
సైనిక వ్యయంపై కోత విధించటానికి బిజెపి అనేక ఏళ్ల నుండి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అనేక కమిటీలను వేసింది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా అమలుకు పూనుకుంది. సైనిక వ్యయంలోనే కాదు అన్ని రంగాల్లో ఈ విధానాన్ని గత మూడు దశాబ్దాల నుండి అమలు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ప్రజా సంక్షేమం, సామాజిక భద్రతపై పెట్టే ఖర్చుల్లో కోత పెట్టడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం అనే త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నారు.
అగ్నిపథ్ó్‌్ దేశాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిశాయి. దేశం మొత్తం ఒకే గొంతుతో దీనిని వ్యతిరేకించింది. అగ్నిపథ్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవటమే గాక మన దేశ రక్షణకు పెను ముప్పు కలుగుతుందని రిటైర్డ్ సైనిక అధికారులు హెచ్చరించారు. అయినా కేంద్ర బిజెపి సర్కార్ వీటిని పరిగణ లోకి తీసుకోలేదు. ఆగమేఘాల మీద సైనిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండోవైపు ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఫాసిస్టు దమనకాండకు పూనుకుంది. ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసుకోవటానికి వీలు లేకుండా క్రూరమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నది. వ్యతిరేకించే వారిపై తీవ్రమైన అక్రమ కేసులు బనాయిస్తున్నది.
సైన్యంలో తీసుకొచ్చిన నాలుగేళ్ళ నియామకాలను విడిగా చూడకూడదు. గత మూడు దశాబ్దాలుగా దేశంలో అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాలలో భాగంగానే చూడాలి. ఇప్పటికే అనేక వ్యవస్థలను, సంస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. కొన్నింటిని పూర్తిగా అమ్మేసింది. మరికొన్నింటిలో భారీగా పెట్టుబడులు ఉపసంహరించింది. రాజ్యాంగాన్ని సైతం సమూలంగా మార్చేయటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. తన ఫాసిస్టు చర్యలతో ప్రజాతంత్ర శక్తులపై దాడులు చేస్తున్నది. మత ఘర్షణలు సృష్టిస్తున్నది.
ఇప్పుడు రక్షణ రంగం మీద మోడీ ప్రభుత్వం దాడి తీవ్రతరం చేసింది. సైన్యాన్ని బలహీనం చేసే చర్యలతో పాటు మొత్తం ప్రభుత్వ రక్షణ సంస్ధలు, రక్షణ పరిశ్రమల ధ్వంసరచనకు పూనుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 16 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలను, 41 ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలు, 52 డిఆర్‌డివో లేబరేటరీలు, నేవల్ డాక్‌యార్డులు, షిప్‌బిల్డింగ్ సెంటర్లు, వర్క్‌షాపులన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారు. దేశ రక్షణకు, సైన్యానికి అవసరమైన రక్షణ ఉత్పత్తులు, యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు తయారు చేయడం, రిపేర్లు చేయడం ఈ సంస్థల పని. దాదాపు ఏడాదికి లక్ష కోట్ల విలువ గల రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తాయి. ఈ కంపెనీల ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థల నుండి కొనుగోలు చేస్తూ ఈ సంస్థలను దెబ్బతీస్తున్నది. కొన్ని రక్షణ పరిశ్రమలను, సంస్థలను ఇప్పటికే ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. బిఇఎంఎల్, మిధానీ, హిందుస్ధాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మజగాన్ డాక్, గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్స్ సంస్ధలలో పెట్టుబడులు ఉపసంహరించింది. ఈ రక్షణ సంస్థలన్నింటిలో దాదాపు 5 లక్షల మంది పైగా సివిలియన్ ఉద్యోగులున్నారు. వీరు చేస్తున్న పనులను కూడా బడా కార్పొరేట్ సంస్ధలకు అవుట్ సోర్సింగ్, పిపిపి పేర బదిలీ చేస్తున్నారు.
గడిచిన ఏడు దశాబ్దాల్లో రక్షణరంగంలో ప్రభుత్వ పెట్టుబడితో సాధించిన స్వయం సమృద్ధిని దెబ్బ తీస్తూ రక్షణ రంగాన్ని బడా కార్పొరేట్ శక్తుల పరం చేస్తున్నది. 2003 వరకు రక్షణ ఉత్పత్తుల తయారీలోకి విదేశీ, స్వదేశీ ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లేదు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిచ్చింది. టాటా, రిలయన్స్, అదానీ, ఎల్ అండ్ టి, మహేంద్ర, కళ్యాణి, హిందూజా, పుంజ్‌లాయడ్ వంటి బడా సంస్థలను రక్షణ రంగం లోకి అనుమతిచ్చారు. 539 రక్షణ లైసెన్స్‌లు ఇప్పటికే ఇచ్చేశారు. ఈ సంస్ధలన్ని రక్షణ ఉత్పత్తుల మార్కెట్ మొత్తాన్ని తమ వశం చేసుకోవటానికి కాచుకు కూర్చున్నాయి.
ఎందుకంటే భారతదేశం ఏడాదికి సుమారు 2 లక్షలకోట్ల విలువగల రక్షణ పరికరాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్ మెరైన్లు, ట్యాంకులు, ఏరో స్పేస్ పరికరాలు తదితర వాటిని కొనుగోలు చేస్తుంది. గత ఎడేేళ్ళ నుండి అత్యధిక భాగం వీటిని ప్రభుత్వ రంగ సంస్థల నుండికాక ప్రైవేట్ సంస్ధల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వానికి మాత్రమే ఆయుధాలు సరఫరా చేయటానికి పరిమితం కావు. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాల్లో పౌర ఆయుధ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నది. నేడు ప్రపంచ వ్యాపితంగా 87 కోట్ల తుపాకుల వంటి ఆయుధాలను పౌరులు చట్టపరంగాను, అక్రమంగాను వినియోగిస్తున్నారు. పౌర ఆయుధ మార్కెట్టు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరింది. మన దేశంలో కూడా ఈ విష సంస్కృతి తీసుకురావటానికి మోడీ-కార్పొరేట్ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి.
ఉపాధిని కూడా దెబ్బతీస్తున్నారు. నాలుగేళ్ళ ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాలను తొలిసారిగా ప్రభుత్వమే సైన్యం లోకి తీసుకొచ్చింది. ఈ విధానాన్ని అన్ని రంగాలలో వాయు వేగంతో ఇక అమలుచేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.81 లక్షలు, రక్షణ రంగ సంస్థల్లో 2 లక్షల సివిలియన్ ఉద్యోగాలు, పారామిలటరీ దళాల్లో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధల్లో భర్తీ లేదు. గత మూడు దశాబ్దాల్లో లక్షల ఉద్యోగాలు రద్దు చేయబడ్డాయి. ఈ చర్యలు దేశ ఆర్థికాభివృద్ధ్దిని దెబ్బ తీస్తున్నాయి. ఎందుకంటే దేశంలో శాశ్వత ఉద్యోగ వ్యవస్ధ మార్కెట్టులోని సరుకుల డిమాండ్‌కి, సర్వీస్ రంగ పురోగమనానికి మూలస్ధంభంగా పనిచేస్తున్నది. శాశ్వత ఉద్యోగాలు తగ్గే కొద్ది ఆర్థిక వ్యవస్ధ మరింత సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వివిధ దేశాల అనుభవం చూస్తే ప్రపంచంలో చాలా దేశాల కంటే ప్రభుత్వ ఉపాధి కల్పనలో భారత్ అధమ స్థాయిలో ఉంది. ప్రతి వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగులు నార్వేలో 159, స్వీడన్‌లో 138, ఫ్రాన్స్‌లో 114, బ్రెజిల్‌లో 111, అమెరికాలో 77, చైనాలో 57 మంది ఉన్నారు. భారత దేశంలో మాత్రం కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు.
సైనిక వ్యయంపై కోత విధించటానికి బిజెపి అనేక ఏళ్ల నుండి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అనేక కమిటీలను వేసింది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా అమలుకు పూనుకుంది. సైనిక వ్యయంలోనే కాదు అన్ని రంగాల్లో ఈ విధానాన్ని గత మూడు దశాబ్దాల నుండి అమలు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ప్రజా సంక్షేమం, సామాజిక భద్రతపై పెట్టే ఖర్చుల్లో కోత పెట్టడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం అనే త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నారు.
2003 లోనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వత్తిడితో ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ద్రవ్య బాధ్యత-బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్.ఆర్.బి.ఎం) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం ద్రవ్య లోటు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో 3 శాతానికి మించి ఉండకూడదు.
ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో 14.37 లక్షల మంది సైన్యం వుంది. పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ సైనికులు 32.35 లక్షల మంది వున్నారు. వీరు గాక రక్షణ రంగంలోనే సివిలియన్ ఉద్యోగులుగా మరో 6.29 లక్షల మంది వున్నారు. మొత్తంగా రక్షణ రంగంలో సర్వీస్‌లో ఉన్న సైన్యం, పెన్షన్‌దారులు కలిపి 53.06 లక్షల మంది వున్నారు.
2022-23లో మొత్తం రక్షణ బడ్జెట్ రూ. 5,25,166 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో సైన్యం జీతాలకు రూ. 1,63,453 కోట్లు (31.12 శాతం), రిటైర్డ్ సైనికుల పెన్షన్‌కు రూ. 1,19,696 కోట్లు (22.79 శాతం), ఆయుధాల కొనుగోలుకు రూ. 1,44,304 కోట్లు, ఆయుధాల రిపేర్లకు, స్పేర్‌పార్టులకు రూ. 40,561 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 57,152 కోట్లు కేటాయించారు. మొత్తం రక్షణ బడ్జెట్‌లో 54 శాతం సైనిక శక్తిపై పెట్టాల్సి వస్తుందని బిజెపి విమర్శిస్తున్నది.
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చేసే మొత్తం వ్యయంలో 2012-13లో రక్షణ రంగంపై చేసిన వ్యయం 16.4 శాతం అయితే 2022-23లో అది 13.3 శాతానికి తగ్గింది. అమెరికా తన స్థూల జాతీయోత్పత్తిలో (జిడిపి లో) రక్షణ రంగానికి 3.7 శాతం కేటాయిస్తున్నది. మన దేశం కన్నా చైనా మూడున్నర రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. రష్యా 4.3 శాతం, బ్రిటన్ 2.2 శాతం, పాకిస్తాన్ 4 శాతం ఖర్చు చేస్తుంటే భారత్ 2.7 శాతం ఖర్చు చేస్తున్నది. ఈ వాస్తవాలను సమాధి చేసి సైన్య వ్యయంపై విషం జిమ్ముతున్నారు.
గత ఏడేళ్ల నుండి భారత్ పరిస్థితి ఏమిటి? మోడీ స్వార్ధపూరిత చర్యల వల్ల దేశ సరిహద్దు ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో దేశ సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాల్సింది పోయి అగ్నిపథ్ ద్వారా బలహీన పర్చే దేశద్రోహ చర్యలకు బిజెపి పాల్పడుతున్నది.
గడిచిన మూడు దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర మార్పులకు గురవుతున్నది. ప్రభుత్వ పెట్టుబడితో నిర్మించిన వ్యవస్థలు, సంస్థలు, వనరులన్నీ కొద్దిమంది బడా కార్పొరేట్ల పరమౌతున్నయి. అనేక రంగాల్లోని ప్రభుత్వ ఏకస్వామ్యం ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యం లోకి వెళుతున్నాయి. కార్మిక చట్టాలన్నింటిని బలహీన పర్చి ... సంపన్నులు, కార్పొరేట్లపై విధించే పన్నులు తగ్గించి సామాన్యులపై పన్నుల భారం పెంచుతున్నారు. మోడీ పదే పదే చెబుతున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దేశం చేరినా ఆ సంపద ఎక్కువ భాగం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అంతరాలు తీవ్రతరమయి ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి నెట్టబడుతుంది. ఈ నేపథ్యంలో పోగుపడిన సంపదను రక్షించుకోవటానికి ప్రైవేట్ సైన్యం అవసరం. అందుకే అగ్నిపథ్‌కు భారత్ కార్పొరేట్ వర్గాలు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికాయి. ఇప్పటికే మన దేశంలో కార్పొరేట్ కంపెనీలు, సంస్థలన్నీ రిటైర్ అయిన పోలీస్ ఉన్నతాధికారులతో నడుస్తున్నాయి. కార్మికులను అణగదొక్కటానికి వీరిని ఉపయోగిస్తున్నారు. రేపు అగ్ని వీరులంతా ఇదే పనికి ఉపయోగించుకుంటారు. అంతే కాదు. అగ్నివీరుల కోసం కొన్ని కార్పొరేట్ శక్తులు కాచుకు కూర్చున్నాయి. ప్రైవేట్ కాంట్రాక్ట్ సైన్యాన్ని నడపటానికి సిద్ధమయ్యాయి. త్వరలో ప్రైవేట్ కాంట్రాక్ట్ సైన్యం ఏజెన్సీలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి సామ్రాజ్యవాద దేశాల్లో ఈ పద్ధతి అమలులో వుంది. మన దేశం లోని అగ్నివీరులను వారి అవసరాల కోసం ఎగుమతి చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు. అలాగే వీరిని రాజకీయ, మతోన్మాద, కుల, ఉగ్రవాద, అసాంఘిక శక్తులు ప్రైవేట్ సాయుధ బలగాల్లా ఉపయోగించుకుంటాయి. ఇవి సమాజంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి.
/ వ్యాసకర్త సెల్ : 9490098792 /
డా|| బి. గంగారావ్