ఉండేది. అందులో కార్మికవర్గానికి ఉజ్వలమైన పోరాట చరిత్ర ఉంది. కాని, క్రమంగా ప్రైవేటీకరణ ఆ పోరాటాలను మరింత క్లిష్టంగా మార్చివేస్తోంది. ఇప్పుడు కార్మికులు ఎక్కువగా చిన్న చిన్న పరిశ్రమల్లోనే సంఘటితం అవుతున్నారు.
         అయితే ప్రస్తుతం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది కార్మికోద్యమ సమరశీలత పెల్లుబుకుతున్న ధోరణి. నయా ఉదారవాదం కార్మికోద్యమ సంఘటిత శక్తిని ఒకవైపు దెబ్బ తీస్తున్నా, కార్మికుల ప్రతిఘటన పెరుగుతూవుంది. ఇదే విశేషం. ఈ ఏడాదిలో బ్రిటన్‌ లోని రైల్వే కార్మికులు పలు సమ్మెలు చేశారు. గడిచిన వేసవిలో వారు చేసినంత పెద్ద సమ్మె ఇటీవలి దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ తమ యజమానులు ఇవ్వజూపిన వేతన పెరుగుదల మరీ అల్పంగా ఉందంటూ తిరస్కరించారు. తగిన పెరుగుదల ఇవ్వకుంటే ఈ డిసెంబర్‌ లోను, జనవరిలోను మరింత పెద్ద స్థాయిలో సమ్మెలకు పోతామంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ రైల్వే కార్మికులు ఒంటరిగా మాత్రం లేరు. వారితోబాటు పోస్టల్‌, మెడికల్‌ ఉద్యోగులు, ఇతర కార్మికులు కూడా సమ్మెలకు సిద్ధమౌతున్నారు. పాలక కన్జర్వేటివ్‌ పార్టీ చైర్మన్‌ 'అవసరమైతే అత్యవసర సేవలను నిర్వహించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతా' మంటూ ప్రకటించడం కార్మిక ప్రతిఘటన ఎంత తీవ్ర స్థాయిలో ఉందో సూచిస్తోంది. జర్మనీలో పోర్టు కార్మికులు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు, విమానయాన భద్రతా సిబ్బంది. నిర్మాణ కార్మికులు, రైల్వే కార్మికులు ప్రస్తుతం సమ్మెల్లోనైనా ఉన్నారు, లేదా, త్వరలో చేయనున్న సమ్మెలకు సన్నాహాలు చేస్తున్నారు. తక్కిన యూరోపియన్‌ దేశాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. నయా ఉదారవాద కాలంలో ఇంతవరకూ మనకి కార్మికోద్యమం చప్పబడి వుండడం మాత్రమే కనిపిస్తూ వచ్చింది. ఇక ఆ పరిస్థితి ముగింపుకి వచ్చిందని ఈ పోరాటాలు సూచిస్తున్నాయి.
          ఇలా కార్మికులు సమరశీలంగా పోరాటాలకు దిగుతున్నప్పుడు దానికి వెనుక కారణాలు ఏమిటన్న చర్చను పశ్చిమ దేశాల పత్రికలు పక్కదోవ పట్టిస్తున్నాయి. నయా ఉదారవాద విధానం ఫలితంగా జరుగుతున్న ఈ సమ్మెలను ఉక్రెయిన్‌ యుద్ధం వలన జరుగుతున్నాయని, ఆ యుద్ధం కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగిందని, ఆ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మెలకు దిగుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరైతే కోవిడ్‌-19 కారణంగా సరుకుల సరఫరా వ్యవస్థ దెబ్బ తిందని, దాని వలన ఏర్పడిన ఇబ్బందులే ఈ సమ్మెలకు కారణమని అంటున్నారు.
          ఈ తరహా వ్యాఖ్యానాలు నయా ఉదారవాద విధానాల వైఫల్యాలను కప్పిపుచ్చలేవు. కోవిడ్‌ వ్యవహారం కాని, ఉక్రెయిన్‌ యుద్ధం కాని నయా ఉదారవాద విధానాల అమలు కారణంగానే తలెత్తాయి తప్ప ఆ విధానాలతో నిమిత్తం లేకుండా పుట్టుకొచ్చినవి కావు. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని, తద్వారా నయా ఉదారవాద విధానాలను మరింత ముందుకు నెట్టేందుకే ఉక్రెయిన్‌ యుద్ధానికి కారణభూతమైంది. వ్యాక్సిన్‌ టెక్నాలజీ పై తమకున్న గుత్తాధిపత్యాన్ని ఒదులుకోడానికి ఈ పశ్చిమ దేశాల కార్పొరేట్లు నిరాకరించినందువల్లనే కోవిడ్‌ సంక్షోభం ఏర్పడింది. లాన్సెట్‌ నియమించిన ఒక కమిటీ నివేదిక తాజాగా వెల్లడించిన వివరాలు కోవిడ్‌ వైరస్‌ పుట్టుక మిలిటరీ పరిశోధనల పర్యవసానమేనని, ఆ పరిశోధనలు సామ్రాజ్యవాదం పనుపున జరిగినవేనని సూచిస్తున్నాయి.
          ఇక ప్రస్తుత ద్రవ్యోల్బణం గురించి. ఇది కూడా నయా ఉదారవాద విధానాల అమలు పుణ్యమే. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు దానినుండి బైటపడడానికి అనుసరించే మార్గాలు ఆ వ్యవస్థను ఇంకో సంక్షోభంలోకి తప్పకుండా తీసుకుపోతాయి. నయా ఉదారవాద కాలంలో పెట్టుబడిదారులు చేజిక్కించుకునే అదనపు విలువ వాటా పెరిగింది. దాని ఫలితంగా మార్కెట్‌ లోని కొనుగోలుశక్తి తో పోల్చితే మార్కెట్‌ లోకి వచ్చే ఉత్పత్తి విలువ ఎక్కువైపోయింది. ఇది సంక్షోభానికి కారణమైంది. ఈ ధోరణి యావత్‌ పెట్టుబడిదారీ ప్రపంచంలోనూ కనిపిస్తున్నది. విడివిడిగా ఆ యా దేశాలలోనూ కనిసిప్తోంది. సామ్రాజ్యవాద శిబిరానికి నాయకుడిగా ఉన్న అమెరికా ఈ సంక్షోభం నుండి బైట పడేందుకు ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నగదు ప్రవాహం వచ్చిపడేట్టు చేసింది. అందుకోసం వడ్డీ రేట్లు దాదాపు సున్నా స్థాయిలో చాలా కాలం పాటు కొనసాగించింది. తక్కువ వడ్డీకే భారీగా నగదు లభించడం ఒక అవకాశంగా భావించిన కార్పొరేట్లు తమ తమ లాభాల మార్జిన్‌ లను బాగా పెంచివేశారు. అది ద్రవ్యోల్బణానికి దారి తీసింది. ఈ ద్రవ్యోల్బణానికి ఇతర కారణాలు కూడా దోహదం చేసివుండొచ్చు. కాని మౌలిక కారణం మాత్రం ఇదే.
తమ జీవితాలపై నేరుగా సాగుతున్న ఈ దాడికి వ్యతిరేకంగా కార్మికులు తీవ్ర ప్రతిఘటనలకు దిగుతున్నారు. ప్రస్తుత పరిస్థితి నయా ఉదారవాద విధానాలకు ముందు దారి మూసుకుపోయిందని సూచిస్తోంది.

( స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌