దేహం తగలబడే వరకూ
మనసును
నాకు తెలీకుండానే
కాష్టంలా రగుల్చుకుంటున్నానా?!
ప్రశ్నించుకునే సమయంలేదు
ప్రశ్నకు ముందూ వెనకా
జవాబుందనే వాస్తవాన్ని దాటుకుంటూ
ముందుకు పోతున్నానా?!
ప్రశ్నలు
రక్త కదలికలో కలియదిరుగుతున్నా
గ్రహింపులేని బ్రతుకుతో
నన్ను నేనే సాగనంపుకుంటున్నానా?!
ఫజిలైపోతున్న భవిష్యత్తును
నన్ను నేను విభజించుకుని
చక్కదిద్దుకోవాల్సిన తరుణమిదని
శ్వాసకోశాల్లోంచి పోతున్న
నిట్టూర్పులను అడగలేకపోతున్నానా?!
రోగాల పుట్టై
ఆసుపత్రి నాలుగ్గోడల మధ్య
నాకు నేనేమౌతానో
తెలుసుకోలేనంత సందిగ్ధం చివర
మరణాన్ని తగిలించానని
తరిమే ప్రయత్నం చేస్తున్నానా?!
రెండు కన్నీటి బొట్లను రాల్చే
మనోనయన అనుసంధానాన్ని
నిర్మించలేకున్న శక్తి హీనుణ్ణా?!
కాదే...
భూమిగర్భం చీల్చి
అనేకానేక నిక్షేపాలను తెచ్చినా
మెదడును తొలిచి తొలిచి
అంతరిక్షంలో నివాసానికి
పునాదులకు పురిగొల్పుతున్నోణ్ణేగా?!
మరిప్పుడెందుకిలా...
ప్రకృతిని
చిన్నచూపు చూస్తూ
నాకు నేనే
శత్రువునై నిలబడుతున్నాను?!
ఇక ఇప్పుడే
నన్ను నేను తడుముకుంటాను.
ప్రకృతి ప్రేముకుణ్ణై
కాలం చేయి పట్టుకుంటాను.
ఇదే మనిషిగా నా పునర్గమనం.
ఊహల లోయల నుండి
ఆకాశం అంచుల్లో ఉన్న భ్రమల నుండి
తేరుకుని
భూమిపై నిలబడతాను.
ఇక్కడ నుండి
నాకు నేనూ
నేను ప్రకృతికీ మిత్రబంధం కలుపుకుంటాను.
మనిషి ధర్మంతో
మానవత్వాన్ని కప్పుకుని
స్వచ్ఛ సమాజాన్ని కలగంటాను.
నన్ను నేను గెలుచుకునే
నా కలను సాకారం చేసుకుని
మనిషిగా కొనసాగుతాను.
అంతిమ సింహాసనం ఎక్కేవరకూ...
కొత్తపల్లి మణీత్రినాథరాజు
80086 06268