పాడుబడిన చీకటింట్లో ఆకాశమే పైకప్పుగా
బుడ్డి దీపమే చంద్రోదయములా కనిపిస్తుంది
మనసు మౌనంగా నిద్రలోకి జారుతుంటే
గబ్బిలాల రెక్కల చప్పుడు నిద్రను దూరం చేస్తుంది..
కడుపులో పేగుల అరుపులు శృతులు కలుపుతుంటే
విస్తర్లో చివరి మెతుకు అమృతంలా తోస్తుంటే
తాగే మంచినీళ్లు ఉదరంలో అలజడి కలిగిస్తే
పట్టెడన్నము కనిపిస్తే కళ్ళకు పరమానందమే కదా..
నేలను ఈదుతూ ముంజేతులు గాయపడితే
పరిగెత్తే కాళ్లలో సత్తువ అంతా కరిగిపోతే
సమాజంలో ఈసడింపుల పుండు సలుపుతుంటే
సమానత్వపు ఘోష సంఘంలో నిద్రిస్తుంది..
ఒంటి కాలిపై తపస్సు చేస్తున్న దివ్యాంగపు మునులు
హారతి పళ్లెములాంటి భిక్ష పాత్రలో చిల్లర డబ్బులు
పోగుచేసినా నూకలు దొరకని బతుకులు ఎన్నో
ఉదరాగ్నిని చల్లార్చలేని నిస్సహాయ స్థితిలో సమాజం..
ఈర్ష్యా ద్వేషపు రాజ్యంలో నవ సమాజం ఎక్కడా..?
నలుగురి సంపద ఒక్కడే తిమింగలమై మింగితే
కడగొట్టు బిడ్డ కన్నీటితో వీడ్కోలు పలుకుతుంటే
పిడికిటి నిండా మట్టి ముఖముపై చల్లుతుంటే ఎలా..
అర్ధాకలి కడుపే చేయిస్తుంది విద్రోహాలెన్నో
అమ్మ తాలూకా తనువును అంగట్లో అమ్ముకున్నట్లు
మొండిచేతుల మానవత్వం నింగిలో ఏడుస్తుంది
సముద్రపు ఘోషలా సహాయం కోసం ఎదురుచూస్తుంది..
కొప్పుల ప్రసాద్
98850 66235