
చిన్నప్పుడు మట్టిలో ఆడనివారు ఎవరున్నారో చెప్పండి.. అంతెందుకు మట్టిలోంచి పండే పంటతోనే కదా మనమంతా బతుకుతున్నాం.. నేల ప్రతిదానికి మూలాధారం.. పంట పండాలన్నా.. ఇల్లు కట్టాలన్నా.. మనం జీవించాలన్నా.. దేనికైనా నేల ప్రధానమైనది. అందుకే ఓ కవి 'దేశమంటేనే మట్టేనోయ్.. / మట్టి లేకుంటే మనిషెక్కడోయ్.. / సారం లేని మట్టిలో / నువ్వు సాగెట్ల సాగిస్తావోయ్.. / సాగుంటేనే సౌభాగ్యం / లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం / తిండి, బట్ట, నీడకి / నిండు మట్టేరా మూలాధారం..' అంటాడు. అంతగా మనిషితో పెనవేసుకుపోయిన మట్టి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. విత్తనం మొలవాలన్నా మట్టిలోనే.. మనిషి మరణించాక కలిసిపోయేది మట్టిలోనే.. మట్టేగా అని తీసిపారేయకండి.. బంగారంతో సమానం.. అలాంటి నేలమ్మ గురించే ఈ ప్రత్యేక కథనం.
తొలకరి జల్లు కురిసినప్పుడు వచ్చే పరిమళాన్ని ఆస్వాదించే ఉంటారు కదూ.. ఆ మట్టి పరిమళం గమ్మత్తుగా భలే ఉంటుంది. దాన్ని ఆస్వాదించాల్సిందేగానీ.. మాటల్లో ఎంత వర్ణించినా తక్కువే. మట్టిలో ఆడుకోని బాల్యం ఎవరికీ ఉండి ఉండదు. దాదాపుగా అందరం మట్టిలో చిట్టిచేతులతో ఆడినవాళ్లమే.. అలా ఏర్పడిన అనుబంధం ఆ తర్వాత మరణంతో దానిలోనే కలిసే వరకూ కొనసాగుతుంది. మనిషితో మట్టికున్న అనుబంధం ఇది మాత్రమే కాదు.. ఆ మట్టిలో సాంద్రతతోనే రైతు సాగు చేసేది. మట్టేగా అనుకుంటాంగానీ.. ఈ నేలలు అనేకరకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.

బాల్యపు జ్ఞాపకాలు..
ప్రతి ఒక్కరి బాల్యంలో బంకమట్టితో బొమ్మలు తయారుచేసినవీ.. బంకమట్టిని కాళ్లతో తొక్కిన జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. బంకమట్టితో మన నిత్య జీవితంలో వాడుకునే ప్రతి ఒక్కటీ పిల్లలు తయారుచేసేవారు. తిరగలి, రుబ్బురోలు, ఎడ్లబండి.. ట్రాక్టరు, పొయ్యి, గిన్నెలు, టీ కెటిల్, గ్లాసులు.. ఇలా ఒకటేమిటీ అన్నీ తయారుచేసేవారు. ఆ బొమ్మల్ని జాగ్రత్తగా ఆరనిచ్చి, వాటికి ఎర్రమట్టిని పలుచగా కలిపి పెయింట్‌లా వేసేవాళ్లు.. ఇలా చాలామంది బాల్యపు జ్ఞాపకాల్లో బంకమట్టితో పెనవేసుకుని ఉంది.చాలా వరకూ బొమ్మలు బంకమట్టితోనే తయారుచేసి, కాల్చి, రంగులు వేస్తారు.

మట్టి పాత్రల ప్రాధాన్యం..
ఇటీవల పర్యావరణ స్పృహ కాస్త పెరిగిందనే చెప్పాలి. ఆరోగ్యంపై కాసింత శ్రద్ధ పెంచుతున్నారనే అనుకోవాలి. అందుకే మట్టి పాత్రల ప్రాధాన్యం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. వీటిని ఆధునిక వంటపాత్రలకు సరిసమానంగా తయారుచేస్తున్నారు. నీళ్లు తాగే బాటిల్స్ నుంచి, కూరలు వండే గిన్నెల వరకూ తయారుచేస్తున్నారు. చివరకు ప్రెషర్ కుక్కర్లను సైతం మట్టితోనే తయారుచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పూర్వం వంటిట్లో పొయ్యలను మట్టితోనే తయారుచేసుకునే వారు. ఇంటి నిర్మాణంలో ఇప్పుడంటే సిమెంట్ వచ్చిందిగానీ, అప్పట్లో మట్టి పాత్రే అధికం. గోడలు కట్టడమే కాకుండా, ఇల్లు అలకడానికీ మట్టి, పేడ కలిపే అలికేవారు. పండగలకు పుట్టమన్ను తెచ్చి అలుక్కున్నే సంప్రదాయం నేటికీ అక్కడక్కడా కనిపిస్తుంది.
సాగులో పరిణామాలు..
ప్రతి పంటకూ కీలకమైంది నేల రకమే. మట్టి బాగుంటేనే సాగుబడి బాగుండేది. 'పురుగు పుట్ర తిరగాడి / సారం మట్టికి తోడైనది.. / పశుల పక్ష్యాదుల తోడుగా.. / జీవం నేలపై పారాడింది..' అంటాడు కవి. నిజమే మట్టిలో వానపాములు ఉంటేనే గుల్లబారేది. అలా ఉంటేనే పంట ఏపుగా పెరిగేది. పశువుల, పక్షుల విసర్జితాలు కలగలిస్తేనే మట్టి సారవంతంగా అయ్యేది. ఆ సారంతో పంట దిగుబడి అధికంగా వచ్చేది. ఇలా ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉంది. మొదలు మట్టిలోనే అన్నది మరువకూడదు. గతంలో చేలల్లో వచ్చే కలుపును అక్కడే మట్టిలో వేసి తొక్కేవారు. వీటికి తోడు ఎండుటాకులు, పచ్చి ఆకులు వేసి మాగేసి, పచ్చిరొట్ట తయారుచేసేవారు. పశువుల ఎరువులతో కలిపి మాగించి వేసేవారు. ఇవన్నీ భూమికి సాంద్రత ఇచ్చే పద్ధతులు. దానితో నేల మరింత సారవంతమయ్యేది. అయితే రాను రాను ఇలాంటి సేంద్రియ పద్ధతుల్ని వదిలేసి, రసాయనాల వాడకం పెరిగింది. ఇప్పుడు కలుపు మందుల వాడకం పెరిగింది. అధిక దిగుబడి కోసం రసాయనాలు వాడకం పెరిగిపోయింది. ఈ రసాయన మందులతో నేల విషపూరితం అవుతుంది. ఫలితంగా పంట మీద ప్రభావం చూపింది. ఆ పంట తిన్న మనకిగానీ, పశువులకు గానీ దుష్ప్రభావాలు తప్పడం లేదు. జన్యుమార్పిడి విత్తనాల వల్లా నేల విషపూరితంగా మారుతుంది. ఉదాహరణకు బిటి విత్తనాల్నే తీసుకుంటే.. విత్తనంలోకే విషం చొప్పించి తయారుచేయడం వల్ల.. దాని దుష్ప్రభావం పంట మీదే కాకుండా నేలపైనా పడుతోంది. పత్తిలో ఈ జన్యుమార్పిడి ఫలితంగా పశువుల పాలల్లో వరకూ దీని విషపదార్థాలు చేరాయి. ఇక పంటల్లో వంగ, బెండలో ఈ జన్యుమార్పిడి విధానం అమలు జరుగుతోంది.
నేలతో నీరూ కలుషితం..
నేల కలుషితం అవడం వల్ల భూగర్భ జలాలు కూడా ప్రభావితమవుతాయి. ఫలితంగా ఆ నీరు తాగిన మనుషులకు, పశువులకు దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, నేలల్లోని ఆమ్ల ప్రభావాలతో నీరు కలుషితం అవుతుంది. కొన్నిచోట్ల ఫ్లోరిన్, క్యాల్షియం శాతాలు అధికంగా ఉండటం వల్ల నేలతో పాటు ఆయా భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ఫలితంగా మూత్రపిండాలు, ఎముకలపై తీవ్ర ప్రభావం చూపించి, ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే కొండపల్లి, నల్గొండ ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారుల్లోనూ ఈ ప్రభావాలతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం. వీటిపట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి, తక్షణ ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉంది.

తవ్వేస్తూ.. తోడేస్తూ..
కొన్నేళ్లుగా గనుల కోసం, మెరక కోసం మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ గనుల కోసం తవ్వకాల్లో సారవంతమైన భూముల్ని కోల్పోతుండగా మరోవైపు అనేకమంది నిర్వాసితులు అవుతున్న పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. మన చర్యలతోనే భూమి కోత, భూ క్షయం, భూ కాలుష్యం అనేవి సంభవిస్తున్నాయి. భూగర్భంలో ఉన్న నీరు, ఖనిజాలు, చమురు సహజ వాయువులను విచ్చలవిడిగా తోడేస్తున్నాం. హానికర ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భూమిపై పడవేస్తున్నాం. దీని కారణంగా భూమి జవసత్వాలు కోల్పోతుంది. ఒక పక్క మనం ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న చర్యలతో వనాలు మోడులవుతూ.. మరొక పక్క పొలాలు బీడులుగా మారుతున్నాయి. 'ఇదే విధానం మరొక వందేళ్లు కొనసాగితే మన మనుగడకు వేరొక గ్రహం చూసుకోవాల్సిందే!' అని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినా మనలో మాత్రం మార్పు కనిపించడం లేదు.
అంగుళం ఎత్తు మట్టి కొత్తగా ఏర్పడాలంటే 250 ఏళ్లు పడుతుంది. అటువంటిది మన అజాగ్రత్త, స్వార్థం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల సారవంతమైన మట్టిని కోల్పోతున్నాం. ప్రతీ ఐదు సెకన్లకు దాదాపు ఫుట్‌బాల్ మైదానానికి సమానమైన మట్టిని జీవం కోల్పోయేలా చేస్తున్నాం. నేల సారవంతంగా ఉండాలంటే దానిలో సేంద్రియ పదార్థం 3-5 శాతంగా ఉండాలి. కానీ ప్రస్తుతం మన దేశంలో 62 శాతం భూమిలో ఇది 0.5 శాతం, అంతకన్నా తక్కువే ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. అమెరికాలో భూమి ఉపరితలంపై 12 అంగుళాల వరకు ఎరువులు, పురుగుమందుల ప్రభావం ఉంది. 80-83 శాతం భూమి సారం కోల్పోయింది. ఈ దుస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అంటే ప్రపంచం యావత్తు ఇప్పటికే చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మట్టే కదా! అనే మన లెక్కలేనితనమే ఈ దుస్థితికి కారణం.

కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..
'ఒట్టి మట్టేగా అంటావేమో / మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదా.. మట్టేరా పుట్టుకకు ఆధారం / మోసేది నీ భారం / అన్నమై ఆకలి తీర్చే మమకారం / మట్టేరా ప్రాణమున్న బంగారం / జీవకోటికి గంధం / ఒట్టిపోనీయకు నేలను / తీర్చుకో రుణం..' అన్న కవి మాటలు అక్షరసత్యాలు. సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్త సముద్రాలను, నదులను తనలో నింపుకుని, విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలమ్మ. ఈ నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. అనేక జీవులు.. జీవరాశులు.. మనుషులు.. చివరకు సూక్ష్మక్రిములు సైతం మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల జాతుల జీవనానికి మట్టి ఆధారమై నిలచి ఉంది. మనల్ని పోషిస్తూ మన ఉనికికి ఆధారభూతమైన, చైతన్యవంతమైన ఒక మాత స్వరూపంగా నిలచింది నేలమ్మ. అందుకే నేలమ్మకు వేల వేల వందనాలు. అలాంటి నేలమ్మను సంరక్షించుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. అందుకే నేలమ్మ సంరక్షణ మనందరి బాధ్యత.

ఆహారభద్రతే కీలకం : స్వామినాథన్
ధరిత్రి సమ్మేళనం 1992 (Earth Summit -UNO) ప్రపంచ దేశాలకు భూమి (మట్టి)ని రక్షించాలనే హెచ్చరికలు చేసింది. ఆ క్రమంలో జరుగుతూ వస్తున్న అన్ని పర్యావరణ సదస్సుల్లో (నిన్నటి సిఒపి - 27, ఈజిప్ట్) పదే పదే ఈ అంశాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. వ్యవసాయ రంగ నిపుణులు, మృణ విజ్ఞాన శాస్త్రజ్ఞులు (సాయిల్‌సైంటిస్ట్) మట్టి రక్షణ, 'ఆహార భద్రత' కు కీలకమైందని సూచిస్తూనే ఉన్నారు. ప్రొ.ఎం.ఎస్. స్వామినాథన్ తన జాతీయ రైతు కమిషన్ నివేదికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశ పాలకుల బాధ్యతను గుర్తు చేశారు. దేశ పాలకుల బాధ్యతను గుర్తు చేశారు. వందల వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడ్డ మట్టిని ఆహారేతర రంగాలకు మళ్లించటం హ్రస్వ దృష్టి పాలనకు నిదర్శనమని హెచ్చరించారు. 2020 ప్రపంచ ఆహార అవార్డు (నోబెల్ బహుమతితో సమానమైనది) పొందిన ప్రొ.రతన్‌లాల్ మానవ మనుగడ మట్టి, చెట్టు పైనే ఆధారపడ్డదని వివరించారు. మన పాలకులు ఎంతో విలువైన నదీ పరీవాహక ప్రాంతాల్ని (సారవంతమైన మట్టిని) నగర నిర్మాణాలకు మళ్లించే దశలో ఉండటం దురదృష్టకరం.

జీవ వైవిధ్యం...
మట్టిలో జీవం కోల్పోవడం వలన జీవ వైవిధ్యాన్నీ కోల్పోతున్నాం. ఎందుకంటే నేల సారం కోల్పోయి జీవం లేకపోవడం వలన నేలలో సూక్ష్మజీవులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. దీంతో ప్రతి ఏడాది దాదాపు 27,000 రకాల జీవులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 80 శాతం పురుగులలో జీవపదార్థం పోయే స్థాయికి సంక్షోభం చేరుకుంది. ఈ విధంగా జీవవైవిధ్యం కోల్పోవడం వల్ల నేల ఆవాసాలకు అంతరాయం ఏర్పడుతుంది.
వాతావరణ మార్పు
పర్యావరణానికి హాని కలిగించే భూతాపాన్ని పెంచేది కర్బనం. అయితే ఈ కర్బనం భూమిలో ఉంటే మేలు జరుగుతుంది. భూమి ఎక్కువ కర్బనాన్ని తనలో ఉంచుకోగలదు. మట్టిలో ఉన్న కార్బన్, మొక్కల కంటే మూడు రెట్లు, వాతావరణంలో కంటే రెండు రెట్లు ఎక్కువగా నిల్వ ఉంటుంది. అంటే కార్బన్‌ను గ్రహించడానికి మట్టి ఎంతో కీలకం. అప్పుడే కోట్లాది సూక్ష్మజీవులు భూమిలో మనగలుగుతాయి. మట్టికి సమద్ధిగా జీవం లభిస్తుంది. అయితే మట్టిలో ఉన్న జీవం తగ్గే కొలదీ కార్బన్ వాతావరణంలోనికి చొచ్చుకొస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్‌ను ఉధృతం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మట్టిలో జీవాన్ని పునరుజ్జీవింపజేయాలి. లేకపోతే, అది వాతావరణ మార్పులకు దోహదపడే 850 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇది గత 30 ఏళ్లలో మానవాళి మొత్తం విడుదల చేసిన ఉద్గారాల కంటే ఎక్కువని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
నేలమ్మ బాగుకోసమే ఈ రోజు..
ఈ దినోత్సవం ఏర్పాటుకు ప్రధాన ప్రతిపాదకులలో ఒకరైన థాయిలాండ్ 9వ రాజు జన్మదినం సందర్భం. ఆయన జ్ఞాపకార్థం డిసెంబర్ 5ను ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అసలైతే ప్రకతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల అత్యంత ముఖ్యమైనది. భూమి సారవంతంగా ఉన్నప్పుడే పంటలు బాగా పండేది. తద్వార వ్యవసాయం లాభసాటిగా మారి, అన్నదాతలు ఆర్థిక పురోగతి సాధించేది. రైతు బాగున్నాడంటే మిగిలిన అన్ని వర్గాలు, అన్ని రంగాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. అయితే అవగాహన లోపంతో నేల, నీటి సంరక్షణ చర్యలు పాటించడం అంతంత మాత్రంగా ఉంది. నేల స్వభావాన్ని పరిరక్షించుకునే దిశగా 2013 నుంచి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా నేలల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేల, నీటి సంరక్షణ చర్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.

పోషకాహార లోపం
పోషకాహార లోపం అనేది నేడు పేదవారిలోనే కాదు భాగ్యవంతుల కూడా ప్రధాన సమస్యగా పరిణమించింది. కారణం ఏమిటంటే పండే పంటలలోనే పోషకాహారం లేకపోవడం. ఒక అధ్యయనం ప్రకారం మన పూర్వీకులు ఒక నిమ్మకాయతో పొందే విటమిన్ సిని ఇప్పుడు మనం పొందాలంటే.. దాదాపు ఎనిమిది నిమ్మకాయలు తీసుకోవాలి. మనం రసాయనాలు ఉపయోగించి, పంటల దిగుబడి పెంచుతున్నాం. కానీ దానిలో పోషకాలు పడిపోయాయన్న సంగతి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మనం పండిస్తున్న పండ్లు, కూరగాయలు ఇప్పటికే తక్కువ పోషకాలను కలిగి ఉంటున్నాయి. అమెరికాలో కూరగాయలలో ఖనిజాలు, పోషకాలు 80 శాతం తగ్గిపోయాయి. మనదేశంలో కూరగాయలలో ప్రొటీన్లు 60 శాతం వరకూ తగ్గిపోయాయి.

మట్టి నుంచే ఆహారం...
ప్రపంచ నేల దినోత్సవం 2022 (WorldSoilDay),, దాని ప్రచారం 'నేలలు: ఆహారం ఎక్కడ ప్రారంభమవుతుంది' అనేది. నేల నిర్వహణలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం, నేలపై అవగాహన పెంచడం, సమాజాలను ప్రోత్సహించడం. తద్వార ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు, మానవ శ్రేయస్సును నిర్వహించడం.. దానియొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

దేశంలో నేలలు.. రకాలు..
మన దేశంలో నేలలు ఎనిమిది రకాలుగా విభజించారు.
- ఒండ్రు మట్టి నేలలు (Alluvial Soils)
ఇవి అత్యంత సారవంతమైన నేలలు. దేశం మొత్తం భూభాగంలో సుమారు 24 శాతం ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి ఆర్థికంగా అతి ప్రాధాన్యత గల నేలలు. నదులు క్రమక్షయం చేసి తీసుకొని వచ్చే ఒండ్రుమట్టిని నిక్షేపించడం వల్ల ఏర్పడుతాయి. పాత ఒండ్రు మట్టి నేలలను 'భంగర్' అని, కొత్త ఒండ్రు మట్టి నేలలను 'ఖాదర్' అని పిలుస్తారు. ఒండ్రు నేలల్లో ప్రధానంగా వరి, గోధుమ, చెరకు, జనుము మొదలైన పంటలు పండుతాయి.
- నల్లరేగడి నేలలు (Black Soils)
ఇవి ప్రధానంగా బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడ్డాయి. వీటినే రేగర్ నేలలు అని, తనను తాను దున్నుకొనే నేలలని అంటారు. ఇవి వర్షాకాలంలో జిగటగా ఉండి, వేసవిలో ఎండిపోయి, పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడతాయి. పత్తి పంటకు ఇవి అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల వీటిని బ్లాక్ కాటన్ నేలలనీ అంటారు. వీటికి నల్ల రంగు రావడానికి కారణం అందులో కరిగి ఉన్న ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్స్ (టిటాని ఫెర్రస్ మెగ్నీషియం). ఇవి నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం అత్యధికంగా గల నేలలు.
- ఎర్ర నేలలు(Red Soils)
ప్రధానంగా గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందటం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఇవి ఎర్రటి రంగులో ఉండటానికి కారణం ఈ నేలలో ఇనుప ధాతువు అధికంగా కరిగి ఉంటుంది. మన దేశంలో అధికంగా ఉండే నేలలు ఇవి. దేశం మొత్తం భూభాగంలో సుమారు 29 శాతం ఈ నేలలు ఆక్రమించి ఉన్నాయి. దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో.. సుమారు 67 శాతం ఎర్ర నేలలు తమిళనాడులో ఉన్నాయి. ఈ నేలలకు నీరు త్వరగా ఇంకిపోయే గుణం ఉంటుంది.
- లేటరైట్ నేలలు (Laterite Soils)
అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఇవి ఏర్పడ్డాయి. లేటరైట్ అనే లాటిన్ పదానికి బ్రిక్ అనే అర్థం ఉంది. ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి, ఎండినపుడు గట్టిగా ఉంటాయి. కనుక వీటిని దీతీఱషస రశీఱశ్రీ అని కూడా అంటారు. పర్వత శిఖర భాగాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. ఈ నేలల్లో లభించే ముఖ్య ఖనిజం బాక్సైట్. కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, కొబ్బరి తోటలకు ఈ నేలలు శ్రేష్టం.
- శుష్క / ఎడారి నేలలు (Arid and Desert Soils)
ఈ నేలల్లో ఫాస్పరస్ పదార్థాలు సమద్ధిగా ఉంటాయి. నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం అతి తక్కువ.
6. లవణీయ నేలలు / క్షారమత్తిక నేలలు (Saline and Alkaline Soils)
ఇవి సారవంతమైనవి కావు. వీటిని రే / కల్లార్ / ఊసర నేలలు అని పిలుస్తారు.
7. పర్వత, అటవీ నేలలు (Forest and Mountain Soils)
దేశంలో పర్వత వాలుల వెంబడి ఇవి విస్తరించి ఉన్నాయి. అడవులలోని ఆకులు, మొక్కల నుండి తయారైన సేంద్రియ పదార్థాలతో ఈ నేలలు నిండి ఉంటాయి. ఈ నేలలో హ్యూమస్ ఎక్కువ. ఈ నేలల్లో కాఫీ, తేయాకు, ఉష్ణమండల ఫలాలు, సుగంధ ద్రవ్యాలు పండుతాయి.
8. చిత్తడి నేలలు (Peaty and Marshy Soils)
ఇవి తేమ, బురదతో కూడిన నేలలు. అందువల్ల వ్యవసాయానికి నిరుపయోగం. ఇవి ఎక్కువగా కేరళలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆమ్లత్వం కలిగి ఉండి నలుపురంగులో ఉంటాయి. కేరళలో వీటిని స్థానికంగా కరి నేలలు అంటారు.
శాంతిశ్రీ
8333818985